సిక్కోలు సీన్ : ఎస్సీ ఎస్టీల ఓట్లు కావాలి కానీ...!
అలాగే ఒక అసెంబ్లీ సీటు పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ఉన్నపుడు ఎస్సీలకు ఎస్టీలకు ప్రాతినిధ్యం ఉండేది. అయితే రెండేళ్ళ క్రితం జిల్లాను విభజించారు. ఇపుడు కేవలం ఏడు అసెంబ్లీ సీట్లే ఉన్నాయి. రెండు అసెంబ్లీ సీట్లు విజయనగరం జిల్లాలోకి వెళ్ళాయి. అలాగే ఒక అసెంబ్లీ సీటు పార్వతీపురం మన్యం జిల్లాలోకి వెళ్ళిపోయింది.
ఇదిలా ఉంటే ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో రాజాం ఎస్సీ అసెంబ్లీ సీటుగా ఉండేది. పాలకొండ ఎస్సీ సీటుగా ఉండేది. ఇపుడు విభజన తరువాత ఎసీ ఎస్టీలకు అసెంబ్లీ సీట్లు ఏవీ ని ఆయా సామాజిక వర్గాల వారు అడుగుతున్నారు. తమకు శ్రీకాకుళం జిల్లాలో ప్రాతినిధ్యం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తమ ఓట్లు కావాలి కానీ తమకు సీట్లు ఇవ్వరా అని వారు ప్రశ్నిస్తున్నారు. జనరల్ సీట్లలో ఎస్సీ అభ్యర్ధులకు సీట్లు ఇవ్వకూడదా అని నిలదీస్తున్నారు. తాము పోటీ చేయడానికి పనికి రామా అని అడుగుతున్నారు. అధికార వైసీపీ విపక్ష టీడీపీ రెండూ కూడా ఇతర సామాజిక వర్గాల వారికి టికెట్లు ఇచ్చారు కానీ ఎస్సీ ఎస్టీలను అసలు పట్టించుకోలేదని వారు వాపోతున్నారు.
సామాజిక న్యాయం పేరుతో గతంలో యాత్రలు చేసిన వైసీపీ రిజర్వుడ్ సీట్లలో మాత్రమే సీట్లు ఇచ్చిందని గుర్తు చేస్తున్నారు. సామాజిక న్యాయం అంటే జనరల్ సీట్లలో కూడా చాన్స్ ఇచ్చి గెలిపించుకోవాలని వారు అంటున్నారు. అదే విధంగా టీడీపీ కూడా అనేక రకాలుగా మాటలు చెబుతోంది కానీ సీట్లు మాత్రం ఇవ్వలేదని వారు గుర్రు మంటున్నారు.
విభజన తరువాత శ్రీకాకుళం జిల్లాలో 22 లక్షల దాకా జనాభా ఉంటే అందులో రెండు లక్షల పై చిలుకు ఎస్సీలు ఉన్నారని అంటున్నారు. లక్షకు పై బడి ఎస్టీలు ఉన్నారు. ఏడు అసెంబ్లీ సీట్లలో చూస్తే పాతపట్నంలో దాదాపుగా నలభై వేల దాకా ఎస్టీ ఓట్లు ఉన్నాయని చెబుతున్నారు. ఆ తరువాత 16 వేల మంది దాకా ఇచ్చాపురంలో ఉన్నారు. అలాగే పలాసలో మరో 16 వేల మంది ఉన్నారు
అదే విధంగా ఎస్సీలు కూడా అనేక నియోజకవర్గాల్లో కనీసంగా పది వేల నుంచి గరిష్టంగా ముప్పై వేల మందికి పైగా ఉన్నారని చెబుతున్నారు. జిల్లాలో ఎచ్చెర్లలో నియోజకవర్గంలో అత్యధికంగా 34,153 మంది ఎస్సీల జనాభా ఉంది. పాతపట్నం నియోజకవర్గంలో 32,702 మంది, టెక్కలిలో 26,935 మంది శ్రీకాకుళంలో 23,048 మంది జనాభా ఉందని చెబుతున్నారు.
తమకు రాజకీయ పార్టీలు టికెట్లు ఇవ్వకపోవడంతో తాము ఇండిపెండెంట్లుగా పోటీ పడతామని ఆ సామాజిక వర్గానికి చెందిన నాయకులు చెబుతున్నారు. టెక్కలి పలాస, పాతపట్నంతో అసెంబ్లీ సీట్లతో పాటు శ్రీకాకుళం ఎంపీ సీట్లలో పోటీ చేయాలని ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల ప్రతినిధులు సీరియస్ గా ఆలోచిస్తున్నారుట. అదే జరిగితే ప్రధాన పార్టీల ఓట్లకు గండి పడడం ఖాయమని అంటున్నారు.