ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్, వైఎస్సార్ ముద్రలకు ఇదే సాక్ష్యం!
ఇది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ ఫ్యామిలీలకే దక్కడం వారి స్థాయిని చెప్పకనే చెబుతుంది.
ఏపీ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ఘట్టం సాక్ష్యాత్కరించింది. ఇప్పుడు ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఇందులో భాగంగా... కేవలం రెండు కుటుంబాల వారే ఓ రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీలతోపాటు జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్న పరిస్థితి నెలకొంది. ఇటువంటి పరిస్థితి దేశంలో ఎక్కడా లేకపోవడం గమనార్హం. ఇది కేవలం ఎన్టీఆర్, వైఎస్సార్ ఫ్యామిలీలకే దక్కడం వారి స్థాయిని చెప్పకనే చెబుతుంది.
అవును... సాధారణంగా ప్రాంతీయ పార్టీలు ఆ పార్టీ వ్యవస్థాపకుల కుటుంబ సభ్యుల చేతిలో ఉంటాయి. ఇందులో భాగంగా ఏపీలో వైఎస్సార్సీపీ, టీడీపీ, తెలంగాణలో బీఆరెస్స్, ఉత్తరప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ, తమిళనాట డీఎంకే, కాశ్మీర్ లో జమ్మూకాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ మొదలైన పార్టీలన్నీ ఈ కోవలోకే వస్తాయి. ఈ పార్టీలన్నీ ఆ వ్యవస్థాపకులు, వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలోనే నడుస్తుంటాయి.
అయితే.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఒక ఆసక్తికరమైన పరిస్థితి నెలకొంది. ఇందులో భాగంగా ఈ రాష్ట్రంలో నందమూరి తారకరామారావు, వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబాల చేతుల్లో వారి సొంత పార్టీలే కాకుండా.. జాతీయ పార్టీల పగ్గాలు కూడా ఉన్నాయి. దీంతో ఇది అత్యంత అరుదైన, ఆసక్తికరమైన విషయం అని అంటున్నారు పరిశీలకులు. ఇదే సమయంలో ఏపీ రాజకీయాలపై ఎన్టీఆర్, వైఎస్సార్ ఎంత బలమైన ముద్ర వేశారో చెప్పడానికి ఇంతకు మించి రుజువు అవసరం లేదనే చెబుతున్నారు.
ప్రస్తుతం దివంగత ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ.. అల్లుడు చంద్రబాబు అండర్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఆయన కుమారుడు నారా లోకేష్ చేతిలోనూ పనిచేస్తోంది. ఆ పార్టీలో ఆయన కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు! మరోవైపు దివంగత వైఎస్సార్ కుమారుడు జగన్... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్సార్సీపీ)ని స్థాపించారు. ఈ పార్టీకి కర్త, కర్మ, క్రియ అన్నే తానై నడిపిస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలో ఈ రెండు ప్రాంతీయ పార్టీలూ ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఇదే సమయంలో ఏపీలో ఉన్న జాతీయ పార్టీల విషయానికొస్తే... ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి ఉండగా... ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వైఎస్సార్ కుమార్తె షర్మిల ఉన్నారు. దీంతో... అటు ప్రధాన ప్రాంతీయ పార్టీలు, జాతీయ పార్టీలు సైతం ఎన్టీఆర్, వైఎస్సార్ ల కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఉన్నట్లయ్యింది.
ఇది అత్యంత అరుదైన విషయమే కాకుండా... ఏపీ రాజకీయాల్లో అటు ఎన్టీఆర్, ఇటు వైఎస్సార్ ఏ స్థాయిలో ప్రభావం చూపించారనేది కూడా తేటతెల్లమవుతుంది. అందుకే... దటీజ్ ఎన్టీఆర్, దటీజ్ వైఎస్సార్!!