మరింత సౌకర్యవంతంగా శ్రీవారి వీఐపీ బ్రేక్ దర్శనం

దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆలయ అధికారులకు సూచించినట్లు సమాచారం.

Update: 2025-01-01 19:30 GMT

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు టీటీడీ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే అన్ని రకాల సేవలను ఆన్ లైన్ ద్వారా అందుబాటులో ఉంచిన టీటీడీ.. వీఐపీ బ్రేక్ దర్శనాలకు అదే పద్ధతి పాటించేలా ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించాలని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆలయ అధికారులకు సూచించినట్లు సమాచారం.

శ్రీవారిని దర్శించుకునే సామాన్య భక్తులు నిరీక్షణ సమయాన్ని సాధ్యమైనంత తగ్గించాలని భావిస్తున్న టీటీడీ అందుబాటులో ఉన్నఅన్ని మార్గాలను పరిశీలిస్తోంది. టెక్నాలజీని సమర్థంగా వాడుకుని భక్తులకు మెరుగైన సేవలు అందజేయాలని భావిస్తోంది. అందులో ప్రధానమైనది ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా భక్తులకు దర్శనాలు కల్పించాలనే ఆలోచనతో ఆ సాంకేతిక సమకూర్చుకునే ప్రయత్నాలు చేస్తోంది. మరోవైపు వీఐపీ బ్రేక్ దర్శనాల వల్ల కూడా సమయం ఎక్కువ ఖర్చు అవుతుందని భావిస్తున్న టీటీడీ.. ఆ దర్శనాలను ఆన్ లైన్ ద్వారా అందజేస్తే ఎలా ఉంటుందని ఆరా తీస్తోంది.

ప్రస్తుతం రోజూ 60 నుంచి 70 వేల మంది శ్రీవారిని దర్శించుకుంటున్నారు. ముందుగా టోకెన్ పొందిన వారికి దర్శన సమయంలో పెద్దగా ఇబ్బంది లేకపోయినా, సర్వ దర్శనం కోసం ఉచిత క్యూ లైన్లలో నిరీక్షించే భక్తులు గంటల కొద్దీ క్యూలైన్లలో వేచిచూడాల్సివస్తోంది. రద్దీ రోజుల్లో నిరీక్షణ సమయం ఒకటి రెండు రోజులు కూడా అవుతోంది. దీన్నినివారించే మార్గాలపై ఫోకస్ చేసిన టీటీడీ వీఐపీ దర్శనాలకు లేఖలిచ్చే ప్రజాప్రతినిధులే ఆన్ లైన్ ద్వారా లేఖలు పంపి టోకెన్లు జారీ చేసే విధానం తీసుకురావాలని అనుకుంటోంది. వాస్తవానికి ఏపీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు పరిమిత సంఖ్యలో లేఖలిచ్చి వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు చేయాల్సివుంటుంది. ఒక లేఖపై ఆరుగురు భక్తులను అనుమతిస్తారు. అయితే కొంతమంది ప్రజాప్రతినిధులు తమకున్న పరిమితికి మించి లేఖలు జారీ చేస్తున్నారు. దీనివల్ల లేఖలతో కొండకు వస్తున్న భక్తులు టీటీడీ సిబ్బందితో గొడవకు దిగుతున్నారు.

ఈ పరిస్థితిని చక్కదిద్దాలని భావించిన టీటీడీ చైర్మన్ ప్రతి ప్రజాప్రతినిధికి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ఇచ్చి వారికి కేటాయించిన వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లను వారే బుక్ చేసుకునేలా సాఫ్ట్ వేర్ ను అప్డేట్ చేయాలని నిర్ణయించారు. దీనివల్ల పరిమితికి మించి సిఫార్సులు వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా కొండపై అనవసర రద్దీ తగ్గే అవకాశం కూడా ఉంటుందని భావిస్తున్నారు.

ప్రస్తుతం టీటీడీ పాలకమండలి సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులకు ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా సిఫార్సు లేఖలు జారీ చేసే వీలు కల్పించారు. ఇప్పుడు ఈ పద్ధతిని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు కూడా వర్తింపజేయాలని చూస్తున్నారు. ఏపీ ప్రజాప్రతినిధులతోపాటు తెలంగాణ రాష్ట్రానికి చెందిన నేతల సిఫార్సులకు దర్శనం కల్పించాలని తాజాగా నిర్ణయించడంతో టీటీడీ మెరుగైన పద్ధతులపై ఫోకస్ పెట్టింది. ఈ విధానంలో అదనపు సిఫార్సులకు చెక్ చెప్పడంతోపాటు ప్రజాప్రతినిధులు తమకు కేటాయించిన కోటా వంద శాతం వినియోగించుకుంటారని చెబుతున్నారు.

Tags:    

Similar News