మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ కి ఓటమి ఖాయం...ఈ సర్వే ఎవరిదంటే...?
అయితే దానికి భిన్నంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ విశ్లేషణలను అనుఇభవనాన్ని జోడించి మరీ సర్వే నివేదికను వినిపించారు.
సెమీ ఫైనల్స్ గా భావిస్తున్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు గెలుస్తారు అన్నది పూర్తి ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీగా మారిన ఈ హోరో హోరీ పోరులో గెలిచేది ఎవరు అంటే సర్వేశ్వరులు అయితే మెజారిటీ కాంగ్రెస్ పక్షమే అంటున్నాయి. కనీసంగా మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ గెలుస్తుంది అని తమదైన విశ్లేషణలు చేస్తూ వస్తున్నాయి.
అయితే దానికి భిన్నంగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తన రాజకీయ విశ్లేషణలను అనుఇభవనాన్ని జోడించి మరీ సర్వే నివేదికను వినిపించారు. దేశంలో కాంగ్రెస్ మూడు కీలక రాష్ట్రాలలో ఓటమి పాలు అవుతుంది అని ఆయన అంటున్నారు. ఆయా రాష్ట్రాల పేర్లను ఆయన ముందు పెట్టారు. రాజస్థాన్, తెలంగాణా, మధ్యప్రదేశ్ లలో ఈసారి కాంగ్రెస్ గెలవదు అని ఆయన చెప్పేశారు.
మరి కాంగ్రెస్ గెలవదు అంటే గెలిచే పార్టీ ఏదో మాత్రం ఆయన చెప్పలేదు. చిత్రమేంటి అంటే ఈ రాష్ట్రాలలో రెండింటిలో కాంగ్రెస్ కి అసలైన ప్రత్యర్ధిగా బీజేపీ ఉంది. తెలంగాణాలో బీయరెస్ బీజేపీ ఉన్నాయి. అంటే బీజేపీ ఇక్కడ గెలిచి తీరుతుంది అన్నది విజయసాయిరెడ్డి విశ్లేషణ అనుకోవాలి. ఇక కాంగ్రెస్ ఎందుకు ఓడిపోబోతుందో ఆయన విడమరచి చెప్పారు. కాంగ్రెస్ ఎపుడూ పేదల వ్యతిరేకిగానే ఉంటూ వస్తోంది. ఆ పార్టీ పాలన ఎపుడూ అవినీతి కుంభకోణాల మయంగానే ఉంటూ వచ్చిందని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇటీవల కొద్ది నెలల క్రితం కర్నాటకలో కాంగ్రెస్ గెలిచినా అక్కడ పాలన అస్తవ్యస్తంగా ఉందని విజయసాయిరెడ్డి ఎత్తి చూపారు. కర్నాటకలో అభివృద్ధి పనులు అన్నీ నిలిచిపోయాయని అక్కడి ప్రజలు దాన్ని గుర్తిస్తున్నారని కూడా విజయసాయిరెడ్డి చెప్పారు. ఇక మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఏలుబడిలో ఎపుడూ అత్యంత వెనకబడిన రాష్ట్రంగానే ఉంది అని ఆయన అంటున్నారు.
కాంగ్రెస్ కి అణగారిన వర్గాలు పేదలు అంటే ఎపుడూ ముందుకు తీసుకుని రావడం ఇష్టం ఉండదని విజయసాయిరెడ్డి అంటున్నారు. చత్తీస్ ఘడ్ లో కాంగ్రెస్ గెలిచినా అభివృద్ధిని మరచి కాంగ్రెస్ పార్టీకి నిధులు సమకూర్చడంలోనే బిజీగా ఉంది అని ఆయన అన్నారు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ని అశాస్త్రీయంగా కాంగ్రెస్ విభజించిందని దానికి ప్రజలు ఎపుడూ ఆ పార్టీని క్షమించరు అని విజయసాయిరెడ్డి స్పష్టం చేస్తున్నారు.
మొత్తానికి కాంగ్రెస్ దేశంలో ఎక్కడా గెలవదు అని ఎప్పటికీ గెలవదు అని విజయసాయిరెడ్డి విశ్లేషణ ఉంది. మరి విజయసాయిరెడ్డి అనుభవంతో చెబుతున్న విషయాలు ఇందులో ఉన్నాయి. ఆ విధంగా జరుగుతుందా లేక సర్వేశ్వరులు గణాంకాలు ఇచ్చినట్లుగా కాంగ్రెస్ పైకి లేస్తుందా అన్నది చూడాలి దీని కంటే ముందు కాంగ్రెస్ ఓటమిని వైసీపీలో ముఖ్య నేత అయిన విజయసాయిరెడ్డి ఎందుకు కోరుకుంటున్నారు అన్నది అసలైన చర్చగా ఉంది.