రాజకీయాల్లో సుదీర్ఘ సవాల్ ఉత్తమ్ సర్ గడ్డ తీయనట్టే?

ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు.

Update: 2024-07-31 00:30 GMT

రాజకీయాల్లో సవాళ్లు, ప్రతిసవాళ్లు మామూలే. ఇటీవలి ఎన్నికల్లో కూడా ఇలాంటివి చూశాం. అయితే, ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంటుంది. ఎవరైనా ఒక నాయకుడు తాను ఓడిపోతే మళ్లీ రాజకీయాల్లోకి రాను.. మీరు ఓడిపోతే అందుకు సిద్ధమా అని సవాల్ విసిరితే.. అవతలి వారు దానిని అంగీకరించాలి. లేదంటే, సవాల్ విసిరిన నేత దానిని ప్రత్యర్థి స్వీకరించని వైనాన్ని సాకుగా చూపి తప్పించునే చాన్సుంది. 1999లో ఉమ్మడి ఏపీలో వైఎస్ పీసీసీ చీఫ్ గా ఉంటూ ఎన్నికలను ఎదుర్కొన్నారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకుంటే రాజకీయాల నుంచి తప్పుకొంటానని ప్రకటించారు. ఆ సవాల్ ను అప్పటి సీఎం చంద్రబాబు స్వీకరించలేదు. దీంతో వైఎస్ రాజకీయాల్లో కొనసాగి 2004లో సీఎం కూడా అయ్యారు. 2009లోనూ చంద్రబాబును ఓడించారు.

ఉత్తమ్ ఆరేళ్లుగా అదే మాట

తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. కొన్నాళ్లకు ప్రస్తుత పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి టీపీసీసీ చీఫ్ అయ్యారు. ఆయన సారథ్యంలోనే 2018లో కాంగ్రెస్-టీడీపీ-వామపక్షాలు మహా కూటమిగా ఎన్నికలకు వెళ్లాయి. ఓ దశలో మహా కూటమి గెలుస్తుందనే అంచనాలు ఏర్పడ్డాయి. మరోవైపు తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చేవరకు గడ్డం తీయనంటూ టీపీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటన చేశారు. ఆయన బ్యాడ్ లక్ కొద్దీ 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవలేదు. దీంతో తన చాలెంజ్ కు తగినట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం పెంచారు. అప్పటినుంచి అలానే కొనసాగిస్తున్నారు.

కాంగ్రెస్ గెలిచినప్పటికీ..?

తెలంగాణలో గత ఏడాది నవంబరులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఉత్తమ్ సారథ్యంలో కాకున్నా.. మొత్తానికి కాంగ్రెస్ గెలవడంతో ఆయన కోరిక నెరవేరినట్లయింది. ఆ సందర్భంలోనే తాను త్వరలో గడ్డం తీస్తానంటూ ఉత్తమ్ ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత కీలకమైన పౌర సరఫరాలు, నీటి పారుదల శాఖలకు మంత్రి కూడా అయ్యారు. కానీ.. 8 నెలలవుతున్నా గడ్డం మాత్రం తీయలేదు. కాగా, ఉత్తమ్ కుమార్ రెడ్డి యుద్ధ విమాన పైలట్. రక్షణ శాఖలో పనిచేసిన ఆయన కొంత కాలం రాష్ట్రపతి భవన్ భద్రతాధికారిగానూ ఉన్నారు. ఇదంతా క్లీన్ షేవ్ తో కనిపించాల్సిన ఉద్యోగాలు. ఇక రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా ఆయన 2018 వరకు క్లీన్ షేవ్ తోనే ఉన్నారు. కానీ, ఆ ఏడాది ఎన్నికల సమయంలో చాలెంజ్ చేసి గడ్డం పెంచారు. అప్పడు కాకున్నా.. గత ఏడాది ఎన్నికల్లో పార్టీ గెలవడంతో ఉత్తమ్ శపథం నెరవేరింది. మరీ మళ్లీ క్లీన్ షేవ్ తో ఎప్పుడు కనిపిస్తారో?

Tags:    

Similar News