బీఆర్ ఎస్ సంబరం.. ఉప ఎన్నిక వస్తే గెలిచేనా?
అయితే.. ఈ వ్యవహారం ఎటూ తేలక పోవడంతో బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా కోర్టుకు వెళ్లారు.
పొలిటికల్ జిలానీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు.. ప్రతిపక్ష బీఆర్ ఎస్ పార్టీలో సంబరాలు నింపాయి. ``అదిగో మేం చెబితే వినలేదు.. ఇప్పుడైనా వేటు వేయండి`` అని బీఆర్ ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు స్పీకర్ ప్రసాదరావు నిర్ణయం తీసుకోక తప్పని సరి పరిస్థితి ఏర్పడింది. దానం నాగేందర్, తెల్లం బాలరాజు, కడియం శ్రీహరిలు పార్టీ మారారని.. వీరిపై అనర్హత వేటు వేయాలని ఎప్పటి నుంచో బీఆర్ ఎస్ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
అయితే.. ఈ వ్యవహారం ఎటూ తేలక పోవడంతో బీఆర్ ఎస్, బీజేపీ నాయకులు వేర్వేరుగా కోర్టుకు వెళ్లారు. చివరకు సోమవారం ఈ వ్యవహారంపై హైకోర్టు తీర్పు ఇచ్చింది. నాలుగు వారాల్లో స్పీకర్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. లేకపోతే.. తామే సుమోటోగా ఈ విషయంపై కేసు చేపట్టి నిర్ణయం తీసుకుంటామని హైకోర్టు స్పష్టం చేసింది. ఇక, ఈ వ్యవహారంపై బీఆర్ ఎస్ నాయకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని కూడా చెప్పారు.
అంతేకాదు.. ఉప ఎన్నికలు ఖాయమని.. బీఆర్ ఎస్ నాయకులు రెడీగా ఉండాలని కూడా.. మాజీమంత్రి హరీష్‌రావు ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. అంతా బాగానే ఉంది. రేపు ఉప ఎన్నికలే వచ్చినా.. బీఆర్ ఎస్ తట్టుకుని గట్టెక్కుతుందా? అనేది ప్రశ్న. ఎందుకంటే.. ఎన్నికలు జరిగి 10 మాసాలైంది. ఈ పది నెలలలో బీఆర్ ఎస్ ఎక్కడా పుంజుకున్నట్టు కనిపించడం లేదు. పైగా పార్లమెంటు ఎన్నికల్లో జీరో పెరఫార్మెన్స్ చూపించింది. కాబట్టి ఇప్పుడు ఉప ఎన్నికలు వచ్చినా.. సత్తా చాటే అవకాశం ఎంత? అనేది ప్రశ్న.
పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ ఎస్ ఏమాత్రం సత్తా చూపించలేక పోయిన విషయం తెలిసిందే. ఇక, పార్టీ అదినేత కేసీఆర్ కూడా ప్రజల మద్యకు రావడం లేదు. మరోవైపు మాస్ నాయకుడిగా సీఎం రేవంత్ రెడ్డి దూకుడుగా ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణం.. రైతు రుణ మాఫీ.. వరద బాధితులకు సాయం వంటి వాటిలో దూకుడుగా ఉన్నారు. ఇక, హైడ్రాతో చెలరేగిపోతున్న విషయం కూడా తెలిసిందే. దీనికితోడు పార్టీలోను.. ప్రభుత్వంలోనూ రేవంత్‌కు తిరుగులేకుండా పోయింది. మరి ఇన్ని పాజిటివ్‌లు ఇటువైపు కనిపిస్తుంటే.. బీఆర్ ఎస్ ఏమేరకు పుంజుకుంటుందో చూడాలి.