అత్యధిక హెచ్-1బీ వీసాలను జారీ చేస్తున్న టాప్-10 కంపెనీలివే.. 4 మనవాళ్లవే!
అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో భారత సంతతికి చెందిన ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలప్పటి నుంచి హెచ్-1బీ వీసాలకు సంబంధించిన చర్చ అటు అగ్రరాజ్యంలోనూ, ఇటు భారత్ లోనూ విపరీతంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి వైట్ హౌస్ లోకి ఎంటరైతే.. ఈ వీసాలపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
అయితే.. ఇటీవల హెచ్-1బీ వీసాలపై ట్రంప్ కాస్త సానుకూలంగానే మాట్లాడగా... ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామి మాత్రం హెచ్-1బీ వీసాలను అత్యంత బలంగా సమర్ధిస్తున్నారు. నేడు స్పేస్ ఎక్స్, టెస్లా లాంటి ఎన్నో కంపెనీలు స్థాపించిన తాను హెచ్-1బీ వీసా ద్వారానే అమెరికాకు వచ్చినట్లు ఎలాన్ మస్క్ బలంగా నొక్కి చెప్పారు.
2012లో ఈ హెచ్-1బీ సమస్యను క్లిష్టమైనదిగా కేవలం 2.1 శాతం మంది అభిప్రాయపడగా.. గత ఏడాది ఎన్నికల సమయం అక్టోబర్ నుంచి జరిగిన యూగోవ్ పోల్ లో 14.6 శాతం మంది నమోదిత ఓటర్లు ఈ హెచ్-1బీ వీసా వ్యవహారాన్ని అత్యంత క్లిష్టమైన సమస్యగా పరిగణించారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.
ఈ సమయంలో ఓ ఆసక్తికర విషయం తెరపైకి వచ్చింది. అత్యధికంగా హెచ్-1బీ వీసాలు జారీ చేస్తున్న టాప్ - 10 గ్లోబల్ కంపెనీల జాబితా తెరపైకి రాగా.. అందులో నాలుగు కంపెనీలు భారత సంతతికి చెందినవారివే కావడం గమనార్హం. ఇందులో ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో, హెచ్.సీ.ఎల్ లు ముందున్నాయి.
అవును... అమెరికా జారీ చేసే హెచ్-1బీ వీసాల్లో భారత సంతతికి చెందిన ఐటీ కంపెనీలు దూకుడు చూపిస్తున్నాయి. మొత్తం హెచ్-1బీ వీసాల్లో ఐదింట ఒక వంతు (20 శాతం) మన సంస్థలే దక్కించుకుంటున్నాయని అంటున్నారు. అమెరికా ఇమిగ్రేషన్ విభాగం గణాంకాలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.
యూఎస్ ప్రభుత్వ డేటా ప్రకారం 2015 నుంచి ప్రతీ ఏటా ఆమొదించబడిన మొత్తం హెచ్-1బీ వీసా పిటిషన్ లలో 70 శాతానిపైగా భారతదేశానికి చెందిన వ్యక్తులే ఉన్నారని అంటున్నారు. యూఎస్ జారీ చేసిన 1,30,000 హెచ్-1బీ వీసాల్లో సుమారు 24,766 భారతీయ సంతతి కంపెనీలకూ కేటాయించబడ్డాయని చెబుతున్నారు.
ఈ క్రమంలో... అత్యధిక వీసాలు పొందిన వాటిలో అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్ ఎల్.ఎల్.సీ ముందుంది. ఈ సంస్థకు 9,265 వీసాలు లభించాయి. ఆ తర్వాత స్థానంలో ఇన్ఫోసిస్ 8,140 వీసాలతో నిలవగా.. కాగ్నిజెంట్ 6,321 వీసాలతో మూడో స్థానంలో నిలిచింది. భార సంస్థల్లో మాత్రం ఇన్ఫోసిస్ టాప్ లో నిలిచింది.
ఈ సందర్భంగా అత్యధిక హెచ్-1బీ వీసాలను స్పాన్సర్ చేస్తున్న టాప్ - 10 కంపెనీల జాబితా ఇప్పుడు చూద్దామ్..!
1. అమెజాన్ డాట్ కామ్ సర్వీసెస్ ఎల్.ఎల్.సీ - 9265
2. ఇన్ఫోసిస్ లిమిటెడ్ - 8140
3. కాగ్నిజెంట్ టెక్నాలజీస్ సొల్యూషన్స్ - 6321
4. గూగుల్ ఎల్.ఎల్.సీ - 5364
5. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ - 5274
6. మెటా ఫ్లాట్ ఫామ్స్ ఐ.ఎన్.సీ. - 4844
7. మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ - 4725
8. యాపిల్ ఐ.ఎన్.సీ. - 3873
9. హెచ్.సీ.ఎల్. అమెరికా ఐ.ఎన్.సీ - 2953
10. ఐబీఎం కార్పొరేషన్ – 2906