అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి!

అమెరికా చరిత్రలో ఇలా ఓ స్పీకర్‌ను బలవంతంగా పదవీచ్యుతిడిని చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

Update: 2023-10-04 10:07 GMT

అమెరికా చరిత్రలోనే సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఆ దేశ ప్రతినిధుల సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీని పదవి నుంచి తప్పించేశారు. ఇలా జరగడం అమెరికా చరిత్రలోనే తొలిసారి కావడం గమనార్హం. స్పీకర్‌ కు కెవిన్‌ మెకార్థీకి వ్యతిరేకంగా రిపబ్లికన్‌ పార్టీ నేత మ్యాట్‌ గేజ్‌ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌ చేపట్టి స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీని తప్పించేశారు.

అమెరికా చరిత్రలో ఇలా ఓ స్పీకర్‌ను బలవంతంగా పదవీచ్యుతిడిని చేయడం అమెరికా చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. కాగా.. సుదీర్ఘ ఓటింగ్‌ తర్వాత ఈ ఏడాది జనవరిలోనే మెకార్థీ స్పీకర్‌ పదవి చేపట్టారు. ఇంతలోనే 9 నెలలు పూర్తి కాగానే ఆయనను పదవి నుంచి తప్పించేశారు.

కాగా స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ తొలగింపునకు దారి తీసిన కారణాలను పరిశీలిస్తే... గతేడాది జరిగిన మధ్యంతర ఎన్నికల్లో అమెరికా కాంగ్రెస్‌ (పార్లమెంటు) లో ఎగువసభ అయిన సెనెట్‌ ను అధికార డెమోక్రటిక్‌ పార్టీ గెలుచుకుంది. కానీ, దిగువ సభ అయిన హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ (ప్రజాప్రతినిధుల సభ)లో మెజారిటీ సాధించలేకపోయింది.

హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌ లో మొత్తం 435 సీట్లకు డెమోక్రాట్లు 213 సీట్లు గెలుచుకున్నారు. అయితే ప్రతిపక్ష రిపబ్లికన్లు అంతకంటే తొమ్మిది సీట్లు ఎక్కువగా అంటే 222 సీట్లు దక్కించుకున్నారు. మెజారిటీ ఉన్నప్పటికీ స్పీకర్‌ ను గెలిపించుకోవడానికి రిపబ్లికన్లు కష్టపడ్డారు. పార్టీలో అంతర్గత విభేదాలే ఇందుకు కారణం. పార్టీలోనే అభిప్రాయ భేదాల కారణంగా ఏకాభిప్రాయం కుదరలేదు.

చివరకు నాలుగు రోజుల పాటు ఏకంగా 15 దఫాలు స్పీకర్‌ పదవికి ఓటింగ్‌ నిర్వహించగా.. చివరకు కెవిన్‌ మెకార్థీ స్పీకర్‌గా ఎన్నికయ్యారు. తాను గెలవడం కోసం మెకార్థీ రిపబ్లికన్‌ పార్టీ సభ్యులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం.. తన ఉద్వాసనకు ఒక్క రిపబ్లికన్‌ సభ్యుడు డిమాండ్‌ చేసినా అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌ కు సమ్మతిస్తానన్న కెవిన్‌ మెకార్థీ అప్పట్లో తెలిపారు. ఇప్పుడదే ఒప్పందంతో మెకార్థీపై రిపబ్లికన్‌ నేత  అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.

వాస్తవానికి ఈ ఏడాది జనవరిలో స్పీకర్‌ పదవి చేపట్టిన నాటి నుంచి మెకార్థీకి పలుమార్లు వ్యతిరేకత ఎదుర్కొన్నారు. ఆయన ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదన్న విమర్శలు వచ్చాయి.

మరోవైపు అమెరికా ప్రభుత్వం షట్‌ టౌన్‌ బారిన పడకుండా ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం పొందేలా స్పీకర్‌ కెవిన్‌ మెకార్థీ నిర్ణయం తీసుకున్నారు. దీంతో గత వారాంతంలో మెకార్థీ డెమోక్రటిక్‌ ప్రభుత్వానికి అనుకూలంగా తీసుకున్న చర్యలు ఆయన పదవికి ఎసరు పెట్టాయి.

అమెరికా ప్రభుత్వం ఇబ్బందులు పడకుండా 45 రోజుల పాటు నిధుల మంజూరుకు ఇబ్బందిలేకుండా చేసే స్వల్పకాల బిల్లులను గతవారం ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. అయితే ఈ బిల్లులను రిపబ్లికన్లు తీవ్రంగా వ్యతిరేకించారు. దీంతో బిల్లులు ఆమోదం పొందడం అసాధ్యమైంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ షట్‌ టౌన్‌ పరిస్థితుల్లోకి వెళ్లడం తప్పదనే వ్యాఖ్యానాలు వినిపించాయి. ఈ తరుణంలో దిగువ సభ స్పీకర్‌ మెకార్థీ ప్రత్యేక చొరవ చూపారు. దేశ ప్రజలకు కలిగే ఇబ్బందులు నివారించేందుకు బిల్లులను ఆమోదించాలని సభ్యులను కోరారు. దీంతో స్పీకర్‌ మాటకు తలొగ్గి రిపబ్లికన్లు బిల్లుకు ఆమోదం పలికారు.

అయితే, ఈ పరిణామంతో మెకార్థీపై వ్యతిరేకత మరింత పెరిగింది. పదవిని కాపాడుకునేందుకు ఆయన డెమోక్రాట్లతో చేతులు కలిపారని సొంత పార్టీ రిపబ్లికన్లు ఆయనపై ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలోనే రిపబ్లికన్లు అవిశ్వాసానికి సిద్ధమయ్యారు. స్పీకర్‌ పదవి కోసం ఈ ఏడాది జనవరిలో మెకార్థీతో తీవ్రంగా పోటీ పడిన రిపబ్లికన్‌ నేత మ్యాట్‌ గేజ్‌ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం. ఓటింగ్‌ చేపట్టగా.. 216–220 ఓట్లతో అవిశ్వాసం నెగ్గింది. ఫలితంగా మెకార్థీని పదవి నుంచి తొలగించి.. స్పీకర్‌ పదవి ఖాళీ అయినట్లు ప్రకటించారు.

ప్రస్తుతానికి మరో రిపబ్లికన్‌ నేత పాట్రిక్‌ హెన్రీకి తాత్కాలిక స్పీకర్‌ బాధ్యతలు చేపట్టారు. కొత్త స్పీకర్‌ను ఎన్నుకునేవరకు ఆయన ఈ పదవిలో ఉంటారు.

Tags:    

Similar News