నట రాజకీయ నేతలకు విజయకాంత్ పోరాటం ఓ పాఠం
ఇక గురువారం తెల్లవారుజామున చనిపోయిన హీరో విజయకాంత్ ను తమిళ ప్రజల నల్ల ఎంజీఆర్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. అలాంటి విజయకాంత్ సొంతంగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు.
రాజకీయాలంటే ఒడిదొడుకులు ఎదుర్కొని నిలవాలి.. అవమానాలను భరించాలి.. విమర్శలను తట్టుకోవాలి.. ఎదురుదాడులను నేర్చుకోవాలి.. అవసరమైతే తగ్గాలి.. కావాలంటే తెగించాలి.. మొత్తానికి ఒక పార్టీని స్థాపించి నడపాలంటే నానా ఇబ్బందులూ పడాలి. పూర్తిస్థాయి రాజకీయాల్లో ఉంటూ, రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన వారికి ఇవి కాస్త తేలికే. కానీ, నటులుగా అత్యంత ప్రేమాభిమానాలు, స్టార్ హోదా పొంది రాజకీయాల్లోకి వచ్చినవారికి మాత్రం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనడం అంత తేలిక కాదు.
ఒక్కడే గెలిచినా.. నిలిచాడు
తమిళ రాజకీయాలు సినిమాలతో విడదీయరానంతగా మిళితమై ఉంటాయి. సినీ రంగానికి చెందిన ఎంజీఆర్, కరుణానిధి, జయలలిత తమిళనాడు సీఎంలు అయ్యారంటేనే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కమల్ హాసన్ వంటి సుప్రసిద్ధ హీరో రాజకీయ పార్టీని స్థాపించారు. మరో సుప్రసిద్ధ హీరో రజనీకాంత్ రాజకీయాల్లోకి ప్రవేశాన్ని చివరి నిమిషంలో వాయిదా వేసుకున్నారు. ప్రస్తుతం అత్యంత ప్రేక్షకాదరణ ఉన్న తమిళ హీరోలు కొందరు రాజకీయాల్లోకి వస్తారనే ప్రచారమూ జరుగుతోంది. ఇక గురువారం తెల్లవారుజామున చనిపోయిన హీరో విజయకాంత్ ను తమిళ ప్రజల నల్ల ఎంజీఆర్ అంటూ ప్రేమగా పిలుచుకుంటారు. అలాంటి విజయకాంత్ సొంతంగా పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి వచ్చారు. 2005లో తమిళనాడు రాజకీయ అస్థిరత కనిపించింది. ఆ ఏడాది సెప్టెంబరు 14న డీఎండీకే (దేశీయ ద్రవిడ మర్పొక్కు కళగం) పేరిట పార్టీని నెలకొల్పారు. ఆ ఎన్నికల్లో తమిళనాడులోని అన్ని (234) అసెంబ్లీ సీట్లకూ పోటీ చేసినా విజయకాంత్ ఒక్కరే నెగ్గారు. ఓవైపు కరుణానిధి, మరోవైపు జయలలిత వంటి దిగ్గజాలను ఎదుర్కొంటూనే పార్టీని కొనసాగించారు. అంతే తప్ప పరిస్థితులు అనుకూలంగా లేవని మూసివేయడమో, విలీనం చేయడమో చేయలేదు.
2011లో ప్రధాన ప్రతిపక్షం స్థాయికి..
2006 ఎన్నికల్లో దారుణ పరాజయం పాలైనా.. 2011 నాటికి డీఎండీకే విస్మరించలేని పార్టీ స్థాయికి చేరింది. జయలలిత పార్టీ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుని 29 సీట్లలో నెగ్గింది. దీంతో శాసన సభలో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. కరుణానిధి సారథ్యంలోని డీఎంకేకు 23 సీట్లే వచ్చాయి. దీంతో ప్రధాన ప్రతిపక్ష నేతగా విజయకాంత్ వ్యవహరించారు. 2016 ఎన్నికల నాటికి విజయకాంత్ అనారోగ్యం పాలయ్యారు. అయినప్పటికీ పోటీ చేశారు. కానీ, పరాజయం చెందారు. 105 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు పోటీ చేయగా ఎవరూ గెలవలేదు.
పార్టీని మాత్రం ఎత్తేయలేదు..
రాజకీయంగా పెద్దగా ఫాయిదా లేకున్నప్పటికీ విజయకాంత్ తన పార్టీని మాత్రం కొనసాగించడమే ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. అధికారం అందనప్పటికీ నిరాశ చెందలేదు. సినిమా తళుకుబెళుకుల్లో పెరిగిన వారికి ఇలాంటి పరిస్థితి చాలా ఇబ్బందికరమే. అయినా విజయకాంత్ రాజకీయ పట్టుదలను వీడలేదు. 2006లో సొంతంగా, 2011లో అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకుని, 2016లో పీపుల్స్ వెల్ఫేర్ అలయన్స్ తో కలిసి పోటీ చేసి ఉనికిని కాపాడుకున్నారు. అంతేకాదు.. ఆ నెల 14వ తేదీ వరకు డీఎండీకే అధ్యక్ష బాధ్యతల్లో కొనసాగారు. గెలుపోటములతో సంబంధం లేకుండా పార్టీని కొనసాగించారు. అందుకనే.. విజయకాత్ రాజకీయ ప్రస్థానం నట నాయకులకు ఓ పాఠం.