వైసీపీని వీడుతున్న వారంతా చంద్రబాబు కోవర్టులే!
కేవలం వైసీపీలోనే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా చంద్రబాబు కోవర్టులు ఉన్నారని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే నారాయణస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని వీడుతున్నవారంతా చంద్రబాబు కోవర్టులేనని ఆరోపించారు. ముందు నుంచీ వారంతా చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. వైసీపీలో చంద్రబాబు కోవర్టులు ఉన్నారని.. ఈ విషయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.
కేవలం వైసీపీలోనే కాకుండా బీజేపీ, కాంగ్రెస్ పార్టీల్లో కూడా చంద్రబాబు కోవర్టులు ఉన్నారని నారాయణ స్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో కూడా కొంతమంది చంద్రబాబుతో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. వాళ్ళు ఏం చేస్తారో అనే భయం తనకు ఉందన్నారు. ఈ నేపథ్యంలో నమ్మకస్తులకే సీఎం వైఎస్ జగన్ పట్టం కడుతున్నారని తెలిపారు. ఇలాగే జగన్ ఎవరినీ నమ్మకుండా సొంత నిర్ణయాలు తీసుకోవాలని విన్నవిస్తున్నానన్నారు.
టీడీపీలో ఉన్న కొంతమంది ఎస్సీలు వైసీపీలో టికెట్ల కోసం ప్రయత్నిస్తున్నారని నారాయణస్వామి విమర్శించచారు. చంద్రబాబు వాళ్ళకు డబ్బులు ఇచ్చి ఆ పార్టీలోకి పంపిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు ఎంతకైనా తెగిస్తాడని మండిపడ్డారు. ఈ విషయాన్ని నిరూపించటానికి తాను సిద్ధంగా ఉన్నానన్నారు. గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారిని తీసుకోవద్దని జగన్ కాళ్ళపై పడి అడిగానని తెలిపారు. వాళ్ళంతా మళ్ళీ టీడీపీలోకి వెళ్ళిపోయారన్నారు.
వైఎస్ షర్మిల చంద్రబాబును కలవడం ఆమె విచక్షణకే వదిలేస్తున్నానని నారాయణస్వామి తెలిపారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానికి సోనియాగాంధీ, చంద్రబాబు కారణం అన్న తన వ్యాఖ్యలకు ఇప్పటికీ కట్టుబడే ఉన్నానన్నారు. తానే కాదు ప్రజలందరూ అదే అనుకుంటున్నారని తెలిపారు. మరి వారందరిపై కేసులు పెడతారా అని ప్రశ్నించారు.
కాగా నారాయణస్వామి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. వైఎస్సార్ మరణంపై ఆయన చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత మల్లు రవి తెలంగాణలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నారాయణస్వామిపై మూడు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అయినప్పటికీ ఆయన తన వివాదాస్పద వ్యాఖ్యలను వీడటం లేదు. పైగా వైఎస్సార్ మరణానికి చంద్రబాబు, సోనియానే కారణమనే మాటలకు తాను కట్టుబడి ఉన్నానంటూ వ్యాఖ్యానిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.