'ఫ్రీ పనామా'.. నెగ్గిన ట్రంప్. 48 ఏళ్ల తర్వాత ఫ్రీ జర్నీ!
అయితే, తమ దేశానికి చెందిన ఆస్తిపై అమెరికా పెత్తనం ఏమిటంటూ పనామాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది.
తానే కట్టించిన కాల్వలో.. తానే ఫీజు కడుతూ ప్రయాణించింది అమెరికా.. దాదాపు ఐదు దశాబ్దాలుగా ఇదే జరుగుతోంది.. కానీ, ఇప్పుడు కథ మారింది. పనామాపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పంతం నెరవేరింది. నౌకాయాన భారం తగ్గిస్తూ 1914లో అట్లాంటిక్-పసిఫిక్ సముద్రాలను కలుపుతూ అమెరికా భారీ వ్యయంతో పనామా కాల్వను నిర్మించింది. మొదట్లో దీనిని అమెరికానే నిర్వహించింది. అయితే, తమ దేశానికి చెందిన ఆస్తిపై అమెరికా పెత్తనం ఏమిటంటూ పనామాలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. చివరకు ఘర్షణలు కూడా చెలరేగాయి.
పరిస్థితులు తీవ్రంగా మారడంతో 1977లో అమెరికా అధ్యక్షుడిగా ఉన్న జిమ్మీ కార్టర్ పనామా కాల్వను తటస్థంగా ఉంచే షరతుపై
అప్పజెప్పారు. ఏ ముప్పు వచ్చినా అమెరికాకు దానిని రక్షించుకొనే హక్కు ఉంది. అమెరికా అప్పగించాక పనామా ప్రభుత్వం కూడా కాల్వ అభివృద్ధికి భారీగానే ఖర్చు చేసింది.
ట్రంప్ పనామా కెనాల్ విషయంలో మొదటినుంచి ఒకటే పట్టుదలగా ఉన్నారు. ఆ పంతం ఇప్పుడు కొంత నెగ్గించుకొన్నారు. పనామా కాల్వలో అమెరికా నౌకలు ఉచితంగా ప్రయాణించేందుకు ఆ దేశం ఒప్పుకొనేలా చేశారు. ఈ మేరకు అమెరికా రక్షణ మంత్రి హెగ్సే, పనామా పబ్లిక్ సెక్యూరిటీ మంత్రి ఫ్రాంక్ అలెక్స్ కు మధ్య ఒప్పందం కుదిరింది. దీనిప్రకారం యుద్ధ నౌకలు ఈ కెనాల్ నుంచి ప్రయాణించినప్పుడు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం ఉండదు.
అమెరికాకు భారీగా మిగులు..
పనామాలో ఫ్రీ జర్నీతో అమెరికా ప్రభుత్వ నౌకలకు భారీ మొత్తంలో నగదు మిగులుతుందని భావిస్తున్నారు. పనామా అక్రమ వలసదారులపై విరుచుకుపడుతోందని అమెరికా రక్షణ మంత్రి మెచ్చుకొన్నారు. పనామా కాల్వలో ఫ్రీ జర్నీని అమెరికా విదేశాంగ శాఖ కూడా ధ్రువీకరించింది. కొన్నేళ్ల కిందటే పనామా అమెరికాకు రాయితీలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. మరిప్పుడు ఎంతవరకు ఇస్తారో చూడాలి.
తాజా అంగీకారంతో ట్రంప్.. పనామా కాల్వను తిరిగి స్వాధీనం చేసుకోవడం నిలిచిపోతుంది. ఓ దశలో సైనిక శక్తినీ ఉపయోగిస్తామని ఆయన హెచ్చరించిన సంగతి తెలిసిందే.
అమెరికాకు చెందిన 40 శాతం కంటైనర్లు పనామాలో ప్రయాణిస్తాయి. అయితే, ఇక్కడ చైనా సంస్థలు ఓడరేవుల్లో పెట్టుబడి పెట్టాయి. ఇది ట్రంప్ నకు కంటగింపుగా మారింది. ఆయన ఒత్తిడి తట్టుకోలేక పనామా.. చైనాకు చెందిన బీఆర్‌ఐ ప్రాజెక్టులోని కాంట్రాక్టులను రెన్యువల్ నిలిపివేసింది.