కాంగ్రెస్ బాధపడుతున్న నేపథ్యంలో సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు!

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగినట్లు కనిపించింది.

Update: 2024-10-09 09:36 GMT

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఊహించని రీతిలో ఓటమిపాలైందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో... ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతున్నాయి. ఈవీఎంల పనితీరుపై కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలపై ఇప్పుడు తీవ్ర చర్చ జరుగుతుంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ సమయంలో తొలి గంటలో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు సమయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సుమారు 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగినట్లు కనిపించింది. అయితే ఈవీఎం లు ఓపెన్ చేసిన కాసేపటికి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారిగా గ్రాఫ్ తగ్గింది! ఈవీఎం కౌంటింగ్ లో బీజేపీ దూసుకెళ్లిపోయింది.

చివరికి 48 స్థానాల్లో గెలిచి హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది బీజేపీ. తొలుత 70కి పైగా స్థానాల్లో ఆధిక్యంలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ పార్టీ జీర్ణించుకోలేకపోతుంది. ఈ సమయంలో ఈవీఎం ల పనితీరుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కీలక ఉదాహరణలు తెరపైకి తెచ్చారు.

అవును... హర్యానా ఎనికల ఫలితాల అనంతరం మరోసారి దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరుపై తీవ్ర చర్చ జరుగుతున సంగతి తెలిసిందే. ఇదే సమయంలో ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ వ్యవస్థను తీసుకురావాలని.. అప్పుడు కానీ ప్రజస్వామ్యాన్ని కాపాడలేరనే చర్చ బలంగా నడుస్తుంది. ఈ సమయంలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

ఇందులో భాగంగా... "హర్యాన ఎన్నికల ఫలితాల నేపథ్యంలో.. ఆంధ్ర ఎన్నికలకు సంబంధించి.. ప్రపంచ బ్యాంకు జీతగాడు.. చంద్రబాబు మోసగాడు.. అన్న కమ్యునిస్టు పార్టీల పాత పాట గుర్తుకొస్తుంది" అని మొదలుపెట్టారు విజయసాయిరెడ్డి. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ప్రస్థావించారు.

ఎలక్షన్ కమిషన్ 3 నెలల తర్వాత ఫార్మ 20 వెబ్ సైట్ లో పెట్టిందని.. ఇందులో పోలింగ్ బూత్ ల వారీగా ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయో చూసుకోవచ్చని చెబుతూ... ఉదాహరణకు హిందూపురం నియోజకవర్గంలోని ఎన్నికల కమిషన్ వెబ్ సైట్ లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఓ వార్డులో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనే విషయాన్ని వివరించారు.

ఇందులో భాగంగా... హిందూపురంలోని ఓ వార్డులో అసెంబ్లీకి పోలైన ఓట్ల విషయానికొస్తే... వైసీపీ - 1, టీడీపీ - 95, బీఎస్పీ - 5, కాంగ్రెస్ - 464 కాగా... అదే వార్డులో పార్లమెంట్ స్థానానికి పోలైన ఓట్ల వివరాలు... వైసీపీ - 472, కాంగ్రెస్ - 1, టీడీపీ - 8, బీఎస్పీ - 83... అని చెబుతూ... ఇది సాధ్యమా? అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇది ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగ్ అని అన్నారు!

అయితే దీని నుంచి దృష్టి మళ్లించడానికి ఫారం 20 వివరాలు బయటకు రాగానే లడ్డూ వ్యవహారం వాళ్ల కుట్రలో భాగంగా, పక్కా స్కెచ్ తో మొదలుపెట్టారు.. చంద్రబాబుకు నిజానిజాలతో పనిలేదు.. ఇది నెయ్యి కోసమో, భగవంతుడి కోసమో మొదలుపెట్టింది కాదు.. ఈవీఎం మోసాలను కప్పిపెట్టడానికి మొదలుపెట్టిన అరాచకం అని రాసుకొచ్చారు సాయిరెడ్డి.

చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన 6 రోజుల తర్వాత కుట్రలో భాగంగానే ఈ తప్పుడు రిపోర్ట్ ను గుజరాత్ నుంచి తెప్పించి పెట్టుకుని టీటీడీకి పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని అన్నారు. ప్రజలెవ్వరూ బూత్ వారీ లెక్కల గురించి మాట్లాడుకోకుండా లడ్డూ దీక్షలు, వగైరా వగైరా... ఇది స్థూలంగా జరిగిన కుట్ర అని సాయిరెడ్డి ట్వీట్ చేశారు.

ఇదే సమయంలో... ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, టెర్రాసాఫ్ట్ మరికొంతమంది కలిసి చేసిన కూట్ర అని.. ఎన్నికల ముందు చంద్రబాబు.. జర్మని, దుయాబ్ లకు.. లోకేష్ ఇటలీ, జర్మనీ, దుయాబ్ లకు చేసిన ప్రయాణాలు ఈ ఈవీఎంల ట్యాంపరింగ్, డబ్బులు బదిలీ కోసమే అన్నది సుస్పష్టం అని సాయిరెడ్డి ఎక్స్ లో రాసుకొచ్చారు.

Tags:    

Similar News