వారాహి 3.0.. ఈసారైనా.. అజెండా మారేనా..?

ఈ యాత్ర‌ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌న‌సైనికులు పెద్ద‌గా ఎలాంటి దిశానిర్దేశం చేయలేక పోయార‌నే వాద‌న వినిపించింది.

Update: 2023-08-05 14:30 GMT

వారాహి 3.0 యాత్ర‌కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెడీ అవుతున్నారు. ఈ నెల 10 నుంచి ఏకంగా 9 రోజుల పాటు ఆయ‌న యాత్ర చేయ‌నున్నారు. అయితే.. ఈ యాత్ర ద్వారా ఆయ‌న ఏం చెప్ప‌ద‌లుచుకున్నా ర‌న్న‌ది ఆస‌క్తిగా మారింది. ఎందుకంటే.. ఇప్ప‌టి వ‌ర‌కు వారాహి యాత్ర పేరుతో రెండు జిల్లాల్లో ఆయ‌న క‌లియ‌దిరిగారు. ఈ యాత్ర‌ పై ఎన్నో ఆశ‌లు పెట్టుకున్న జ‌న‌సైనికులు పెద్ద‌గా ఎలాంటి దిశానిర్దేశం చేయలేక పోయార‌నే వాద‌న వినిపించింది.

వారాయి యాత్ర‌ను ఉమ్మ‌డి తూర్పులో ప్రారంభించారు. అయితే.. కేవ‌లం రెండు అంశాల‌ ను మాత్ర‌మే ఆయ‌న అప్ప‌ట్లో ప్ర‌స్తావించారు. ఒక‌టి కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి అవినీతి, రెండు.. వైసీపీ ప్ర‌భుత్వం పై పోరాటం. ఇవి రెండూ కూడా.. రాజ‌కీయ అంశాలే. వీటితో రాష్ట్ర వ్యాప్తంగా జ‌న‌సేన నాయ‌కుల‌ కు కానీ.. కార్య‌క‌ర్త‌ల‌ కు కానీ.. ఒరిగింది ఏమీ లేదు. పైగా.. ఇవి స్థానిక నాయ‌కుల‌ కు మాత్ర‌మే ప‌రిమితం అయ్యాయి.

ఇక‌, ఉమ్మ‌డి ప‌శ్చిమ‌లో చేప‌ట్టిన యాత్ర 2.0లో కూడా.. జ‌న‌సేన అధినేత ట్రాక్ త‌ప్పార‌నే వాద‌న ఉంది. వ‌లంటీర్ల విష‌యాన్ని ఆయ‌న ప్ర‌స్తావించి.. రాజ‌కీయంగా విమ‌ర్శ‌లు-ప్ర‌తివిమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చా రు. దీంతో ఇది కూడా రాజ‌కీయంగా పార్టీకి ఎలాంటి మేలు జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు చేప‌ట్టే యాత్ర‌తో అయినా.. దిశానిర్దేశం చేయాల‌ని పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లు కోరుతున్న అంత‌ర్గ‌త మాట‌. దీని పై దృష్టి పెట్టి.. వ‌చ్చే 8-9 నెల‌ల పాటు పార్టీని ముందుకు న‌డిపించే వ్యూహాన్ని అమ‌లు చేస్తే.. మంచిద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.

అంతేకాదు.. ప్ర‌భుత్వం పై పోరాటం చేయాల‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. ద‌శ‌-దిశ లేని ఇలాంటి ప్ర‌క‌ట‌న‌ల‌తో పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఎలాంటి మ‌నోబ‌లం క‌లిగించ‌గ‌ల‌ర‌నేది కూడా ఇంపార్టెంట్ అంశంగా మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు కూడా జ‌న‌సేన వ‌న్ మ్యాన్ షో యాత్ర‌గానే వారాహి యాత్ర నిలిచిపోయింది.

ప్ర‌జాపోరాటాలు చేయాలంటే.. టీడీపీ నాయ‌కులు ఎంచుకున్న‌ట్టుగా కొన్ని కార్య‌క్ర‌మాల‌ ను ఎంచుకుని ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంద‌ని.. అంటున్నారు. ఈ దిశ‌గా ప‌వ‌న్ దిశానిర్దేశం చేయ‌డం అత్యంత అవ‌స‌ర‌మనే వాద‌న కూడా పార్టీ వ‌ర్డాల్లో వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం చేస్తారోచూడాలి.

Tags:    

Similar News