ఈవీఎంలనే వైసీపీ ఇప్పటికీ నమ్ముకుంటోందా ?
వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన చూస్తే ఈవీఎంల వల్లనే తాను ఓడాను అని గాఢంగా నమ్ముతున్నట్లుగా ఉందని అంటున్నారు.;

ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ (ఈవీఎం)ల వల్ల మాల్ ప్రాక్టీసింగ్ కి ఆస్కారం ఎంత మేరకు ఉంది అన్నది ఒక చర్చ. ఆ సంగతి పక్కన పెడితే గత రెండు దశాబ్దాలకు పైగా ఈవీఎంలతోనే దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజల ఆలోచనలనకు అనుగుణంగా తీర్పులు వస్తున్నాయి.
అవినీతి స్కాములు పెద్ద ఎత్తున జరిగాయని కాంగ్రెస్ నాయకత్వంలోని యూపీఏ వన్ టూ సర్కారు మీద విపరీతమైన ఆగ్రహంగా 2014లో బీజేపీకి జనాలు పట్టం కట్టారు. అలాగే దేశంలో చాలా చోట్ల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల మనోభావాలకు అనుగుణంగానే ఫలితాలు ప్రతిబింబించాయని అంతా అనుకున్నారు.
ఇక 2019లో చంద్రబాబు ఓటమి తరువాత ఈవీఎంలని మొదట నింద వేసినా తాజాగా నిండు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఆనాటికి ఓటమికి తానే కారణం అని చెప్పుకున్నారు. దాని కంటే ముందు ఈవీఎంలను బయటకు అన్నా పార్టీలో లోపాలను కూడా గుర్తించి సరిచేసుకున్నారు. పొత్తులను గట్టిగా చేసుకున్నారు.
వ్యతిరేక వర్గాలను అనుకూలం చేసుకున్నారు. పార్టీని గాడిలో పెట్టుకున్నారు. ఇవన్నీ చేయకపోతే 2024లో టీడీపీకి విజయం దక్కేదా అన్న చర్చ ఉంది. అంటే ఓటమి నుంచి గుణపాఠాలు ఏ పార్టీకైనా అవరం అన్నదే ఈ పరిణామాలు తెలియచేస్తున్నాయి.
అలాంటిది వైసీపీ మాత్రం ఈవీఎంలనే ఇంకా నమ్ముకుని కూర్చుంది అని అంటున్నారు. తమ అయిదేళ్ళ పాలన మీద జనాలకు ఎక్కడ వ్యతిరేకత ఉందో ఏ వర్గాలు తమకు దూరం అయ్యాయో అన్న గ్రహింపు దాని మీద ఆత్మ విమర్శతో పాటు సరైన సమీక్ష చేయకుండా ఈవీఎంల మీద నెపం పెట్టి ఎంత కాలం గడుపుతారు అన్న చర్చ వస్తోంది.
ఇదంతా ఎందుకు అంటే అనంతపురం జిల్లాలోని రాప్తాడుకు చెందిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటన చూస్తే ఈవీఎంల వల్లనే తాను ఓడాను అని గాఢంగా నమ్ముతున్నట్లుగా ఉందని అంటున్నారు.
నిజానికి చూస్తే ఏపీలో ఎన్నికలు అన్నవి పూర్తి అయి ఏకంగా పదకొండు నెలలకు దగ్గర పడుతోంది. మరో నెల గడిస్తే ఏడాది అవుతుంది. మరి ఇప్పటికీ ఈవీఎంలదే తప్పు తప్ప మాది కాదన్నట్లుగా వైసీపీ నేతల తీరు వైఖరి ఉందని అంటున్నారు. దీని వల్ల వైసీపీ ఆత్మ విమర్శ చేసుకోవడానికి అవకాశం లేకుండా పోతోంది అని అంటున్నారు.
ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారు కాబట్టే తాము ఓటమి చెందము తప్పించి తమ తప్పు లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి పరిటాల సునీత రాప్తాడు నియోజకవర్గం గెలవడానికి ఏకైక కారణం ఈవీఎంలే అని ఆయన మీడియా ముందు నమ్మకంగా చెబుతున్నారు.
పరిటాల సునీత 2024 ఎన్నికల్లో విజేత కావడానికి ఏకైక కారణం ఈవీఎంలే అని ఆయన అంటున్నారు. ఆమె ఈవీంలను నమ్ముకోబట్టే సామాన్యులకు విలువ ఇవ్వదని హాట్ కామెంట్స్ చేశారు. అలా ఈవీఎంలపై ఆమెకున్న విశ్వాసాన్ని కాపాడుతుందని సెటైర్లు పేల్చారు. ఇక సునీతకు ఈవీఎంలను కొనడానికి తగినంత డబ్బు ఉన్నందున ఆమె ప్రజలతో ఉండాల్సిన అవసరం లేదని ఆలోచిస్తున్నారని ప్రకాష్ రెడ్డి సీరియస్ కామెంట్స్ చేశారు.
మరి ఏపీ ప్రజలు 2024 ఎన్నికల్లో ఇచ్చిన తీర్పు కేవలం ఈవీఎంల మహిమేనా అదే వైసీపీ నేతల నమ్మకమా అన్న చర్చ అయితే వస్తోంది. వైసీపీని జనాలు ఓడించడం వెనక ఈవీఎంలే తప్ప జనాల వ్యతిరేకత వారి అభిప్రాయాలు ఎక్కడా లేవని ఈ రోజుకీ వైసీపీ నమ్ముతోందా అన్నది కూడా అంతా ఆలోచిస్తున్నారు.
అయితే ఇప్పటికే పుణ్య కాలం గడచిపోతోంది. ఇక ఈవీఎంలపై నిందలు వేయడం కూడా వారికి వైసీపీకి మేలు చేయదని అంటున్నారు. మరో వైపు చూస్తే 2019లో వైసీపీ విజయానికి కూడా ఈవీఎంలే కారణమా అని టీడీపీ మద్దతుదారులు రివర్స్ లో విమర్సలు చేస్తున్నారు.
ఇక రాప్తాడుతో పరిటాల ఫ్యామిలీకి చాలా అనుబంధం ఉందని గతంలో కూడా ఆమె గెలిచారు అన్నది మరచిపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. ఈ విధంగా ఈవీఎంలదే తప్పు అని చెప్పుకుంటూ పోతే వైసీపీకే నష్టం తప్ప మరేమీ కాదని అంటున్నారు అంతా.