వంగవీటి రాధా సొంత పార్టీ త్వరలో ?

వంగవీటి ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది. వంగవీటి అన్న నాలుగు అక్షరాలు ఒక బలమైన సామాజిక వర్గానికి మంత్రాక్షరాలు.;

Update: 2025-03-26 11:30 GMT
వంగవీటి రాధా సొంత పార్టీ త్వరలో ?

వంగవీటి ఈ పేరులోనే వైబ్రేషన్ ఉంది. వంగవీటి అన్న నాలుగు అక్షరాలు ఒక బలమైన సామాజిక వర్గానికి మంత్రాక్షరాలు. అంతే కాదు బడుగు బలహీన వర్గావారికి ఆరాధ్యుడిగా ఎదిగిన వంగవీటి రంగా అంటే అంతా అభిమానం చూపిస్తారు. వంగవీటి రంగా నేపథ్యం అంతా విజయవాడ చుట్టూనే తిరిగినా ఆయన పేరు ఎనభై దశకంలో ఉమ్మడి ఏపీని షేక్ చేసి పారేసింది.

ఆయన ఒకే ఒకసారి అది కూడా 1985లో కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు విజయవాడ తూర్పు నుంచి ఆయన బంపర్ మెజారిటీతో ఆ రోజులలో గెలిచారు. ఆయన గెలిచినప్పుడు ఏపీలో టీడీపీ అధికారంలో ఉంది. ఇక వంగవీటి రంగా ప్రతిపక్ష నాయకుడిగా తన రాజకీయ పోరాటాన్ని పీక్స్ కి తీసుకుని వెళ్ళారు. అప్పటికే ఒక దశాబ్దర ముందు ఉన్న రాజకీయ సామాజిక వర్గ పరిస్థితుల నేపథ్యంలో రంగా రాజకీయ అనుసరించిన పంధా ఆయనను బడుగులకు మరింత చేరువ చేసింది.

అంతే కాదు రంగా చుట్టూ ఒక బలమైన సామాజిక వర్గం తన ఆశలను అల్లుకుంది. ఈ నేపథ్యంలో ఏ నేతకూ రాని క్రేజ్ రంగాకు వచ్చింది. రంగా ఇంతా చేసి మూడున్నరేళ్ళు మాత్రమే కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కానీ ఆయన సృష్టించిన రాజకీయ ప్రకంపనలు ఈ రోజుకీ కోస్తాను అలా తాకుతూనే ఉన్నాయి.

రంగా పేరు చెప్పుకుని ఈ రోజుకీ ఎంతో మంది నేతలు ఎదిగిన తీరు అంతా గమనిస్తున్నదే. అయితే రంగా ఏకైక కుమారుడు అయిన వంగవీటి రాధాకు మాత్రం తండ్రి రాజకీయ సిరి దక్కలేదు. ఆయన తండ్రి మాదిరిగానే పేదల కోసం తపిస్తూ ఉంటారు. ఆయనకు కూడా ఎనలేని ఫాలోయింగ్ ఉంది. యూత్ లో విపరీతమైన క్రేజ్ ఉంది.

అయినా రాధా రాజకీయంగా మాత్రం అనుకున్న స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయారు రాధాకృష్ణ తన తండ్రి మాదిరిగానే 2004లో మొదటిసారి విజయవాడ తూర్పు నుంచి గెలిచారు. ఆనాడు ఏపీలో వైఎస్సార్ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2009 నాటికి రాధా కాంగ్రెస్ లో ఉండి ఉంటే కచ్చితంగా మంత్రి అయ్యేవారు. ఆ మీదట ఆయన రాజకీయం వేరేగా ఉండేది అన్న భావన కూడా ఉంది.

కానీ రాధ ప్రజారాజ్యంలో చేరిపోయారు. అలా 2009లో పోటీ చేసి ఓటమి తెచ్చుకున్నారు. పోనీ ప్రజారాజ్యంలో కొనసాగి ఉండినా ఆ తరువాత కాంగ్రెస్ లో చేరి ఏదో రకంగా రాజకీయంగా ముందుకు సాగేవారు. కానీ అలా కాకుండా వైసీపీని ఆశ్రయించారు. 2014లో వైసీపీలో చేరి పోటీ చేస్తే మరోసారి ఓటమి వరించింది.

ఇక 2019లో ఆయన కోరుకున్న విజయవాడ సెంట్రల్ సీటు వైసీపీలో దక్కలేదు. దాంతో ఆయన టీడీపీలో జంప్ చేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారం కోల్పోయింది. దాంతో అయిదేళ్ళ పాటు రాధా విపక్షంలో ఉండాల్సి వచ్చింది.

ఇక 2024 ఎన్నికల్లో రాధాకి కచ్చితంగా పోటీ చేసేందుకు చాన్స్ వస్తుందని అంతా అనుకున్నారు. ఆయన కోరిన మాదిరిగా విజయవాడ సెంట్రల్ నుంచి సీటు దక్కించుకుని గెలిచి వస్తారని అభిమానులు అయితే పెద్ద ఆశలే పెట్టుకున్నారు. కానీ చివరికి జరిగింది వేరు. రాధాకు టికెట్ ఇవ్వలేదు. అక్కడ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యేగా ఉన్న బోండా ఉమాకు టికెట్ ఇచ్చారు.

ఆనాడు రంగాకు ఎమ్మెల్సీ ఇస్తామని ప్రామిస్ చేశారని ప్రచారం సాగింది. ఇక కూటమి ప్రభుత్వం ఏపీలో అధికారంలోకి వచ్చి దగ్గరగా పది నెలలు కావస్తోంది. ఇప్పటికి ఏడు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయితే అందులో నాలుగు టీడీపీ తీసుకుంది. ఇందులో ఏ ఒక్కటీ కూడా రాధాకు ఇవ్వలేదని అభిమానులు భావిస్తున్నారు.

దాంతో వారు రగిలిపోతున్నారు. మరో వైపు చూస్తే జనసేన నుంచి ఇద్దరికి ఎమ్మెల్సీలు దక్కాయి. కాపులకు కోటా నింపాల్సి వస్తే కనుక అది జనసేన నుంచి తీసుకుంటున్నారు. గతంలో హరి ప్రసాద్, ప్రస్తుతం నాగబాబుకు ఎమ్మెల్సీలు ఆ సామాజిక వర్గం నుంచి ఎంపిక చేశారు కాబట్టి టీడీపీ నుంచి అదే సామాజిక వర్గానికి ఇవ్వకూడదని ఏదో రూల్స్ పెట్టుకున్నట్లుగా ఉందని అంటున్నారు. దాంతో రాధా లాంటి వారికి అన్యాయం జరుగుతోంది అని అంటున్నారు.

దీంతో ఇపుడు రాధా అభిమానులు అనుచరులు రగిలిపోతున్నారు. పార్టీలు మారితే రాధాకు కాకుండా ఆయా పార్టీలకే ప్రయోజనం చేకూరింది తప్ప రాధాకు ఏమీ ఉపయోగం లేదని అంటున్నారు. ఈ క్రమంలో రాధానే సొంతంగా పార్టీ పెడితే ఎలా ఉంటుంది అన్న అలోచన వస్తోంది.

మరీ ముఖ్యంగా రాధాని పార్టీ పెట్టమని టీడీపీలోని కాపులే వత్తిడి తెస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే జనసేనను చూసుకుని టీడీపీలోని కాపులను పక్కన పెడుతున్నారన్న భావన వారిలో నానాటికీ పెరిగిపోతోంది. ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఎంపీ టికెట్ల నుంచి మంత్రి పదవులు నామినేటెడ్ పదవులు ఇలా చాలా వాటి విషయంలో టీడీపీలోని కాపులకు తీరని అన్యయాం జరుగుతోంది అని అంటున్నారు.

దాంతో సొంతంగా రాధావే పార్టీ పెడితే ఎలా ఉంటుంది అని సీరియస్ గానే ఆలోచిస్తున్నారుట. ఏపీలో కాపులకు ఆరాధ్య దైవం వంగవీటి రంగా. ఆయన కుమారుడు పార్టీ పెడితే దాని ప్రభావం కచ్చితంగా ఉంటుందని అంటున్నారు.

రాధా పార్టీ పెడితే టీడీపీలో కానీ వైసీపీలో కానీ ఉన్న కాపులు అంతా మద్దతుగా నిలుస్తారు అని అంటున్నారు. రంగా ఫ్యాన్స్ కానీ ఆయన అనుచర బలం కానీ చాలా ఎక్కువ. పైగా కాపులలో రంగాకు ఉన్న ఫాలోయింగ్ గొప్పది. పవన్ కళ్యాణ్ జనసేన కంటే కూడా రాధా పార్టీ పెడితే కాపుల మద్దతు ఆ వైపే ఉంటుందని అంటున్నారు. ఇక జనసేన అధినాయకత్వం నిర్ణయాలతో ఆయన విధానాలతో కొంత విభేదిస్తూ అసంతృప్తిగా ఉన్న వర్గాలు కూడా కలసి వస్తాయని అంటున్నారు.

ప్రస్తుతం అయితే రాధా పార్టీ పెడతారు అన్న చర్చ అయితే జోరుగా సాగుతోంది. మరి రాధా పార్టీ పెడితే రాజకీయ సామాజిక పరిణామాలు మాత్రం ఏపీలో దారుణంగా మారడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో ఎంతమేరకు నిజం ఉందో.

Tags:    

Similar News