వలస వచ్చే వారికి తొలి షాకిచ్చేసిన ట్రంప్
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ యాప్ సేవల్ని నిలిపి వేస్తున్నట్లుగా నోటీసు విడుదల చేసింది.
చెప్పిందే చేశారు డొనాల్డ్ ట్రంప్. అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేసిన నిమిషాల వ్యవధిలో తాను మాటలతో చెప్పింది చేతల్లో చేసి చూపించి సంలనంగా మరారు. అమెరికా అధ్యక్షుడి హోదాలో వలసలపై తొలి షాక్ ఇచ్చిన ట్రంప్.. దీనికి సంబంధించిన ఆదేశాల్ని జారీ చేశారు. మెక్సికో సరిహద్దుల మీదుగా వలసల్ని అనుమతించే సీబీపీ యాప్ నకు ట్రంప్ ముగింపు పలికారు.
అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ శాఖ ఈ యాప్ సేవల్ని నిలిపి వేస్తున్నట్లుగా నోటీసు విడుదల చేసింది. దీంతో అమెరికా నైరుతి సరిహద్దు వెంబడి ఉన్న పోర్ట్ ఆఫ్ ఎంట్రీల మీదుగా అమెరికాలోకి ప్రవేవించేందుకు వీలుగా అపాయింట్ మెంట్స్ బుక్ చేసుకునే సౌలభ్యం ఇకపై ఉండదని స్పష్టం చేస్తూ ఒక ప్రకటన విడుదలైంది.
ప్రస్తుతం జారీ చేసిన అపాయింట్ మెంట్స్ అన్నీ రద్దు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు. మెక్సికో సరిహద్దుగా అమెరికాకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్న వారందరికి ఇదో తీవ్రమైన షాక్ గా మారింది. తాజా పరిణామాల నేపథ్యంలో కీలకంగా మారిన సీబీపీ వన్ యాప్ ఏమిటి? అదెలా పని చేస్తుంది? అన్న ప్రశ్నలు తెర మీదకు వచ్చాయి. ఇంతకూ ఈ యాప్ ఎలా పని చేసేది? దీన్ని ఏర్పాటు వెనుక ఉద్దేశాల్ని చూస్తే.. ఉపాది కోసం మెక్సికో సరిహద్దు మీదగా అమెరికాలోకి వచ్చే వారి కోసం ఈ యాప్ ను సిద్దం చేశారు. ఈ యాప్ లో దరఖాస్తు చేసుకున్న వారిలో రోజుకు 1450 మందిని లాటరీ ద్వారా ఎంపిక చేసుకొని అమెరికాలో ప్రవేశించేందుకు అనుమతిస్తారు.
మెక్సికో సరిహద్దు వెంబడి ఉన్న ఎనిమిది సరిహద్దుల క్రాసింగ్ ల మీదుగా వీరిని ఉపాధి నిమిత్తం అమెరికాలోకి ప్రవేశించేందుకు ఓకే చెబుతారు. అమెరికా అధ్యక్షుడు జారీ చూసే ఇమిగ్రేషన్ పెరోల్ అనే ఆదేశాల సాయంతో వీరిని అమెరికాలోకి అనుమతిస్తారు. ట్రంప్ రాక అనంతరం.. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నిమిషాల వ్యవధిలోనే ఈ యాప్ కు మంగళం పాడేశారు.