టీడీపీ-జనసేన కూటమికి 135 సీట్లు : రఘురామ
ఈ క్రమంలో మీడియాతో రఘురామ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో సంచలనాలు జరుగుతాయని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ప్రస్తుతం సంక్రాంతి సంబరాల్లో పాల్గొనేందుకు ఢిల్లీ నుంచి హైకోర్టు అభయం ఇచ్చిన నేపథ్యంలో నరసాపురం వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు గ్రామాల్లో తిరుగుతూ సందడి చేస్తున్నారు. తాజాగా మావుళ్లమ్మ జాతరలోనూ పాల్గొన్నారు. ఈ క్రమంలో మీడియాతో రఘురామ మాట్లాడుతూ.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
వచ్చే ఎన్నికల్లో ఏపీలో జనసేన-టీడీపీ కూటమి పార్టీని ప్రజలు ఆదరిస్తారని తెలిపారు. వారి ఆశీర్వాదంతో ఏకంగా 135 స్థానాల్లో పార్టీ విజయం దక్కించుకుంటుందని తెలిపారు. ఈ విషయంలో ఇప్పటికే కసరత్తు కూడా చేస్తున్నారని, తాను కూడా సొంతగా సర్వే చేయించినట్టు రఘురామ తెలిపారు. వైసీపీ ప్రభుత్వం పీడ ఎప్పుడు పోతుందా? అని ప్రజలు ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీలుస్తుందని తెలిపారు.
షర్మిల ప్రభావం కాంగ్రెస్‌పై ఉంటుందని.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓట్లను కాంగ్రెస్ పార్టీ చీల్చేస్తుందని.. దీని ప్రభావం అధికార పార్టీపై పడుతుందని రఘురామ తెలిపారు. కాంగ్రెస్ అనుకూల వాదులంతా ఆమె వెంటే నడుస్తారని భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూడడం ఖాయమని.. షర్మిల దెబ్బతో చాలా మంది నాయకులు బ్యాక్ టూ పెవిలియన్ బాట పడుతున్నారని రఘురామ వివరించారు.
జనసేన-టీడీపీ కూటమి అభ్యర్థిగా తాను నరసాపురం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నానని.. తాను మరోసారి విజయం దక్కించుకుంటానని ఆయన చెప్పారు. ఈ విషయంలో ఎవరు అడ్డుపడినా.. ప్రజలు మాత్రం తన వెనుకే ఉన్నారని చెప్పారు. న్యాయ పోరాటాలు తనకు కొత్తకాదని.. ఓ ప్రశ్నకు సమాధానం గా చెప్పారు.