క్షణ క్షణం ఉత్కంఠగా విశాఖ మేయర్ అవిశ్వాసం
ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు కలుపుకుని టోటల్ నంబర్ 112గా చెబుతున్నారు.;
విశాఖ మేయర్ ని గద్దె నుంచి దించేందుకు టీడీపీ కూటమి సర్వ శక్తులూ ఒడ్డుతోంది. వైసీపీ నుంచి పెద్ద ఎత్తున కార్పోరేటర్లను చేర్పించుకుంది. మొత్తం విశాఖ కార్పోరేషన్ లో 99 మంది కార్పోరేటర్లు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 97గా ఉంది. ఇక ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఎంపీలు ఎమ్మెల్యేలు కలుపుకుని టోటల్ నంబర్ 112గా చెబుతున్నారు.
వైసీపీ మేయర్ అయిన హరి వెంకట కుమారి మీద అవిశ్వాస తీర్మానం నోటీసుకుని టీడీపీ కూటమి నేతలు కలెక్టర్ కి అందచేశారు. దాంతో అవిశ్వాసం మీద చర్చకు డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. కార్పోరేషన్ లో మొత్తం 75 మంది సభ్యుల బలం ఉంటేనే మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుంది. అయితే కౌన్సిల్ లో టీడీపీకి సొంతంగా 29 మంది కార్పోరేటర్ల బలం ఉంది. వైసీపీ నుంచి వచ్చిన వారితో కలుపుకుని ఆ బలం యాభై దాకా చేరింది. ఎక్స్ అఫీషియో మెంబర్స్ మద్దతుతో 60 దాటుతుంది. జనసేన బీజేపీల బలం మరో పది నుంచి పన్నెండు దాకా ఉంటుంది అని అంటున్నారు
అంటే 75 మంది మెంబర్స్ మద్దతుకు కూటమి చాలా దగ్గరగా ఉందని అంటున్నారు. వైసీపీకి 31 మంది కార్పోరేటర్ల మద్దతు ఉందని చెబుతున్నారు. ఇందులో నుంచి కొందరిని తమ వైపు తిప్పుకుంటే తిరుగులేని మెజారిటీతో మేయర్ మీద అవిశ్వాసం నెగ్గుతుందని కూటమి నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ ఇంతలో బిగ్ ట్విస్ట్ ఇచ్చింది.
తమ వైపు ఉన్న మొత్తం కార్పోరేటర్లను కాపాడుకోవడానికి క్యాంప్ రాజకీయాలకు తెర తీస్తోంది. ఇక సీనియర్ మోస్ట్ నేత మాజీ మంత్రి బొత్స సత్యనారాయణను వైసీపీ అధినాయకత్వం ఈ కీలకమైన సమయంలో రంగంలోకి దించింది. ఆయన తన వ్యూహాలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి మొత్తం కార్పోరేటర్లను కనుక కాపాడుకుంటే మేయర్ ని గద్దె నుంచి దించడానికి అవసరం అయిన 75 మందికి కొంత లోటు ఏర్పడుతుందని అంటున్నారు
అయితే తమకు సరిపడా బలం కంటే ఇంకా ఎక్కువగానే ఉందని కూటమి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలా కాదు విశాఖ మేయర్ వైసీపీ నుంచి పోదని, తమ పార్టీకే కార్పోరేషన్ పీఠమని దానిని తాము కాపాడుకుంటామని మాజీ మంత్రి ఉత్తరాంధ్రా వైసీపీ ఇంచార్జి కురసాల కన్నబాబు చెబుతున్నారు. దాంతో ఎవరి మాట నిజం. ఎవరికి అసలు బలం ఉంది. రియల్ బలగం ఎంత అన్న దాని మీద ఎడతెగని చర్చకు సాగుతున్నాయి.
విశాఖ మేయర్ పీఠం కల అన్నది టీడీపీకి నాలుగు దశాబ్దాల పై దాటినది. దాంతో ఈసారి ఎలాగైనా వచ్చిన చాన్స్ ని వాడుకుని మేయర్ కుర్చీని దక్కించుకోవాలని చూస్తోంది. అంతటా అనుకూల వాతవరణం ఉంది. అధికారం చేతిలో ఉంది. దాంతో ఇపుడు కనుక చక్రం తిప్పకపోతే మరెప్పుడు అన్న చర్చ కూటమిలో సాగుతోంది. ఇంకో వైపు చూస్తే వైసీపీలో ఇంకా ఆశలు అడుగంటిపోలేదని అంటునారు. వామపక్షాలకు చెందిన ఇద్దరు కార్పోరేటర్లతో పాటు మరికొందరు అవిశ్వాసానికి వ్యతిరేకంగా ఓటు వేస్తారని ఆ విధంగా అవిశ్వాసం వీగిపోతుందని భావిస్తోంది. మొత్తం మీద చూస్తే క్షణ క్షణం ఉత్కంఠను రేపే విధంగా మేయర్ అవిశ్వాసం ఉంది.
వైసీపీ క్యాంప్ రాజకీయాలకు తెర తీయడం కూటమికి ఊహించని పరిణామంగా చెబుతున్నారు. అవిశ్వాస గండం నుంచి కనుక వైసీపీ బయటకు వస్తే ఏకంగా అయిదేళ్ళ పాటు విశాఖ మేయర్ గా పాలించిన ఘనతను సొంతం చేసుకున్నట్లే. మరి ఈ పోరులో ఎవరిది పై చేయి అన్నదే తేలాల్సి ఉంది.