డేంజర్ గేమ్ మొదలు పెట్టిన కేటీఆర్

రాజకీయ మైలేజీ కోసం ఆయన పడుతున్న తపనలో భాగంగా తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.;

Update: 2025-04-04 07:03 GMT
డేంజర్ గేమ్ మొదలు పెట్టిన కేటీఆర్

రాజకీయంగా పార్టీల మధ్య వైరుధ్యాలు మామూలే. దీన్ని ఎవరూ కాదనలేరు. అధికారం ఏ పార్టీకి శాశ్వితం కాదు. కాకుంటే.. తాము అధికారంలో ఉన్నప్పుడు ఒకలా.. విపక్షంలో ఉన్నప్పుడు మరోలా వ్యవహరించటంతోనే అసలు పంచాయితీ. అలా ఉన్నా ఫర్లేదు కానీ.. కొన్ని గీతల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దాటకూడదు. ఈ విషయాన్ని బీఆర్ఎస్ ముఖ్యనేత కేటీఆర్ మిస్ అయ్యారా? రేవంత్ సర్కారు మీద ఉన్న ఫస్ట్రేషన్.. రాజకీయ మైలేజీ కోసం ఆయన పడుతున్న తపనలో భాగంగా తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ఇమేజ్ ను భారీగా దెబ్బ తీస్తాయన్న మాట బలంగా వినిపిస్తోంది.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన 400 ఎకరాల (చట్టపరంగా యాజమాన్య హక్కులు లేవనుకోండి) భూమిని చదును చేసి.. వాటిని వేలం వేయాలన్న ప్రభుత్వ ఆలోచనను బీఆర్ఎస్ వ్యతిరేకిస్తున్న సంగతి పాతదే. అయితే.. తాజాగా ప్రెస్ మీట్ పెట్టిన కేటీఆర్.. ఈ భూమల్ని ఎవరైనా కొంటే డబ్బులు నష్టపోతారని.. తాము అధికారంలోకి వచ్చినంతనే.. ఈ వేలంలో భూములు సొంతం చేసుకున్న వారి నుంచి తిరిగి తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని తాము ఇప్పుడే చెబుతున్నామని.. ఈ భూముల వేలంలోకి రియల్ ఎస్టేట్ సంస్థలు అడుగుపెట్టొద్దని వార్నింగ్ ఇచ్చిన వైనం హాట్ టాపిక్ గా మారింది. ఈ మాట తాను ఒక్కడినే చెప్పట్లేదని.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే మాట్లాడుతున్నట్లుగా కేటీఆర్ స్పష్టం చేశారు. మూడేళ్ల తర్వాత అధికారం తమదేనని.. ఆ భూములన్నీ వెనక్కి తీసుకుంటామని స్పష్టం చేశారు.400 ఎకరాల్లో ఎకో పార్కును ఏర్పాటు చేస్తామన్న కేటీఆర్.. ముఖ్యమంత్రి రేవంత్ రియల్ బ్రోకర్ మాదిరి కాదు మనిషిలా ఆలోచించాలని వ్యాఖ్యానించారు.

రాజకీయంగా ఇష్టారాజ్యంగా మాటలు అనుకోవటాన్ని అర్థం చేసుకోవచ్చు. కానీ.. ఈ తరహా బెదిరింపులు మంచిది కాదన్న విషయాన్ని కేటీఆర్ మర్చిపోయినట్లున్నారు. అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్ని.. తాము అధికారంలోకి వచ్చినంతనే తమ పాలసీని అమలు చేస్తామని చెప్పటం తప్పేం కాదు. కానీ.. ఇందులో వ్యాపారుల్ని చేర్చటమే అభ్యంతరమంతా. ఒకవేళ.. భూముల అమ్మకం విషయంలో అభ్యంతరాలు ఉంటే కోర్టు ఉన్నాయి. వాటిని ఆశ్రయించి.. న్యాయపోరాటంచేయటం తప్పు కాదు.

అందుకు భిన్నంగా మేం చెబుతున్నాం.. మీరు భూములు కొంటే రేపు మేం పవర్లోకి వచ్చిన తర్వాత ఆ భూముల్ని వెనక్కి తీసుకుంటామని చెప్పే కేటీఆర్ మాటలు తెలంగాణ ఇమేజ్ ను దెబ్బ తీస్తాయని చెబుతున్నారు. ఒక గ్లోబల్ సిటీగా ఉన్న హైదరాబాద్ లో ఒక రాజకీయ పార్టీ ప్రభుత్వం నుంచి మరో పార్టీ చేతికి అధికారం బదిలీ అయిన వెంటనే.. గత ప్రభుత్వం చేపట్టిన వేలాన్ని రద్దు చేస్తామన్న మాట.. తెలంగాణ రాష్ట్ర వాణిజ్య ఇమేజ్ ను దెబ్బ తీస్తుందని చెబుతున్నారు.

ఈ రోజున కేటీఆర్ చెప్పినట్లే.. రేపొద్దున బీఆర్ఎస్ అధికారంలో ఉన్న నాడు.. మరో విపక్షం ఇదే తరహాలో వార్నింగ్ లు ఇస్తే పరిస్థితేంటి? ఇలా ఏ పార్టీకి ఆ పార్టీ హెచ్చరికలు చేసుకుంటూ పోతే.. తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విషయంలో కార్పొరేట్ సంస్థలు పునరాలోచనలో పడవా? అదే జరిగితే.. డ్యామేజ్ తెలంగాణ ఇమేజ్ కే అన్న విషయాన్ని మర్చిపోకూడదు. తనను తాను మేధావిగా.. సున్నిత మనస్కుడిగా అభివర్ణించుకునే కేటీఆర్.. ఇలాంటి తప్పులు ఎందుకు చేస్తున్నట్లు? తెలంగాణ రాజకీయ క్రీడను డేంజర్ గేమ్ గా మార్చటం సరైనదేనా? అన్నది ప్రశ్నగా మారింది.

Tags:    

Similar News