లోకేష్ కేరాఫ్ మంగళగిరి... ఏం జరుగుతోంది...!?
ఎన్నికలకు ఏండాదిన్నరకు ముందే యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టిన నారా లోకేష్ ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి శంఖారావం సభలు నిర్వహించారు.
నారా లోకేష్ సార్వత్రిక ఎన్నికల సమయానికి ఎక్కడా కనిపించడం లేదు ఎందుకు అన్న చర్చ సాగుతోంది. ఎన్నికలకు ఏండాదిన్నరకు ముందే యువగళం పేరుతో పాదయాత్రను చేపట్టిన నారా లోకేష్ ఆ తరువాత కొంత గ్యాప్ ఇచ్చి శంఖారావం సభలు నిర్వహించారు. అవి కొన్ని జిల్లాలలో సాగాయి.
ఇక ఎన్నికల ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా లోకేష్ చేస్తారు అని అనుకుంటున్న తరుణంలో లోకేష్ మాత్రం కేరాఫ్ మంగళగిరి అన్నట్లుగా ఉన్నారు. ఆయన కనీసం టీడీపీ కూటమి సభలలో కూడా ఎక్కడా కనిపించడంలేదు. ఈ సభలలో చంద్రబాబు పవన్ మాత్రమే ఉంటున్నారు. లోకేష్ ఎందుకు స్టేట్ వైడ్ ప్రచారానికి దూరంగా ఉంటున్నారు అన్న చర్చకు తెర లేస్తోంది.
అయితే మంగళగిరిలో ఈసారి లోకేష్ కి అత్యంత ప్రతిష్టాత్మకం కాబట్టి ఆయన అక్కడ ఉంటూ ప్రచారం చేసుకుంటున్నారు అని అంటున్నారు. అక్కడ నుంచే ఆయన ట్విట్టర్ కి పని చెప్పి విమర్శలు చేస్తున్నారు తప్ప మంగళగిరి పొలిమేరలు దాటి రావడం లేదు.
దాన్ని వైసీపీ నేతలు అయితే మరో రకంగా చెబుతున్నారు. మంగళగిరిలో టైట్ పొజిషన్ అక్కడ ఉండడం తోనే లోకేష్ ఆ గడప దాటి రాలేకపోతున్నారు అని ఎద్దేవా చేస్తున్నారు. తన ఒక్క సీటు చూసుకునే లోకేష్ రాష్ట్ర నాయకుడు ఎలా అవుతారు అని అంటున్నారు.
అయితే టీడీపీ వ్యూహం ప్రకారమే లోకేష్ ని మంగళగిరికి పరిమితం చేసింది అని అంటున్నారు. లోకేష్ వస్తే ఆయన మీద వైసీపీ నేతలు విమర్శలు ఎక్కుపెడతారు అని చంద్రబాబు కాదు లోకేష్ ముఖ్యమంత్రి అవుతారు అని కూడా కొత్త ప్రచారానికి తెర తీస్తారు అని అంటున్నారు. నిజానికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు ఈసారి ఎన్నికలు లోకేష్ భవిష్యత్తు కోసమే అన్న మాట ఉంది.
టీడీపీ అధికారంలోకి వస్తే కనుక అయిదేళ్ళ పాటు చంద్రబాబు పాలిస్తారా అన్న డౌట్లూ కూడా వ్యక్తం చేసే వారు ఉన్నారు. లోకేష్ కి మధ్యలో పట్టాభిషేకం చేస్తారు అని రూమర్స్ కూడా పాస్ చేస్తున్న వారు ఉన్నారు. దాంతో లోకేష్ ని కేవలం ఎమ్మెల్యే అభ్యర్ధిగా చూపించే ప్రయత్నంలో భాగంగానే ఇలా చేస్తునారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే కనుక టీడీపీ జనసేన బీజేపీతో కలసి పోటీ చేస్తోంది. మిత్రుల మధ్య పొరపొచ్చాలు రాకుండా చూసుకోవడానికి సైతం ఇలా చేస్తోంది అని అంటున్నారు. లోకేష్ కూటమి మీటింగులలో ఉంటే భావి నాయకుడిగా ప్రొజెక్ట్ చేస్తారని దాని వల్ల కూటమిలో మిత్రులు కూడా నొచ్చుకునే ప్రమాదం ఉందని అంటున్నారు. దాంతో ఈ విధంగా వ్యూహాత్మకంగానే చేస్తున్నారు అని అంటున్నారు. మొత్తానికి చూస్తే గడచిన రెండు నెలలుగా లోకేష్ ఎక్కడా రాష్ట్ర స్థాయి సభలలో కనిపించడం లేదు అని గుర్తు చేస్తున్నారు.