చంద్రబాబుకు వక్ఫ్ బిల్లు సెగ.. విషయం ఇదీ..!
ఈ క్రమంలో టీడీపీపై రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలు ప్రజెర్ పెంచాయి. మద్దతు ఇవ్వద్దంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
ఏపీ సీఎం చంద్రబాబుకు వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు సంబంధించిన సెగ తగులుతోంది. గత వారం పది రోజులుగా రాష్ట్ర వ్యాప్తం గా ఉన్న మైనారిటీ ముస్లింలు అమరావతిలోని సచివాలయానికి వచ్చి.. చంద్రబాబును, మైనారిటీ మంత్రిని కలుస్తున్నారు. తమకు అండగా ఉండాలని, తమకు మద్దతు ఇవ్వాలని వారు కోరుతున్నారు. అయితే.. వారివిన్నపాలను వింటున్నా.. ఇతమిత్థంగా వారికి హామీ ఇచ్చే విషయంలో చంద్రబాబు తర్జన భర్జన పడుతున్నారు. మైనారిటీలకు మద్దతు ఇచ్చే ఉద్దేశం ఉన్నా.. కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు ఈ విషయంలో పట్టుదలతో ఉండడంతో చంద్రబాబు ఆలోచనలో పడ్డారు.
ఏంటీ బిల్లు..!
ముస్లిం మైనారిటీలకు సంబంధించి.. దేశవ్యాప్తంగా ఉన్న భూములను పరిరక్షించుకునేందుకు.. 1957లో బిల్లు తీసుకువచ్చా రు. దీనిని అప్పటి పార్లమెంటు ఆమోదించింది. దీని ప్రకారం.. మైనారిటీ ముస్లింలకు చెందిన భూములపై వక్ఫ్ బోర్డుకు సర్వాధికారాలు దఖలు పడ్డాయి. దీనిని 2004-06 మధ్య అప్పటి యూపీఏ ప్రభుత్వం మరిన్ని సవరణలు చేసింది. దీని ప్రకారం.. వక్ఫ్ బోర్డు సభ్యులు ఎక్కడైనా తమ భూమి ఉందని చూపించినా.. పేర్కొన్నా.. ఎలాంటి విచారణ లేకుండానే ఆ భూమిని స్వాధీనం చేసుకునే హక్కును వారికి ఆపాదించారు.
అయితే.. ఈ వ్యవహారం రాను రాను దేశంలో వివాదంగా మారింది. యూపీలోని పలు గ్రామాలను వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుంది. ఇది మాభూమి అని వక్ఫ్ బోర్డు తీర్మానం చేస్తే.. దీనిపై న్యాయ విచారణ లేకుండానే.. స్వాధీనం చేసుకునే హక్కు బోర్డుకు దఖలు పడింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
ఒక్క యూపీనే కాదు.. తెలంగాణ, ఏపీల్లోనూ అనేక భూములను వక్ఫ్ స్వాధీనం చేసుకుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి ఉన్న విశేషాధికారాల వల్లే న్యాయ విచారణకు కూడా అవకాశం లేకుండా పోయిందన్న విమర్శలు వున్నాయి. ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లోనే బీజేపీ.. తాము అధికారంలోకి వస్తే.. వక్ఫ్ బోర్డు బిల్లును సవరిస్తామని హామీ ఇచ్చింది.
దీనికి సంబంధించిన బిల్లును ఈ ఏడాది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ బిల్లును వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంటులో ప్రవేశ పెట్టేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే.. కేంద్రంలో బీజేపీకి చాలినంత మెజారిటీ లేకపోవడం, కూటమిగా ఉన్న నేపథ్యంలో కీలకమైన టీడీపీ ఈ బిల్లుకు మద్దతు తెలపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో టీడీపీపై రాష్ట్రంలోని మైనారిటీ వర్గాలు ప్రజెర్ పెంచాయి. మద్దతు ఇవ్వద్దంటూ చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తున్నాయి. మరోవైపు.. వైసీపీ అధినేత జగన్ ఇప్పటికే తాము ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నామని.. పార్లమెంటు సమావేశాల్లో తమ సభ్యులు ఈ బిల్లు కు మద్దతు ఇవ్వబోరని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు తీసుకునే నిర్ణయం కీలకంగా మారనుంది.