రాసుకో సాంబ... దావోస్ నుంచి కొన్ని లక్షల కోట్లు వస్తున్నాయి!
అవును... వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. రికార్డ్ స్థాయిలో పెట్టుబడులను నమోదు చేసింది.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు వేదికగా తమ తమ రాష్ట్రాలకు పెట్టుబడులను ఆకర్షించే పనిలో భాగంగా... పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు దావోస్ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు కదిలారు. అయితే.. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ పెట్టుబడుల రికార్డ్ నమోదు చేసింది తెలంగాణ సర్కార్. ఈ విషయం వైరల్ గా మారింది.
అవును... వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ టీమ్.. రికార్డ్ స్థాయిలో పెట్టుబడులను నమోదు చేసింది. ఇందులో భాగంగా... 16 కంపెనీలు సుమారు రు.1.78 లక్షల కోట్ల మేర పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్నాయి. దీని ద్వారా.. సుమారు 50వేల ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.
ఈ దావోస్ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం నుంచి.. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే కంపెనీలు.. ఏ కంపెనీ ఎంత మేర పెడుతున్నారు.. ఎన్నేసి ఉద్యోగాలు రాబోతున్నాయి అనేది ఇప్పుడు చూద్దామ్..!
అమెజాన్ వెబ్ సర్వీసెస్:
తెలంగాణ ప్రభుత్వంతో అమెజాన్ వెబ్ సర్వీసెస్ భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ సర్వీసెస్ డేటా సెంటర్లలో భారీ పెట్టుబడులు పెట్టనున్నారు.. ఈ పెట్టుబడుల మొత్తం రూ.60,000 కోట్లు అని చెబుతున్నారు.
సన్ మెట్రో కెమికల్స్:
ఈ సంస్థ తెలంగాణ రాష్ట్రంలోని ములుగు, మంచిర్యాల, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ పంప్డ్ స్టోరేజ్ జల విద్యుత్, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతోంది. వీటికోసం 3,400 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ హైడ్రో విద్యుత్ తో పాటూ 5,440 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లూ ఏర్పాటు చేస్తారు! వీటిలో పెట్టుబడుల మొత్తం రూ.45,500 కోట్లు కాగా.. సుమారూ 7,000 ఉద్యోగాలు వస్తాయని అంటున్నారు.
మేఘా ఇంజినీరింగ్:
ఈ సందర్భంగా... రాష్ట్రంలో 2,160 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి.. వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్ నెస్ రిసార్ట్.. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టం ప్రాజెక్ట్ వంటి మూడూ కీలక ఒప్పందాలు తెలంగాణ సర్కార్ కు మేఘా ఇంజినీరింగ్ కు మధ్య జరిగాయి. వీటీలో పెట్టుబడి రూ.15,000 కోట్లు కాగా.. 5,250 మందికి ఉపాధి దొరుకుతుందని చెబుతున్నారు.
టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్:
తెలంగాణ ప్రభుత్వం ఈ సంస్థలో ఒప్పందం చేసుకుంది. దీంతో... ఈ సంస్థ హైదరాబాద్ లో అత్యాధునిక డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. 300 మెగావాట్ల సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ఏర్పాటు కానుండగా.. దీనికోసం రూ.15,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నారు.
కంట్రోల్స్ ఎస్:
400 మెగా వాట్ల సామర్థ్యంతో అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ లను ఈ సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు రూ.10,000 కోట్లు పెట్టుబడి పెట్టనుండగా.. సుమారు 3,600 మందికి ఉపాధి లభించనుందని అంటున్నారు.
* ఇదే సమయంలో... మానవ రహిత ఏరియల్ సిస్టమ్స్ తయారీ యూనిట్ పెట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం జేఎస్ డబ్ల్యూ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం రూ.800 కోట్లు పెట్టుబడులు పెట్టనుండగా.. సుమారు 200 మందికి ఉద్యోగాలు లభించనున్నాయని చెబుతున్నారు.
* ఏకంగా 17,000 మందికి ఉద్యోగాలు లభించేలా రూ.750 కోట్ల పెట్టుబడులతో పోచారంలో ఐటీ క్యాంపస్ లో కొత్త సెంటర్ ప్రారంభించనుంది ఇన్ఫోసిస్. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం జరిగిందని అంటున్నారు.
* సుమారూ 5,000 మందికి ఉపాధి లభించేలా హైటెక్ సిటీలో సుమారూ 3.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్.సీ.ఎల్. కొత్త క్యాంపస్ ఏర్పాటుకు అంగీకారం కుదిరిందని అంటున్నారు!
* దాదాపు 5,000 మందికి ఉద్యోగాలు లభించేలా గోపన్ పల్లి క్యాంపస్ లో విప్రో కొత్త ఐటీ సెంటర్ ఏర్పాటు చేయబోతుందని చెబుతున్నారు.
* రూ.500 కోట్ల పెట్టుబడులతో తెలంగాణలో ఇంటిగ్రేటెడ్ ప్రైవేట్ జాకెట్ తయారీ మరియూ టెస్టింగ్ యూనిట్ ఏర్పాటుకు స్కైరూట్ ఏరో స్పేస్ ముందుకు వచ్చింది.
* అత్యాధునిక సోలార్ సెల్స్, మాడ్యూల్స్ తయారీ యూనిట్ ను అక్షత్ గ్రీన్ టెక్ (మైత్రా ఎనర్జీ గ్రుప్ కంపెనీ) ఏర్పాటూ చేయనుంది. ఈ కంపెనీ పెట్టే పెట్టుబడులు సుమారు రూ.7,000 కోట్లు.
* హెల్త్ కేర్ రంగంలో పేరొందిన ఎక్లాట్ హెల్త్ సొల్యూషన్స్ కంపెనీ సుమారు 800 మంది ఉద్యోగులూ పనిచేసేందుకు వీలుగా హైదరాబాద్ లో తన నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది.