పురంధేశ్వరి మీద అల్టిమేట్ సెటైర్ ఇదే...!

అదే విధంగా ఆమె చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు అని ఆమెకు బంధు ప్రీతి అని కుల భావన హెచ్చు అని కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా ఏపీ బీజేపీలో చిచ్చు రాజేస్తోంది.

Update: 2023-11-18 01:06 GMT

దగ్గుబాటి పురంధేశ్వరి మీద వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వార్ అలా అలుపూ సొలుపూ లేకుండా కొనసాగుతూ వస్తోంది. పురంధేశ్వరిని టీడీపీ పక్షంగా ముద్ర వేయడంతో వైసీపీ ఇప్పటికే విజయవంతం అయింది. అదే విధంగా ఆమె చంద్రబాబు కోసం పనిచేస్తున్నారు అని ఆమెకు బంధు ప్రీతి అని కుల భావన హెచ్చు అని కూడా వైసీపీ చేస్తున్న ప్రచారం కూడా ఏపీ బీజేపీలో చిచ్చు రాజేస్తోంది.

ఏపీ బీజేపీలో ఒక వర్గం ఆమె మీద ఎలాంటి విమర్శలు వచ్చినా అసలు పట్టించుకోవడంలేదు. ఆమె ఏకపక్ష పోకడలు పోతున్నారు అని సీనియర్లు గుర్రు మీద ఉన్నారు. అందుకే ఆమె మీద వైసీపీ చాలా సీరియస్ గా ఆరోపణలు చేసినా కూడా ఆమెకు దన్నుగా ఎవరూ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడంలేదు అని అంటున్నారు.

గతంలో అయితే చాలా మంది నేతలు సోము వీర్రాజుకు అండగా ఉండేవారు. కానీ ఇపుడు అలాంటి పరిస్థితి లేదు. టీడీపీ నుంచి బీజేపీలోకి వచ్చిన నేతలు కూడా పురంధేశ్వరికి మద్దతుగా ఒక్క మాట మాట్లాడడంలేదు. దాంతో ఆమెది దాదాపుగా ఒంటరి పోరాటంగా బీజేపీలో మారుతోంది.

ఇక బీజేపీ ప్రెసిడెంట్ గా పురంధేశ్వరి ఉన్నారు కానీ 2018లో ఆమె విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తే వచ్చిన ఓట్లు ఎన్ని అని లెక్క కూడా చెబుతూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా చేసిన ట్వీట్ వైరల్ అయింది. విశాఖ పార్లమెంట్ పరిధిలోని ఇరవై పోలింగు బూతులలో అయితే బీజేపీకి ఒక్క ఓటు కూడా పోల్ కాలేదని, మరో నలభై పోలింగ్ బూతులలో అయితే కేవలం పది లోపు ఓట్లు కూడా రాలేదు అని ఆయన చిట్టాపద్దులు అన్నీ ముందు పెట్టేశారు.

ఇదీ ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ ఎన్నికలలో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు అని ఎద్దేవా చేశారు. అయినా సరే ఆమె ఏపీ బీజేపీకి ప్రెసిడెంట్ అయిపోయారు. ఆమెకు అలా కలసి వచ్చింది అంటూ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. అయినా అందరికీ అలాంటి చాన్స్ వస్తుందా అని కూడా అన్నారు.

పనిలో పనిగా ఆమె మీద మరోసారి టీడీపీ ముద్ర వేశారు. కాషాయం పార్టీకి నాయకత్వం వహిస్తూ పచ్చ పార్టీకి కాపలా కాయడం ఆమెకే సాధ్యమని కూడా చురకలు అంటించారు. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికలో పురంధేశ్వరి పోటీ చేసే సీటు ఎక్కడో ఆమెకైనా తెలుసా అని మరో ట్వీట్ లో విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.

ఆమె సీటు ఎంపిక కూడా చంద్రబాబు చేస్తారేమో అని సెటైర్లు వేశారు మొత్తానికి పురంధేశ్వరి మీద విజయసాయిరెడ్డి తో పాటు వైసీపీ నేతలు యుద్ధం ప్రకటిస్తే ఆమెకు మద్దతు ఇచ్చే వారే బీజేపీలో కరవు అయ్యారు. ఇవన్నీ చూస్తూంటే తెలంగాణా ఎన్నికలు ముగిసిన తరువాత ఏపీలో అధ్యక్ష పదవికి మార్పు ఉంటుందని అంటున్నారు. ఈసారి ఎవరికి ప్రెసిడెంట్ గిరీ ఇస్తారో తెలియదు కానీ పురంధేశ్వరికి మాత్రం పార్టీ నేతలు కలసి రావడంలేదు, ఆమె పార్టీకి కలసిరావడంలేదు అని అంటున్నారు.

Tags:    

Similar News