తెలంగాణ వామపక్ష కార్యదర్శులిద్దరూ పోటీలో.. ఇది అరుదే!

అది వారం కట్టుబాటు. ఈసారి మాత్రం ఇద్దరూ పోటీకి దిగుతున్నారు. అందులోనూ వీరిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడం విశేషం.

Update: 2023-11-06 11:03 GMT

సంప్రదాయ పార్టీలకు భిన్నంగా వెళ్తుంటాయి వామపక్షాలు. ప్రజలను ఆకట్టుకునే ఉచిత పథకాలు, అనవసర తాయిలాలు వారి మేనిఫెస్టోల్లో ఉండవు. సాధ్యం కాని ఊకదంపుడు హామీల ప్రస్తావన కూడా ఉండదు. కేవలం ప్రజా సమస్యలే వారి ఎజెండా. కానీ, వామపక్షాలకు దేశంలో రానురాను ప్రజాదరణ తగ్గుతోంది. దీనిని ఆయా పార్టీల నాయకత్వాలు అంగీకరిస్తూనే, ప్రజల ఆలోచన ధోరణుల్లో వచ్చిన మార్పుగా పేర్కొంటాయి. తమ పంథా పూర్తిగా మార్చుకునేందుకు మాత్రం అంగీకరించవు. అయితే, దేశంలో ఎన్నో పార్టీలు పుట్టాయి. అధికారంలోకీ వచ్చాయి. చివరకు కాలగర్భంలోకీ కలిశాయి. వామపక్షాలు మాత్రం అలా కాదు. అన్ని కాలాల్లోనూ ఎదురీదుతూ మనుగడ సాగిస్తుంటాయి. మరీ ముఖ్యంగా మతతత్వ శక్తులను ఎదుర్కొనేందుకు శాయశక్తులా పాటుపడుతుంటాయి.

చర్చలు కొలిక్కిరాక..

తెలంగాణ, ఏపీల్లోనూ వామపక్షాల పరిస్థితి ఏమంత బాగోలేదు. వాస్తవానికి ప్రజా సమస్యల పట్ల నిఖార్సైన పోరాటం చేసేది లెఫ్ట్ పార్టీలే. అయితే, 20 ఏళ్లుగా ప్రభుత్వాలు ప్రజలకు నేరుగా లబ్ధి చేకూర్చే పథకాలను అమలు చేస్తూ, ఉచిత తాయిలాలు ఇస్తుండడంతో వామ పక్షాలకు పోరాటాలకు ఆస్కారం లేకుండా పోయింది. జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీలకు అంశాలు దొరకడం లేదు. దీంతో సంప్రదాయ ఓటర్లను నమ్ముకుంటూ అవకాశం ఉన్న సందర్భంలో గళమెత్తుతూ ఉనికి చాటుతున్నయి. కాగా, తెలంగాణలో ఇప్పుడు వామపక్షాల పొత్తుల వ్యవహారం పెద్ద చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. గత ఏడాది చివర్లో మునుగోడు ఎన్నికల సందర్భంగా అధికార బీఆర్ఎస్ పార్టీ పిలిచి మరీ వామపక్షాలను అక్కున చేర్చుకుంది. ఈ కలయిక అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందని అప్పట్లో ప్రకటనలు కూడా విడుదల చేశారు. కానీ, బీఆర్ఎస్ ఎన్నికలకు వచ్చేసరికి ఆ అవకాశం ఇవ్వకుండా అభ్యర్థులను ప్రకటించేసింది. వారు డిమాండ్ చేసిన సీట్ల సంఖ్య ఎక్కువగా ఉందని అధికార పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. బీఆర్ఎస్ చేతిలో మోసపోయినట్లు భావించిన వామపక్షాలు.. పొత్తు కోసం కాంగ్రెస్ ను సంప్రదించాయి. కొన్ని నెలలుగా సాగుతున్న ఈ వ్యవహారం ఇటీవలి వరకు కొలిక్కిరాలేదు.

సీపీఐకి ఓకే.. సీపీఎంకు నో?

పోటీకి దిగే స్థానాల విషయంలో పంచాయతీ కారణంగా సీపీఎంతో కాంగ్రెస్ కు పొత్తు కుదరలేదు. అదే సీపీఐ విషయంలో మాత్రం లంకె కుదిరింది. దీంతో సీపీఎం ఒంటరి పోటీకి సిద్ధమైంది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తన సొంత నియోజకవర్గం పాలేరు నుంచి బరిలో దిగుతున్నారు. ఇక సీపీఐకి పొత్తులో భాగంగా కాంగ్రెస్ పార్టీ కొత్తగూడెం సీటును ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఇక్కడినుంచి ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు బరిలో ఉంటారని చెబుతున్నారు. ఓ విధంగా ఇది అరుదైన సందర్భమే. ఎందుకంటే వామపక్షాల రాష్ట్ర కార్యదర్శులు, జిల్లా కార్యదర్శులు ప్రత్యక్ష ఎన్నిలకు దూరంగా ఉంటారు. అది వారం కట్టుబాటు. ఈసారి మాత్రం ఇద్దరూ పోటీకి దిగుతున్నారు. అందులోనూ వీరిద్దరూ ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందినవారే కావడం విశేషం.

కొసమెరుపు: సీపీఐ, సీపీఎంలకు ఉమ్మడి ఖమ్మంలో గట్టి పట్టుంది. సుజాతనగర్ నియోజకవర్గం నుంచి గతంలో రబజ్ అలీ ఐదుసార్లు గెలిచారు. మధిర నుంచి బోడేపూడి వెంకటేశ్వరరావు పలుసార్లు నెగ్గారు. వీరిద్దరూ 1994లో అసెంబ్లీలో సీపీఐ, సీపీఎంలకు శాసన సభా పక్ష నాయకులుగా వ్యవహరించారు. అయితే, 1996-97 సమయంలో ఇద్దరూ చనిపోయారు. సుజాతనగర్ పునర్విభజనలో రద్దు కాగా, మధిర ఎస్సీ రిజర్వుడ్ అయింది. ఒకవేళ ఇప్పుడు గనుక తమ్మినేని, కూనంనేని గెలిస్తే వీరిద్దరూ రజబ్ అలీ, బోడేపూడి తరహాలో ఒకే సమయంలో అసెంబ్లీలో ఉంటారు. అది అరుదైన సన్నివేశమే.

Tags:    

Similar News