రైల్లో పిల్లల టికెట్లపై మోడీ మాష్టారి బాదుడుతో ఎంత ఆదాయమంటే?
ఈ మార్పుల కారణంగా రైల్వేశాఖకు ఎంత ఆదాయం వచ్చిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది.
ప్రధాని మోడీ మాటలకు చేతలకు ఏ మాత్రం లింకు ఉన్నట్లుగా కనిపించదు. తియ్యటి మాటలతో ఇలాంటి ప్రధాని ఇంతవరకు ఎందుకు లేరన్నట్లుగా ఉంటుంది. చేతల విషయానికి వస్తే.. పెద్ద వయస్కులు లేదు. చిన్న పిల్లలు లేదు. తాను బాదాలనుకున్న బాదుడ్ని నిర్మోహమాటంగా బాదేసే తీరు చూస్తే.. ఆయన నిర్ణయాలు ఎలా ఉంటాయన్న విషయం ఇట్టే అర్థమయ్యేలా ఉంటాయి. మోడీ తాతా అధికారంలోకి వచ్చిన తొలి టర్మ్ లో ట్రైన్ లో ప్రయాణించే చిన్నారుల టికెట్లకు సంబంధించి కొన్ని నిబంధనల్ని మార్చటం తెలిసిందే.
ఈ మార్పుల కారణంగా రైల్వేశాఖకు ఎంత ఆదాయం వచ్చిందన్న విషయం తాజాగా బయటకు వచ్చింది. ఏడేళ్ల క్రితం మోడీ సర్కారు ట్రైన్ లో ప్రయాణించే చిన్నారుల టికెట్ల విషయంలో కొత్త నిబంధనల్ని తీసుకురావటానికి ముందు.. 5-12 ఏళ్ల చిన్నారులకు విడిగా వేరే బెర్తు ఎంపిక చేసుకున్నా.. టికెట్ ధరలో సగాన్నిమాత్రమే వసూలు చేసేవారు. కానీ.. దానిపై ఫోకస్ చేసిన మోడీ సర్కారు.. 2016 ఏప్రిల్ 21 నుంచి పిల్లలు విడిగా బెర్తు కానీ సీటు ఎంపిక చేసుకుంటే.. పెద్దల మాదిరే పూర్తి టికెట్ ధర చెల్లించేలా నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.
దీనిపై విమర్శలు వచ్చినా పెద్దగా పట్టించుకోని ఆయన.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా అమలు చేశారు. కొవిడ్ సాకు చూపించి పెద్ద వయస్కులు (సీనియర్ సిటిజన్లు) రైల్లో ప్రయాణించే వేళ.. వారికి 50 శాతం టికెట్ రాయితీని సైతం కట్ చేయటం తెలిసిందే. గత ప్రభుత్వాలు పిల్లల టికెట్లకు హాఫ్ ఛార్జీ వసూలు చేస్తే.. మోడీ సర్కారు అందుకు భిన్నంగా వసూలు చేయటం తెలిసిందే.
2016-17 నుంచి 2022-23 వరకు వేర్వేరు ఆర్థిక సంవత్సరాల్లో పిల్లల టికెట్ల మీద ఆదాయం భారీగా పెరిగినట్లుగా పేర్కొన్నారు. ఈ మొత్తం కాలానికి రూ.2800 కోట్లను పిల్లల టికెట్లతో తల్లిదండ్రుల జేబుల మీద భారాన్ని మోపినట్లుగా వెల్లడైంది.
రైళ్లలో ప్రయాణించే మొత్తం పిల్లల్లో 70 శాతం మందిపై పూర్తిటికెట్ చెల్లించే భారం పడిన విషయాన్ని సమాచార హక్కు చట్టం కింద దాఖలు చేసిన దరఖాస్తు కారణంగా బయటకువచ్చింది. ఇక.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.560 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా పేర్కొన్నారు. ఏమైనా.. పిల్లలు.. పెద్దల టికెట్ల విషయంలోనూ మరీ ఇంత బాదుడు అవసరమా? అన్న ప్రశ్నకు సరైన సమాధానాన్ని మోడీ సర్కారు ఇప్పటివరకు ఇచ్చింది లేదు.