జనసేనకు వచ్చిన ఓట్లు ఇవే....చేదు అనుభవమే మిగిల్చింది
ఎనిమిది అసెంబ్లీ సీట్లలో కనీసం కొన్ని అయినా గెలిస్తే తెలంగాణా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు అన్నది ఒక లెక్క.
తెలంగాణాలో జనసేన పోటీ చేసింది. తొలిసారి అంటూ బరిలోకి దిగింది. లాస్ట్ పంచ్ అన్నట్లుగా పవన్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గానే పవర్ ఫుల్ స్పీచ్ ఇచ్చారు. అయితే ఆయన ప్రచారం అంతా బీసీ సీఎం బీజేపీ చుట్టూనే తిరిగింది. కొన్ని సార్లు ఏపీలోని వైసీపీ ప్రస్తావన తెచ్చారని కూడా చెప్పుకున్నారు.
అధికారంలో ఉన్న బీయారెస్ ని కానీ ప్రత్యర్ధిగా ఉన్న కాంగ్రెస్ ని కానీ పల్లెత్తు మాట అనకుండా పవన్ చేసిన ప్రసంగానికి తెలంగాణా సమాజం ఇచ్చిన ఓట్లు చూస్తే ఖంగు తినిపించేలాగానే ఉన్నాయని అంటున్నారు. ఎనిమిది అసెంబ్లీ సీట్లలో కనీసం కొన్ని అయినా గెలిస్తే తెలంగాణా అసెంబ్లీలో అడుగు పెట్టవచ్చు అన్నది ఒక లెక్క.
అలాగే హంగ్ వస్తే నిర్ణయాత్మకమైన పాత్ర పోషించవచ్చు అన్నది మరో లెక్క. చాలా అంచనాలతో బరిలోకి దిగింది జనసేన. పవన్ సభలకు జనాలు విరగబడి వచ్చారు. అందులో సగం మంది ఓట్లేసినా ఈపాటికి జనసేన ఓట్లు ఎక్కడో ఉండేవి. కానీ అది జరగలేదు అంటే సినీ సెలిబ్రిటీగా పవన్ని చూశారా అన్నదే చర్చ.
ఇదిలా ఉంటే ఫైనల్ రిపోర్ట్ తీసుకుంటే జనసేనకు వచ్చిన ఓట్లు ఇలా ఉన్నాయి. కూకట్ పల్లి- 39,830 మూడవ స్థానం దక్కింది. నాగర్ కర్నూల్-1976 ఓట్లు, అయిదవ స్థానం దక్కింది. ఖమ్మం 2658 ఓట్లు మూడవ స్థానం లభించింది. కొత్తగూడెం 1945 ఓట్లు నాలుగవ స్థానం దక్కింది. వైరా 2712 ఓట్లు నాలుగవ స్థానం, అశ్వారావుపేట 2281 ఓట్లు నాలుగవ స్థానం, కోదాడ 2151 ఓట్లు నాలుగవ స్థానం, తాండూరు 4087 ఓట్లు మూడవ స్థానంగా ఉంది.
మొత్తంగా చూస్తే జనసేనలో అత్యధిక ప్రభావం చూపించింది మాత్రం కూకట్ పల్లి అభ్యర్ధి అనే అంటున్నారు. అక్కడ దాదాపుగా నలభై వేల ఓట్లు లభించాయి. ఇది కొంతవరకూ ఊరటే. కానీ గెలుపు అవకాశం ఉంటుందని పవన్ ఇక్కడ ఎక్కువగా ప్రచారం చేసినా బీయారెస్ కి మెజారిటీయే 64 వేల దాకా వచ్చింది. సో ఏపీ నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న వారు కొంతవరకూ జనసేనకు ఓట్లేసినా ఎక్కువ ఓట్లు మాత్రం బీయారెస్ తీసుకుంది అని తెలుస్తోంది.
ఇక విశ్లేషించుకుంటే కనుక జనసేనకు తెలంగాణా ఎన్నికల్లో తొలి ఎన్నికల పోరాటం చేదు అనుభవమే మిగిల్చింది అని చెప్పాలి. అయితే రానున్న అయిదేళ్ల కాలంలో పవన్ తెలంగాణాలో కూడా గట్టిగా తిరిగితే కనుక కూకట్ పల్లి లాంటి చోట గెలవడం జరుగుతుంది అన్న చిన్నపాటి ఆశను కూడా ఈ చేదులో దాగుంది అని అంటున్నారు.