విశాఖలో చప్పగా సాగిన వారాహి...ఎందుకలా...?
పవన్ విశాఖలో వారాహి టూర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అయితే పవన్ జస్ట్ రెండు సభలతో వారాహి యాత్రను ముగించేశారు.
విశాఖ జిల్లాలో జనసేనకు బలం ఉందని చెప్పుకుంటారు. కనీసంగా అరడజన్ సీట్లు పొత్తులలో భాగంగా ఇస్తే పోటీ చేస్తామని కూడా అంటారు. పవన్ విశాఖలో వారాహి టూర్ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి. అయితే పవన్ జస్ట్ రెండు సభలతో వారాహి యాత్రను ముగించేశారు. ఈ నెల 10 నుంచి 19 దాకా వారాహి యాత్ర విశాఖలో ఉంటుందని జనసేన షెడ్యూల్ ప్రకటించింది. అయితే ఆ షెడ్యూల్ కి ఒక రోజు ముందే 18కే వారాహి యాత్ర ముగించారు. ఆ రోజు కూడా మీడియా మీటింగ్ తో సరిపెట్టారు.
ఇక ఆగస్ట్ 15న పవన్ కళ్యాణ్ మంగళగిరిలో జెండా వందనం కర్యక్రమంలో పాల్గొన్నారు. అలా ఒక రోజు వారాహి యాత్ర ఆగింది. గట్టిగా చెప్పాలంటే విశాఖ రూట్లలో వారాహి జోరుగా తిరిగిందేలేదు అని అంటున్నారు. 10న తొలి రోజు విశాఖ జగదాంబ జంక్షంలో వారాహి రధమెక్కి పవన్ ప్రసంగించారు. 13న గాజువాకలో రెండవ సభను వారాహితో కలసి నిర్వహించారు..
భీమునుపట్నం, పెందుర్తి, అనకాపల్లి,. ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలలో వారాహి యాత్ర ఉంటుందని అనుకున్నా అలా జరగలేదు. ఇక పవన్ విశాఖలో భూ దందాల పరిశీలన పేరుతో కార్లలోనే ఎక్కువగా తిరిగారు. ఆయన అనకాపల్లిలో మంత్రి గుడివాడ అమరనాధ్ హయాంలో జరుగుతున్న దందాలు అంటూ అక్కడ తిరిగారు. ఒక రోజు జనవాణి కార్యక్రమం నిర్వహించారు.
మొత్తంగా చూస్తే వారాహి యాత్ర గోదావరి జిల్లాలలో సాగినంత దూకుడుగా విశాఖ జిల్లాలో జరగలేదని అంటున్నారు. విశాఖ జిల్లాలో కాపులు ఎక్కువగా ఉన్నారు. జనసేనకు అనకాపల్లి, పెందుర్తి, ఎలమంచిలి, చోడవరం, పాయకరావుపేటలలో గట్టి నాయకులు ఉన్నాయి. అయినా సరే పవన్ ఆ వైపు ఎందుకు వెళ్లలేదు అన్న చర్చకు తెర లేస్తోంది.
వారాహి నాలుగవ విడత యాత్ర ఏమైనా అనకాపల్లి జిల్లాలో ఉంటుందా అన్నది చూడాల్సి ఉంది. ఏది ఏమైనా విశాఖ యాత్రలో అనుకున్న తీరున వైసీపీ మీద గట్టి విమర్శలు పవన్ చేసినా ఇంకా ఫోకస్ చేయాల్సిన అంశాలు ప్రాంతాలు చాలానే ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం కూడా ఉంది అని అంటున్నారు. విశాఖలో టీడీపీ కంచుకోటలుగా చాలా నియోజకవర్గాలు ఉన్నాయని అంటున్నారు.
వాటిలో కనుక పవన్ మీటింగ్ పెడితే వారాహి తిరిగితే అక్కడ జనసేన నుంచి ఆశావహులు పెద్ద ఎత్తున రెడీ అవుతారని, రేపటి రోజున పొత్తులకు ఇది ఆటంకం కలిగిస్తుందన్న ముందు చూపుతోనే ఇలా చేశారా అన్న డౌట్లూ వస్తున్నాయి. నిజానికి భీమునిపట్నం సీటుని జనసేన టీడీపీ రెండూ ఆశిస్తున్నాయి. అనకాపల్లి, ఎలమంచిలి, చోడవరంలలో, పెందుర్తిలో ఇదే రకమైన సీన్ ఉంది. మరి ముందు జాగ్రత్తగానే ఇలా చేశారా అన్నదే ఇపుడు చర్చకు వస్తున్న విషయం. విశాఖలో వారాహి తో ప్రభంజనం సృష్టిస్తారు అన్న అంచనాలతో ఉన్న వేళ యాత్ర ముగిసింది అని చెప్పడంతో జనసేన వర్గాలు కూడా ఒకింత నిరాశతో ఉన్నాయని అంటున్నారు.