ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అప్పుడే!

ఉచిత బస్సు ప్రయాణంపై వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకం అమలవుతుండటంతో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని తెలిపారు.

Update: 2024-06-20 13:24 GMT

ఆంధ్రప్రదేశ్‌ లో తాము అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని టీడీపీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో తన హామీని నిలబెట్టుకునే పనిలో ఉంది. నెల రోజుల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రవాణా, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు.

ఉచిత బస్సు ప్రయాణంపై వచ్చే 15 రోజుల్లో కమిటీ వేస్తామన్నారు. కర్ణాటక, తెలంగాణల్లో ఈ పథకం అమలవుతుండటంతో ఆ రాష్ట్రాల్లో పర్యటించి అధ్యయనం చేస్తామని తెలిపారు.

విజయవాడ బస్టాండ్‌ లో మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తాజాగా తనిఖీలు నిర్వహించారు. అక్కడ ప్రయాణికుల ఇబ్బందులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన విజయవాడ బస్టాండ్‌ చుట్టూ కాంపౌండ్‌ వాల్‌ నిర్మాణంపై అధికారులతో చర్చిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా గత జగన్‌ ప్రభుత్వంపై మండిపడ్డారు. జగన్‌ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క బస్సూ కొనలేదని.. అలాగే ఒక్క బస్సుకూ రిపేర్లు చేయించలేదని ధ్వజమెత్తారు.

దూర ప్రాంతాలకు నడిచే బస్సుల సంఖ్య పెంచుతామని తెలిపారు. కొత్తగా ఎలక్ట్రిక్‌ బస్సులు కొంటామని చెప్పారు. బస్‌ స్టేషన్లలో భోజన సదుపాయాలు, వాష్‌ రూమ్‌లు మెరుగ్గా ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. భద్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.

కోట్లాది మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే సంస్థ ఏపీఎస్‌ ఆర్టీసీ అని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి గుర్తు చేశారు. ఆర్టీసీకి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులున్నాయని చెప్పారు. వాటిని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

అలాగే ప్రయాణికులు, ఉద్యోగులను కాపాడుకునే బాధ్యత రాష్ట ప్రభుత్వంపై ఉందని తెలిపారు. ఆర్టీసీ మనుగడ కాపాడేందుకు, నాణ్యమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో ప్రస్తుతం రోడ్ల దుస్థితి మారాల్సి ఉందన్నారు. రోడ్లు మారితేనే ప్రయాణికులు సంతోషంగా గమ్యస్థానాలకు చేరతారని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. ప్రయాణికులు, ఉద్యోగులకు ఇచ్చిన టీడీపీ ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తామన్నారు.

గత ప్రభుత్వంలో ఏపీఎస్‌ ఆర్టీసీకి, ఉద్యోగులకు నష్టం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి రాంప్రసాద్‌ రెడ్డి హెచ్చరించారు. ఇకపై ఉద్యోగులు చనిపోతే ఇచ్చే అంత్యక్రియల ఖర్చు రూ.15 నుంచి రూ.25 వేలకు పెంచుతామని హామీ ఇచ్చారు.

Tags:    

Similar News