ఆట మొదలైంది... రోజా, భైరెడ్డికి ఒకేసారి కష్టం

గత ప్రభుత్వంలో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.119 కోట్ల రూపాయలతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహించారు.;

Update: 2025-03-11 08:12 GMT

వైసీపీ నేతలే టార్గెట్ గా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియా కేసులతో అరెస్టు పర్వం కొనసాగిస్తుండగా, ఇప్పుడు అవినీతి, అక్రమాలపై విచారణను షురూ చేసింది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన మాజీ మంత్రి ఆర్ కే రోజా, శాప్ మాజీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఒకేసారి షాక్ ఇచ్చేల ప్రభుత్వం పావులు కదుపుతోందని అంటున్నారు. ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమంలో అవినీతి చోటుచేసుకుందనే ఫిర్యాదులపై ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో రోజా, బైరెడ్డికి ఉచ్చు బిగిసినట్లేనని టాక్ వినిపిస్తోంది.

గత ప్రభుత్వంలో గ్రామీణ క్రీడలు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో రూ.119 కోట్ల రూపాయలతో ‘ఆడుదాం ఆంధ్రా’ కార్యక్రమం నిర్వహించారు. అయితే ఈ కార్యక్రమం కోసం కొనుగోలు చేసిన కిట్లు, ఇతర వస్తువులకు అధిక ధర చెల్లించి ప్రజాధనాన్ని దారి మళ్లించారని చాలా కాలంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విజయవాడకు చెందిన ఓ ప్రైవేటు వ్యక్తి ఆడుదాం ఆంధ్రా అవినీతిలో మాజీ మంత్రి రోజాకు భాగం ఉందంటూ ఫిర్యాదు చేశారు.

మరోవైపు రాష్ట్ర క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి సైతం ఎప్పటికప్పుడు గత ప్రభుత్వ అవినీతిపై చర్యలు తీసుకుంటామని ప్రకటిస్తూ వస్తున్నారు. ఇక నిన్న అసెంబ్లీలోనూ ఈ విషయమై చర్చ జరిగింది. మాజీ మంత్రి, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ మాట్లాడుతూ, ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతిపై ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటుందో చెప్పాలని కోరారు. ఆమెకు రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష మద్దతు ప్రకటించారు. దీంతో సభ్యుల ప్రశ్నకు మంత్రి రామప్రసాద్ రెడ్డి స్పందిస్తూ ఆడుదాం ఆంధ్రా కార్యక్రమంలో అవినీతిపై వచ్చిన ఫిర్యాదులను విచారించేందుకు ప్రత్యేక కమిటీని నియమించినట్లు చెబుతున్నారు.

ఇదే సమయంలో శాప్ చైర్మన్ రవినాయుడు సైతం ఆడుదాం ఆంధ్రా కిట్ల కొనుగోలులో అవినీతి చోటుచేసుకుందని సీఐడీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మాజీ మంత్రి ఆర్ కే రోజాతోపాటు, మాజీ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్థార్థ్ రెడ్డిలకు కష్టాలు తప్పవని అంటున్నారు. ఈ ఇద్దరూ ప్రభుత్వ విచారణను ఎదుర్కోవాల్సివస్తే, ఏం జరుగుతుందోననే టెన్షన్ వైసీపీ శ్రేణుల్లో కనిపిస్తోంది. రోజా, బైరెడ్డి ఇద్దరూ రాయలసీమకు చెందిన రెడ్డి సామాజిక వర్గం నేతలు, అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ కి బలమైన మద్దతుదారులు. ఫైర్ బ్రాండ్ లీడర్లుగా గుర్తింపు తెచ్చుకున్న ముఖ్యనేతలు ఇద్దరినీ ఒకే కేసులో బుక్ చేసి వైసీపీ వాయిస్ పై ఉక్కుపాదం మోపాలని కూటమి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని అంటున్నారు. దీంతో రానున్న రోజుల్లో ఏం జరుగుతుందోననే టెన్షన్ ఎక్కువవుతోంది.

Tags:    

Similar News