ఉగాది పచ్చడి... షడ్రుచుల వెనుక ఉన్న సైన్స్ ఇదే!
ఉగాది మన తెలుగు పండగ.. మన ఆచారాలు, సంప్రదాయాల మేళవింపుతో జరిగే "నూతన" వేడుక
ఉగాది మన తెలుగు పండగ.. మన ఆచారాలు, సంప్రదాయాల మేళవింపుతో జరిగే "నూతన" వేడుక. ఇందులో ప్రధానంగా... షడ్రుచుల ఉగాది పచ్చడిని తాగి జీవితంలో సుఖదుఃఖాలన్నీ సమానంగా చూడాలనే గొప్ప సందేశాన్నిచ్చే పండుగ ఇది. ఈసారి తెలుగు సంవత్సరం పేరు క్రోధి! ఆ సంగతి అలా ఉంటే... ఈ రోజు తినే ఉగాది పచ్చడి వెనుక అద్భుతమైన సైన్స్ దాగిఉందని నిపుణులు చెబుతున్నారు.
అవును... ఈ రోజు తెలుగు వారి పండుగా ఉగాది. దీంతో... తెల్లవారు జామునే లేచి, తల స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి ఉగాది పచ్చడితో పాటు పిండివంటలు చేసుకుంటారు. సాయంత్రం పంచాంగ శ్రవణంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధానంగా.. తీపి, చేదు, పులుపు, కారం, వగరు, ఉప్పు ఇలా ఆరు రకాల రుచులతో కలిపిన పచ్చడిని తయారీ చేసి దేవునికి నైవేధ్యంగా సమర్పిస్తారు. అనంతరం ఇంటిల్లిపాదీ స్వీకరిస్తారు.
ఈ నేపథ్యంలో.. షడ్రసోపేతమైన ఈ ఉగాది పచ్చడి తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని.. వాటితోపాటు సైన్స్ సైతం దాగి ఉందని చెబుతున్నారు నిపుణులు. అదేమిటంటే... ఉగాది పర్వదినం వసంత కాలంలో వస్తుందనేది తెలిసిన విషయమే. ఈ వసంతం తర్వాత గ్రీష్మ రుతువు వస్తుంది. అంటే ఎండలు మండిపోయే కాలం అన్నమాట. అందువల్ల ఈ పానీయాన్ని సేవిస్తే... రాబోయే ఎండలకు శరీరాన్ని సంసిద్ధం చేసినట్లు అవుతుందని చెబుతున్నారు.
ఇక ఈ ఆరు పదార్ధాలతో ఉన్న ఈ ఉగాది పచ్చడి వేసవి ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తాయని.. కండరాల పుష్టికి తోడ్పడతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో... ఈ ఆరు రుచులు నిజజీవితంలో ఎదుర్కొనే సమస్యలలు, కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, లాభాలు, సంతోషాలను తెలుపుతుంది!
తయారీ విధానం!:
ఓ చిన్న కప్పు తీసుకుని అందులో మొదట చింతపండు తీసుకుని కడిగి గుజ్జుని తీయాలి! దీనికి మూడు పావు కప్పు నీరు కలపాలి. అనంతరం బెల్లాన్ని పొడిలా చేసి అందులో వేసుకోవాలి. ఇప్పుడు మామిడికాయలు చిన్న చిన్న ముక్కలుగా తరిగి అందులోనే కలపాలి. ఇప్పుడు వేపపువ్వుని కాడల నుంచి వేరు చేసి పచ్చడిలో కలిపి... కారం, మిరపకాయలు వీటిలో ఏవైనా ఒకటి మీ ఇష్ట మేరకు కలిపి.. చివరగా ఉప్పు వేసి అంతే పచ్చడి రెడీ అయిపోయింది!!