చిన్న ఎన్నిక పెద్ద ర‌చ్చ‌.. విశాఖ‌లో ఏం జ‌రుగుతోంది..?

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి టీడీపీ కూట‌మి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో చిన్న ఎన్నికకు రంగం రెడీ అయింది

Update: 2024-08-05 10:13 GMT

రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికలు ముగిసి టీడీపీ కూట‌మి అధికారంలోకి వచ్చింది. అయితే ఇప్పుడు మరో చిన్న ఎన్నికకు రంగం రెడీ అయింది. ఇది పేరుకు చిన్నదే అయినా తెరవెనుక‌ మాత్రం పెద్ద ఎత్తున లాబీయింగ్ జరుగుతోంది. అసెంబ్లీలో 11 స్థానాలకే పరిమితమైన వైసీపీ తన హవాను చాటుకోవడం కోసం ఈ చిన్న ఎన్నికను కూడా పెద్దదిగా భావిస్తుంది. ఇక వైసీపీకి చెక్ పెట్టే విషయంలో ఏ అవకాశాన్ని వదిలిపెట్టుకోకూడదని భావిస్తున్న‌ కూటమి ప్రభుత్వం... కూడా సవాల్‌గా తీసుకుంది.

దీంతో విశాఖపట్నంలో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతున్నది. ఇంతకీ ఎన్నికలు ఏంటంటే.. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ ఎన్నికలు! ఈ కమిటీలో మొత్తం పది స్థానాలు ఉన్నాయి. కార్పొరేషన్ మొత్తానికి ఈ స్టాండింగ్ కమిటీ అత్యంత కీలకం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా.. నగరంలో ఎలాంటి నిర్మాణాలు జరగాల‌న్నా.. ఎలాంటి అభివృద్ధి సాగాలన్నా.. స్టాండింగ్ కమిటీ కీల‌కం. దీంతో స్టాండింగ్ కమిటీ పదవులను ద‌క్కించుకునేందుకు అటు వైసీపీ ఇటు టిడిపి కూటమి ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నాయి.

ఈ పది మంది స్టాండింగ్ కమిటీ సభ్యులను విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలోని 50 మంది కార్పొరేటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. అంటే కనీసం 50 మంది కార్పొరేటర్ల మద్దతు లేకపోతే ఈ పది స్టాండింగ్ కమిటీ సభ్యుల ను దక్కించుకోవడం కష్టంగా మారుతుంది. దీంతో అధికార టిడిపి కూటమి ప్రతిపక్ష వైసిపి కూడా తమ తమ ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. గతంలో జరిగిన స్థానిక సంస్థలు ఎన్నికల్లో విశాఖపట్నం కార్పొరేషన్‌ను వైసీపీ ద‌క్కించుకున్న‌ విషయం తెలిసిందే.

అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పరిధిలోని సుమారు 12 నుంచి 15 మంది కార్పొరేటర్లు కూట‌మి వైపుకు మొగ్గు చూపారు. అలానే వారు నేరుగా కండువా క‌ప్పుకోక పోయినా.. వైసీపీతో మాత్రం ఉండటం లేదు. ఇక, మిగిలిన 42 నుంచి 45 మంది కార్పొరేటర్లు మాత్రం వైసిపి వైపే ఉన్నారు. దీంతో వీరిని తమ వైపు తెచ్చుకునేందుకు టిడిపి తెరచాటు ప్రయత్నాలు చేస్తుండగా తమకు దూరంగా ఉన్న 12 మంది నుంచి 15 మంది కార్పొరేటర్ లను తిరిగి త‌మ‌వైపు తెచ్చుకునేందుకు వైసిపి ప్రయత్నాలు చేస్తోంది.

ఈ ప్రయత్నంలో ఫలించి వైసిపి కనుక స్టాండింగ్ కమిటీని తన వైపు మలుచుకోగలిగితే కార్పొరేషన్ లో తిరుగు ఉండదని చర్చ సాగుతోంది. ఇదే సమయంలో కూటమి ప్రభుత్వానికి కూడా ఇదే స‌వాల్‌గా మారింది. అయితే గతంలో మాదిరిగా వైసీపీ తరఫున విజయసాయిరెడ్డి ఇప్పుడు విశాఖపట్నంలో లేకపోవడం, ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్చార్జిగా వైవి సుబ్బారెడ్డి ఉండటంతో వైసీపీలో కొంత గందరగోళం అయితే నెలకొంది. ఈ నేపథ్యంలో జగనే స్వయంగా రంగంలోకి దిగుతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక టీడీపీ కూడా బలమైన ప్రయత్నం చేస్తోంది. దీంతో ఏం జరుగుతుందో చూడాలి.

Tags:    

Similar News