వలసదారులను పంపడానికి సైనిక విమానాలే ఎందుకు.. ఖర్చెంత?
రెగ్యులర్ విమానాలతో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలా ఎక్కువ.. అయినప్పటికీ ఇవే ఎందుకు అనే చర్చ తెరపైకి వచ్చింది.
అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వలసదారులకు సంకెళ్లు వేసి మరీ వారి వారి స్వదేశాలకు పంపించేస్తున్నారు డొనాల్డ్ ట్రంప్. ఈ విషయంలో వారిని తరలించడానికి సీ-17 సైనిక రవాణా విమానాలను ఉపయోగిస్తున్నారు. రెగ్యులర్ విమానాలతో పోలిస్తే వీటికయ్యే ఖర్చు చాలా ఎక్కువ.. అయినప్పటికీ ఇవే ఎందుకు అనే చర్చ తెరపైకి వచ్చింది.
అవును... తమ దేశంలో ఉన్న అక్రమ వలసదారులను ట్రంప్ వెనక్కి పంపించేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సైనిక విమానాల్లో వారిని పంపించడంపై పలు దేశాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమవుతుంది. ఇందులో భాగంగా.. ఇటీవల ఈ విషయంలో కొలంబియా అధ్యక్షుడు గుస్తావ్ పెట్రో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
అయితే... తనకు అడ్డు చెబితే టారిఫ్ లతో కొడతానన్నట్లుగా స్పందించిన ట్రంప్ సుంకాలు 25% విధిస్తున్నట్లు ప్రకటనలు వదిలారు! దీంతో... కొలంబియా ప్రెసిడెంట్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది! ఇక తాజాగా అమెరికా నుంచి అమృత్ సర్ కి 104 మంది భారతీయులతో అమెరికా సైనిక విమానం ల్యాండ్ అయ్యింది.
వాస్తవానికి అమెరికా సైన్యం సరిహద్దుల రక్షణకు సాయం చేస్తుందని ట్రంప్ ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను జారీ చేశారు. దీనిపై స్పందించిన నాటి టెంపరరీ రక్షణ మంత్రి రాబర్ట్ సెల్సెస్ స్పందిస్తు.. 5,000 మంది అక్రమ వలసదారుల తరలింపులో అమెరికా సైన్యం తరుపున హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగానికి సాయం చేస్తామని పేర్కొన్నారు.
దీనికి తోడు.. అక్రమ వలసలపై అమెరికా దాడులను గుర్తు చేసేలా కూడా సైనిక విమానాలను వినియోగిస్తున్నారని అంటున్నారు. అయితే... సమీప దేశలైన మెక్సికో, గ్వాటెమాల, హోండురాస్ వంటి దేశస్థులను తరలించడానికి సైనికేతర విమానాలను కూడా అమెరికా ప్రభుత్వం వినియోగిస్తుంది. ఈ ఖర్చులో తేడా ఏంతనేది ఇప్పుడు చూద్దామ్!
ఇటీవల అమెరికా సమీప దేశమైన గ్వాటెమాలకు సైనిక విమానంలో వలసదారులను పంపించారు. ఈ సమయంలో ఒక్కో వలసదారుడిని పంపడానికి 4,675 డాలర్ల వరకూ సగటున ఖర్చైందని కథనాలొచ్చాయి. అంటే... భారత కరెన్సీలో సుమారు రూ.4 లక్షలు అన్నమాట. వాస్తవానికి బిజినెస్ విమానంలో ఫస్ట్ క్లాస్ టిక్కెట్ లో పంపినా 853 డాలర్లు సరిపోతాయని చెబుతున్నారు.
ఇక... ఐసీఈ ఛార్టర్ విమానాల కంటే కూడా ఈ సైనిక విమానాల్లో ప్రయాణమే ఖర్చుతో కూడుకున్నదని చెబుతున్నారు. ఛార్టర్ ఫ్లైట్స్ లో గంటకు 17,000 డాలర్లు (సగటున ఒక్కొక్కరికీ 630 డాలర్లు) ఖర్చవుతుండగా.. అదే సీ17 అయితే గంటకు 28,500 డాలర్లు (సగటున ఒక్కొక్కరికీ 4,675 డాలర్లు) వ్యయం అవుతుంది.