పండుటాకులకు పెద్ద భరోసా... కేంద్రం మరో కీలక పథకం!

తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురష్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు.

Update: 2024-10-30 07:54 GMT

తొమ్మిదో ఆయుర్వేద దినోత్సవం, ధన్వంతరి జయంతిలను పురష్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని లాంఛనంగా విస్తరించారు. అర్హులైన వారికి "ఆయుష్మాన్ భారత్ వయ వందన" కార్డులను పంపిణీ చేశారు. దీని ప్రకారం.. 70 ఏళ్లు పైబడినవారికి రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించనున్నారు.

అవును... దేశంలోని 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అందించే పథకం "ఆయుష్మాన్ భారత్ వయ వంచన" పథకాన్ని కేంద్రం అందుబాటులోకి తెచ్చింది. ఈ సందర్భంగా స్పందించిన ప్రధాని ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇందులో భాగంగా.. ఆయుష్మాన్ భారత్ ద్వారా సుమారు 4 కోట్ల మంది పేదలు లబ్ధి పొందారని అన్నారు.

అయితే... 70 ఏళ్లకు పైబడిన వారిని ఆయుష్మాన్ భారత్ లో చేరుస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. నేడు ఆ హామీని నేరవేర్చామని తెలిపారు. ఒకప్పుడు డబ్బులు లేక వైద్యం చేయించుకోలేని నిస్సహాయత ఉండేదని.. తీవ్రమైన వ్యాధుల చికిత్సకయ్యే ఖర్చు విని ప్రజలు వణికిపోయేవారని.. అలాంటి పరిస్థితుల్లో ఉన్న పేదలను చూడలేకపోయానని చెప్పారు.

ఈ నేపథ్యంలోనే వైద్య ఖర్చులు రూ.5 లక్షల వరకూ ప్రభుత్వమే భరించాలని నిర్ణయించినట్లు ప్రధాని తెలిపారు. ఈ పథకమే లేకపోతే ప్రజలు తమ జేబుల్లోంచి రూ.1.25 లక్షల కోట్లు వెచ్చించాల్సి వచ్చేదని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యమని మన పూర్వీకులు ఎప్పుడో చెప్పారని.. యోగా రూపంలో దాన్ని ప్రపంచం ఇప్పుడు ఆమోదిస్తోందని మోడీ వివరించారు.

అయితే.. ఢిల్లీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని వృద్ధులు మాత్రం తనను క్షమించాలని కోరిన ప్రధాని... రాజకీయ కారణాలతో ఆ రెండు రాష్ట్రాలూ ఈ పథకాన్ని అమలు చేయడంలేదని అన్నారు! అక్కడి వృద్ధులు పడుతున్న బాధలు తెలిసినా.. తాను ఈ విషయంలో తాను ఏమీ చేయలేనని వెల్లడించారు.

Tags:    

Similar News