ఎవరు సీఎం...టెన్షన్ కంటిన్యూ!
పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలీ ఇత్యాది విషయాలు అన్నింటిమీద హై కమాండ్ అయితే పూర్తి స్థాయిలో చర్చిస్తోంది.
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు. అధికారంలోకి వచ్చి పాలించాల్సిన మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువగానే మెజారిటీ కట్టబెట్టారు. ఇల సీఎల్పీ లీడర్ ఎన్నిక అన్నది మిగిలింది. దాని కోసం ఎమ్మెల్యేలు అంతా హైదరాబాద్ లోని ఒక్ హొటల్ లో సమావేశం అయి కాంగ్రెస్ హై కమాండ్ కే బాధ్యత అప్పగిస్తూ డెసిషన్ తీసుకున్నారు.
దీంతో మొత్తం వ్యవహారం అంతా ఢిల్లీకి వెళ్ళిపోయింది. ఇక ఢిల్లీలో కూడా సోమవారం మొత్తం అంతా చర్చించినా పీటముడి వీడలేదు అని అంటున్నారు. ముఖ్యమంత్రి పదవికి రేవంత్ రెడ్డిని కన్ ఫర్మ్ చేసినట్లుగా తెలుస్తున్నా మిగిలిన పోస్టులలో ఎవరికి ఇస్తారు, ఎవరికి ఎక్కడ బాధ్యతలు ఇస్తారు కీలక శాఖలు డిప్యూటీ సీఎం పోస్టులు ఎన్ని, స్పీకర్ గా ఎవరుంటారు. పీసీసీ చీఫ్ ఎవరికి ఇవ్వాలీ ఇత్యాది విషయాలు అన్నింటిమీద హై కమాండ్ అయితే పూర్తి స్థాయిలో చర్చిస్తోంది.
సామాజిక సమీకరణలు రాజకీయ సమీకరణలతో పాటు లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని సీఎం తో సహా అన్ని పోస్టులకు ఎంపిక జరుగుతుంది అని అంటున్నారు. దాంతో హై కమాండ్ కూడా ఆచీ తూచీ వ్యవహరిస్తోందని అంటున్నారు. మరో వైపు చూస్తే రేవంత్ రెడ్డికి సీఎం ఇస్తే ఒక ప్రముఖ సామాజిక వర్గం హర్షిస్తుంది అని లెక్కలు ఉన్నాయి. పైగా ఆ సామాజిక వర్గం అండడండలు రానున్న ఎన్నికల్లో కూడా కావాల్సి ఉంది అని అంటున్నారు.
దాంతో పాటు సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సైతం సీఎం పోస్టుని ఆశిస్తున్నారు. ఆయనకు ఇస్తే ఎస్సీ సామాజిక వర్గానికి న్యాయం జరుగుతుంది. అయితే ఆయనకు డిప్యూటీ సీఎం ఇస్తారని అంటున్నారు. అయితే సీఎం లేకపోతే సింగిల్ గానే డిప్యూటీ సీఎం పోస్ట్ ఇవ్వాలని భట్టి కండిషన్ పెడుతున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీసీ ఎస్టీలకు వీలైతే మైనారిటీలకు కూడా ఉప ముఖ్యమంత్రి పదవులు కట్టబెట్టాలని హై కమాండ్ ఆలోచిస్తోంది అని అంటున్నారు.
అలా అయితే ఆ పదవి ఎందుకు అన్నది భట్టి వర్గీయుల భావనగా ఉంది. తన ఒక్కడికే డిప్యూటీ సీఎం పదవి ఇచ్చి కీలకమైన శాఖలు చేతిలో ఉంచాలని భట్టి కోరుతున్నారని అంటున్నారు. ఇక బీసీ నుంచి డిప్యూటీ సీఎం పోస్ట్ కోసం పొన్నం ప్రభాకర్ కోరుతున్నట్లుగా చెబుతున్నారు.
అదే విధంగా సీనియర్లకు కీలకమైన శాఖలు ఇవ్వాల్సి ఉంది. వారిలో కొందరు సీఎం పోస్ట్ కావాలని లేకపోతే అసలు మంత్రి పదవే వద్దు అని అంటున్నారు అని తెలుస్తోంది. ఇక స్పీకర్ పదవి ఇస్తామని కొందరు సీనియర్లకు చెబుతున్నా వారు నో అంటున్నట్టుగా భోగట్టా. అలాగే మరికొందరు సీనియర్లను పీసీసీ చీఫ్ తీసుకోమని కోరుతున్నారుట. అది కూడా వద్దు అంటున్న వారూ ఉన్నారు.
మొత్తానికి కాంగ్రెస్ సీఎం సమస్య అయితే ఎడ తెగని చర్చగానే ఉంది. పార్టీ కోసం కష్టపడిన రేవంత్ కి సీఎం పదవి ఇవ్వాలని హై కమాండ్ కి ఉంది. అదే విధంగా సీనియర్లకు న్యాయం జరగాలి. అదే విధంగా సామాజిక రాజకీయ సమీకరణలకు కూడా న్యాయం చేయాలి. దీంతో హై కమాండ్ మరికొంత సమయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
ఈ నేపధ్యంలో సీఎం ఎవరు అన్నది తేలేందుకు మంగళవారం దాకా ఆగాల్సి ఉంటుందని ఢిల్లీ వర్గాల భోగట్టా. ఇక సోమవారం ఏ రాత్రికైనా సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం ఇవ్వడంతో రాజ్ భవన్ లో ఏర్పాట్లు చేసి ఉంచారు. పోలీసు అధికారులు కూడా అక్కడకు చేరుకుని భద్రతా ఏర్పాట్లు చూశారు. కానీ సోమవారం ఏ సంగతీ తేలకపోవడంతో రాజ్ భవన్ లో సందడి సద్దుమణిగింది. టోటల్ గా చూస్తే సీఎం ఎవరు అన్నది ఇంకా ఉత్కంఠంగానే ఉంది. కాంగ్రెస్ సీనియర్లలో టెన్షన్ పెడుతూనే ఉంది.