దుర్గగుడిలో మాయగాడు.. టెక్నాలజీతో దోచేస్తున్నాడు
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి దెబ్బకు ఆలయ అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయంలో పనిచేస్తున్న ఓ చిరుద్యోగి దెబ్బకు ఆలయ అధికారులు, సిబ్బంది హడలిపోతున్నారు. సైబర్ టెక్నాలజీలో మంచి పట్టున్న అతడు మొత్తం ఆలయ సమాచారాన్ని హ్యాక్ చేయడమే కాకుండా ఆలయానికి వస్తున్న విరాళాలును కూడా తన సొంత అకౌంట్ కు మళ్లించుకుంటున్నట్లు ఆంధ్రజ్యోతి పత్రిక కథనం ప్రచురించడం రాష్ట్రంలో సంచలనంగా మారింది. టెక్నాలజీలో ఆరితేరిన ఆ ఉద్యోగి తీరుతో విసిగిపోయిన అధికారులు గతంలో సస్పెండ్ చేసినా, రాజకీయ పరపతితో మళ్లీ విధుల్లో చేరి ఈ సారి మరింత రాటుదేలి ఆలయ సర్వర్లను హ్యాక్ చేస్తున్నట్లు చెబుతున్నారు. హ్యాకింగులో మెలకువల కోసం విదేశాలు వెళ్లవచ్చిన అతడి బెడద నుంచి తప్పించుకోడానికి ఆలయ అధికారులు నానా అగచాట్లు పడుతున్నారని టాక్ వినిపిస్తోంది.
ఆలయానికి సంబంధించిన అన్ని విభాగాల ఆన్ లైన్ ఫైళ్లను ఆ ఉద్యోగి తన సిస్టమ్ కు అనుసంధానం చేసుకున్నాడని చెబుతున్నారు. ఏఈవో, సూపరింటెండెంట్ వంటి ఉన్నతాధికారుల నుంచి ఈవోకు వెళ్లాల్సిన కీలక ఫైళ్లను అతడు హ్యాక్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవస్థానానికి విరాళాలు ఇచ్చే దాతల ఫోన్ నంబర్లు, ఇతర వివరాలు సేకరించి ఆలయ ప్రతినిధిగా వారితో మాట్లాడుతూ డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా విరాళాల సొమ్ములను కూడా టెక్నాలజీ సాయంతో తన సొంత అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాడనే అనుమనాలు కూడా ఆలయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.
వెబ్ సైట్లను హ్యాక్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్యగా చెబుతున్నారు. హ్యాకింగులో మెలకువలు నేర్చుకోడానికి తరచూ సింగపూర్, మలేషియా వెళ్లి వస్తుంటాడని అదే సమయంలో విదేశీ హ్యాకర్లు కూడా అతడి వద్దకు వచ్చి వెళ్తుంటారని చెప్పుకుంటున్నారు. గతంలో టెండర్ల సమాచారం లీక్ చేసేందుకు కాంట్రాక్టర్లతో బేరసారాలకు దిగాడనే సమాచారంతో అతడిపై ఓ సారి సస్పెండ్ చేసినట్లు చెబుతున్నారు. అయినా అతడి తీరులో మార్పు రాలేదని అంటున్నారు. ఇక ఆలయ ఈవో డిజిటల్ సిగ్నేచర్ ను కూడా హ్యాక్ చేసి పలు అవకతవకలకు పాల్పడ్డాడని అతడిపై ఫిర్యాదులు చేస్తున్నారు. ఆలయ ఈ ఫైల్స్, ఈ నోటిఫికేషన్స్ వంటివి హ్యాక్ చేసి డేటా చౌర్యానికి పాల్పడుతున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి టెక్నాలజీలో పట్టు సాధించిన ఆ చిరుద్యోగి ఆలయంలో అవకతవకలు పాల్పడటం దేవాదాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.