ట్రంప్ వర్సెస్ బైడెన్... యూఎస్ లో తాజా సర్వే ఫలితాలివే!

అవును... అమెరికాలో వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ లో ఆసక్తికర విషయం వెల్లడైంది.

Update: 2024-04-04 13:30 GMT

అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న వేళ ఆసక్తికరమైన విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఇందులో భాగంగా.. తాజాగా ఒక సంస్థ నిర్వహించిన ఒపీనియన్ పోల్ లో ఆసక్తికర విషయాలు తెరపైకి వచ్చాయి. ఇందులో భాగంగా... జో బైడెన్ కంటే డొనాల్డ్ ట్రంప్ కే ఎక్కువ మద్దతు ఉన్నట్లు తేలింది! దీంతో ఈ విషయం ఇప్పుడు అగ్రరాజ్యంతో పాటు ప్రపంచ వ్యాప్తంగానూ పలు దేశాల్లో చర్చనీయాశం అవుతోంది!

అవును... అమెరికాలో వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నిర్వహించిన ఒపీనియన్‌ పోల్‌ లో ఆసక్తికర విషయం వెల్లడైంది. ఇందులో భాగంగా... కీలక రాష్ట్రాల్లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ కంటే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ నకే మద్దతు ఎక్కువగా ఉన్నట్లు తేలింది! ఆ మద్దతు కూడా భారీగా ఉందని చెబుతున్న నేపథ్యంలో... ఒపీనియన్ పోల్ నిర్వహించిన ఏడు రాష్ట్రాల్లోనూ.. ఆరు రాష్ట్రాల్లో ట్రంప్ నకే ఆధిక్యం లభించనున్నట్లు తెలిసిందట!

ప్రధానంగా బైడేన్ పనితీరుపై జరిగినట్లు చెబుతున్న ఈ సర్వేలో... కొన్ని అంశాల్లో ఆయన పనితీరుపై అసంతృప్తిగా ఉన్నట్లు ఓటర్లు తెలిపారని తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా... దేశ ఆర్థిక వ్యవస్థ, ఉపాధి కల్పించడం వంటి విషయాల్లోని సమస్యలను పరిష్కరించడంలో ఆయన సామార్ధ్యంపై మెజారిటీ అమెరికన్లు సందేహం వ్యక్తం చేసినట్లు సర్వే నిర్వహించిన సంస్థ చెబుతోంది!

పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిచిగాన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్‌ రాష్ట్రాల్లో ఈ సర్వే నిర్వహించగా.. ఇందులో విస్కాన్సిన్ తప్ప మిగిలిన ఆరు రాష్ట్రాల్లోనూ రెండు నుంచి ఎనిమిది శాతం పాయింట్ల ఆధిక్యం ట్రంప్ నకు లభించినట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది! ఇక మిగిలిన ఒక్క విస్కాన్సిన్ రాష్ట్రంలో మాత్రం ట్రంప్ కంటే బైడెన్ మూడు పాయింట్లతో ముందంజలో ఉన్నారని వెల్లడించింది.

ఎన్నికల ఫలితాలను ప్రధానంగా ఈ ఏడు రాష్ట్రాలే అత్యధికంగా ప్రభావితం చేస్తాయనే అంచనాలు ఉన్నట్లు చెబుతున్న నేపథ్యంలో... బైడెన్ పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసినవారికంటే.. అసంతృప్తి వ్యక్తం చేసినవారి సంఖ్య ఎక్కువగా ఉండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇదే క్రమంలో... ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో పైన పేర్కొన్న ఏడు రాష్ట్రాల్లోనూ అరిజోనా మినహా మిగిలిన అన్ని చోట్లా పాజిటివ్ అభిప్రాయాలు వెల్లడైనట్లు చెబుతున్నారు!

ఆ సంగతి అలా ఉంటే... ప్రధాన జాతీయ పోల్స్ ను నిరంతరం పర్యవేక్షించే "రియల్ క్లియర్ పాలిటిక్స్" మాత్రం బైడెన్, ట్రంప్ ల మధ్య హోరా హోరీ పోటీ ఉండనుందని.. ప్రధాన పోల్స్ సగటు ఆధారంగా బైడెన్ కంటే ట్రంప్ 0.8 శాతం పాయింట్లతోనే ముందంజలో ఉన్నారని వెల్లడించింది.

Tags:    

Similar News