కన్నీరు పెట్టిన తుమ్మలకు ఘన స్వాగతం... ఆ పార్టీవైపే పయనం?

ఇందులో భాగంగా ఇవాళ హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కూ తుమ్మల అభిమానులు భారీ బ‌ల‌ప్రద‌ర్శన చేశారు.

Update: 2023-08-25 13:01 GMT

ఎన్నికలు సమీపిస్తోన్న వేళ తెలంగాణ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. పైగా బీఆరెస్స్ అధినేత కేసీఆర్ 115 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో... ఆ పార్టీ ఇంటర్నల్ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. ఈ సమయంలో కన్నీరు మున్నీరవుతున్న నేతలు తీసుకోబోయే నిర్ణయాలు హాట్ టాపిక్ గా మారాయి!

బీఆరెస్స్ టికెట్లు దక్కని నేతలు ఈ దఫా బహిరంగంగానే కన్నీటిపర్యంతం అవుతున్నారు. మొన్న స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య.. అంబేద్కర్ విగ్రహం వద్ద భోరున విలపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టికెట్ విషయంలో నిరాశ చెందిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా భావోద్వానికి గురయ్యారు.. కన్నీరు పెట్టుకున్నారు.

అయితే ఈ విషయంలో ఆయన అనుచరులు మాత్రం సీరియస్ గానే ఉన్నారు. రాజ‌కీయ భ‌విష్యత్‌ పై కీల‌క నిర్ణయం తీసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్నమైందని ఆయనకు గుర్తు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇవాళ హైద‌రాబాద్ నుంచి ఖ‌మ్మం వ‌ర‌కూ తుమ్మల అభిమానులు భారీ బ‌ల‌ప్రద‌ర్శన చేశారు.

ఇందులో భాగంగా... ఖమ్మం జిల్లా సరిహద్దు నాయకన్‌ గూడెం వద్ద మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు ఆయన అభిమానులు ఘన స్వాగతం పలికారు. దీంతో దాదాపు 1,000 కార్లు, 2 వేల బైక్‌ లతో ఆయన ఖమ్మం బయలుదేరి వెళ్లారు. ఈ సంద‌ర్భంగా తుమ్మల నాగేశ్వర‌రావు త‌న‌యుడు యుగంధ‌ర్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాభీష్టం మేర‌కే నిర్ణయం వుంటుంద‌ని చెప్పారు.

ఇదే సమయంలో తుమ్మలకు ఘనస్వాగతం పలికే ర్యాలీలో ఎక్కడా కేసీఆర్ ఫోటోలు కానీ, బీఆరెస్స్ జెండాలు కానీ కనిపించకపోవడం గమనార్హం. దీంతో... తుమ్మల కారు దిగిపోయినట్లే అనే టాక్ మొదలైపోయింది. ఇదే సమయంలో... మరో కీలక అంశం తెరపైకి వచ్చింది.

ఈ పరిస్థితుల నేపథ్యంలో పాలేరు బ‌రి నుంచి పోటీ చేయాల్సిందే అని తుమ్మల‌పై ఆయ‌న అనుచ‌రులు తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ లో చేరాల‌ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ర్యాలీలో ఎక్కడా బీఆరెస్స్ జెండాలు లేకుండా జాగ్రత్త పడ్డారని అంటున్నారు.

కాగా... ఉమ్మడి ఖ‌మ్మం జిల్లా పాలేరు నుంచి మ‌రోసారి బ‌రిలో దిగాల‌ని ఏర్పాట్లు చేసుకుంటున్న తుమ్మల‌కు సీఎం కేసీఆర్ గ‌ట్టి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పాలేరు టికెట్‌ ను సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేంద‌ర్‌ రెడ్డికి క‌ట్టబెట్టడంతో తుమ్మల‌తో పాటు ఆయ‌న అనుచ‌రులు ఆగ్రహంగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయనకు భారీ ర్యాలీతో ఘన స్వాగతం పలికి... కాంగ్రెస్ పార్టీలో చేరి పాలేరు నుంచే పోటీ చేసి గెలిచి సత్తా చాటాలని పంతంతో ఉన్నారు!

Full View
Tags:    

Similar News