కుక్కర్లతో దూసుకెళుతున్న వెల్లంపల్లి.. హడావుడి మామూలుగా లేదుగా?

తాజాగా ఆయన తాను బరిలో నిలిచే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వేలాది మందికి కుక్కర్లు పంచటంఅందరిని ఆకర్షిస్తోంది.

Update: 2024-02-07 07:10 GMT

అధినాయకత్వం ఆదేశాల్ని తూచా తప్పకుండా ఫాలో అయ్యే నేతలు కొందరు ఉంటారు. ఆ కోవలోకే వస్తారు ఏపీ మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న ఆయనకు రానున్నఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయటంతో.. అక్కడ తన పట్టు సాధించేందుకు వేస్తున్న అడుగులు ఆసక్తికరంగా మారాయి. అందరి తలలో నాలుకలా మారేందుకు ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. అంతేకాదు.. కోడ్ కూయకముందే రాజకీయ ప్రత్యర్థులకు దిమ్మ తిరిగేలా మహా స్పీడ్ తో వరుస పెట్టి నిర్ణయాలు తీసుకుంటున్నారు.

తాజాగా ఆయన తాను బరిలో నిలిచే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని వేలాది మందికి కుక్కర్లు పంచటంఅందరిని ఆకర్షిస్తోంది. ఆయన పంపిణీ చేస్తున్న కుక్కర్ దాదాపు రూ.2వేల వరకు ఉంటుందని చెబుతున్నారు.

ఖరీదైన బహుమతితో ఆయన నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారారు. తాను పోటీచేసే కొత్త నియోజకవర్గంలో అందరిని దారిలో పెట్టేందుకు ఆయన విపరీతంగా శ్రమిస్తున్నారు. అంతేకాదు.. వరుస సమావేశాల్ని నిర్వహిస్తూ ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా వారి పనుల్ని చక్కదిద్దేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

వెల్లంపల్లి దూకుడుకు రాజకీయ ప్రత్యర్థులు కొత్త అర్థాల్ని తీస్తున్నారు. ఆయన పంచిపెడుతున్న కుక్కర్లను ప్రలోభాలకు గురి చేయటం అంటూ ప్రచారం చేస్తున్నారు. ఆ మాటకు వస్తే తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. తెలంగాణలోని బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు కొందరు ఎన్నికలకు దాదాపు రెండు నెలల ముందే ఇదే రీతిలో కుక్కర్లను పెద్ద ఎత్తున తాము బరిలోకి దిగే నియోజకవర్గంలో పంచారు. ఈ ప్రయోగం ఫలించటమే కాదు.. అలా పంపిణీ చేసిన ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు విజయం సాధించటం గమనార్హం.

విజయవాడ సెంట్రల్ కు వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన్ను కాదని.. వెల్లంపల్లి శ్రీనివాస్ కు బాధ్యతల్ని అప్పజెప్పటం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొందరు ఆయనతో కలిసి నడిచేందుకు ఇష్టపడని నేపథ్యంలో.. అందరిని పార్టీ దారిలోకి తీసుకొచ్చేందుకు వెల్లంపల్లి చేస్తున్న ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి. అంతేకాదు.. అప్పుడే ఎన్నికల ప్రచారం మొదలు పెట్టేసిన తీరును ప్రదర్శిస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి వార్డును కవర్ చేసేలా ప్లాన్ చేసిన ఆయన.. ఇంటింటి ప్రచారంలో భాగంగా స్థానిక సమస్యల్ని తెలుసుకొని పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. మొత్తంగా నియోజకవర్గం మార్చినప్పటికీ.. ప్రతికూల పరిస్థితుల్ని సానుకూలంగా మార్చుకునేందుకు వెల్లంపల్లి పడుతున్న కష్టం ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News