టీటీడీ చైర్మన్ గిరీ...ఎపుడు రామా హరీ ?

తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని దేశమంతా లొల్లి జరుగుతున్న వేళ నామినేటెడ్ పదవులను టీడీపీ కూటమి ప్రకటించింది

Update: 2024-09-24 13:39 GMT

తిరుమల తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పెద్ద ఎత్తున కల్తీ జరిగిందని దేశమంతా లొల్లి జరుగుతున్న వేళ నామినేటెడ్ పదవులను టీడీపీ కూటమి ప్రకటించింది. అయితే అందులో టాప్ ప్రయారిటీ లో ఉండాల్సిన టీటీడీ బోర్డు నియామకం అయితే కనిపించలేదు.

ఇది ముందే అంతా ఊహించారు. నిజామికి నంబర్ వన్ పోస్ట్ అది. టీటీడీ చైర్మన్ అంటే మంత్రి పదవి కంటే ఎక్కువ. అలాంటి పోస్టు కోసం ఎందరో ప్రయత్నాలు చేశారు. కానీ అందరి ఆశలను పక్కన పెడుతూ నామినేటెడ్ పందేరం స్టార్ట్ చేశారు. తొలుత ఇరవై కార్పోరేషన్ చైర్మన్ పదవులను అందులోని పాలక మండలిని భర్తీ చేశారు.

కానీ టీటీడీ బోర్డు ఊసు మాత్రం ఎత్తలేదు. అంతే కాదు వంద దాకా ఉన్న చైర్మన్ పదవులలో ఏపీలో ఉన్న అతి పెద్ద దేవాలయాల బోర్డులు కూడా ఉన్నాయి. వాటికి కూడా పాలక మండళ్ళను ప్రకటించలేదు. శ్రీవారి లడ్డూ ప్రసాదం ఊసు లేకపోతే మాత్రం ఈపాటికి అందులో చాలా వరకూ ప్రకటించి ఉండేవారు

ఒక వైపు హిందూ ధార్మిక సంస్థలు మండిపడుతున్న వైనం ఉంది. లడ్డూ ప్రసాదం లో కల్తీ జరిగింది అని భక్తుల మనోభావాలు కూడా తీవ్రంగా గాయపడిన నేపథ్యం ఉంది. పైగా దేవాలయాల పాలనా బాధ్యతలు ధార్మిక సంస్థలకు అప్పగించాలని కోరుతున్నారు. దాంతో ఇపుడు ఆ రచ్చ ఎందుకు అని అనుకున్నారో ఏమో కానీ పక్కన పెట్టేశారు.

దాని ఫలితంగా టీటీడీ చైర్మన్ పోస్టు కూడా ఎవరికీ దక్కకుండా పోయింది. ఈ భారీ పోస్ట్ భర్తీ చేయడం ఇప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు. లడ్డూ ప్రసాదం కల్తీ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చాక అపుడు తాపీగా చేపడతారు అని అంటున్నారు. అంటే 2025 లోకి క్యాలెండర్ మారాల్సిందే అంటున్నారు.

అలా ఆశావహుల నోట్లో లడ్డూ ప్రసాదం కల్తీ ఇష్యూ మట్టి కొట్టినట్లు అయింది అని అంటున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి చెబుతున్నారు.

లడ్డు ప్ర‌సాదం వివాదంతో పాటు తిరుమలలో జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిట్ దర్యాప్తునకు ఆదేశించిందని కూడా మంత్రి తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని మంత్రి వివరించారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో నెయ్యితో పాటు ముడి సరుకులను, నాణ్యతను పరిశీలించాకే వినియోగించాలని ఆలయ అధికారులకు ఆదేశించామ‌ని వెల్ల‌డించారు.

ఇలా మంత్రి స్టేట్మెంట్ ఉంది. కానీ దేవాలయాల విషయంలో అయితే ఇపుడు సీరియస్ గానే అంతా చూస్తారు. అలాగే కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఇక మీదట ఆలయ పాలక మండళ్ళను వాడుకోవడానికి సమ్మతించే సూచనలు లేవు అని అంటున్నారు.

మొత్తం మీద చూస్తే టీటీడీ బోర్డు తో పాటు అతి ముఖ్య అలయాల చైర్మన్ పదవులు పూర్తిగా పెండింగులో పడినట్లుగా చెబుతున్నారు. ఈ విధంగా చూస్తే కూటమికి దక్కాల్సిన చాలా పదవులు కూడా తగ్గిపోయాయని అంటున్నారు. ఇపుడు ఉన్న పదవులతోనే సర్దుకోవాల్సి ఉంటుంది. దాంతో కూటమిలో మూడు పార్టీలకు ఏ విధంగా న్యాయం జరుగుతుంది ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటారు అని చూడాల్సిందే.

Tags:    

Similar News