ఇండియా కూటమి జగన్ కి చోటిస్తుందా ?

ఇపుడు ఎలాంటి ఊగిసలాటలకు తావు లేకుండా జగన్ కాంగ్రెస్ కి మరింత గట్టిగానే మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఈ మద్దతుని ఎలా చూస్తుంది అన్నదే చర్చ.

Update: 2024-10-11 09:30 GMT

జగన్ కి ఇపుడు ఉన్నది ఒక్కటే దారి అన్నట్లుగా పరిస్థితి మారింది. రాజకీయాల్లో దారులు చూసుకోవాలి. ఒకటే దారి అన్నట్లుగా ఉండరాదు. ఎపుడు ఏ వైపు నుంచి ఇబ్బంది వస్తుందో తెలియదు. కానీ వైసీపీ పుట్టుకే కాంగ్రెస్ మీద వ్యతిరేకతతో కాబట్టి ఆ వైపు చూడకూడదు అని గట్టిగా నిర్ణయించుకుంది.

దానికి తగినట్లుగా పరిస్థితులు కూడా అనుకూలించాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ఒక్కసారిగా కునారిల్లడంతో పాటు బీజేపీ ప్రభ దేశంలో ఒక వెలుగు వెలిగింది. దాంతో వైసీపీకి కాంగ్రెస్ పట్టింపు లేకుండా పోయింది. అదే సమయంలో బీజేపీ కాంగ్రెస్ కి బద్ధ శత్రువు కాబట్టి ఆ పార్టీతో పరోక్ష చెలిమికి అది ఆస్కారం ఇచ్చింది

శత్రువుకు శత్రువు మిత్రుడు అన్న థియరీ మేరకే మొదట వైసీపీ బీజేపీతో సాన్నిహిత్యం పరోక్షంగా అయినా పెంచుకుంది అని అంటారు. అయితే అది రాను రానూ ఒక బలమైన బంధంగా తెర వెనక మారింది. దానికి మరో కారణం బాబుతో బీజేపీకి పడకపోవడంతో జగన్ కి అదే బాబుతో రాజకీయ శత్రుత్వం ఉండడంతో కమలానుబంధం చాన్నాళ్ళు సాగింది.

కానీ బీజేపీ రాజకీయ పాఠాలలో శాశ్వత శత్రువులు ఎవరూ లేరన్నది గట్టిగా ఒకటికి పది సార్లు చదువుకుంది. అదే జగన్ మాత్రం శత్రువు అంటే శాశ్వతమే అనుకున్నారు. సరిగ్గా ఇక్కడే వైసీపీ ఇబ్బందిలో పడింది. 2024 ఎన్నికల ముందు బీజేపీ చకచకా పావులు కదిపి టీడీపీతో బంధం పునరుద్ధరించుకుంది.

కానీ వైసీపీ మాత్రం ఒంటరి అయి అభిమన్యుడి మాదిరిగా ఈ రాజకీయ పద్మవ్యూహంలో చిక్కుకుంది.ఫలితం దారుణం ఓటమి లభించింది. పోనీ ఈ అయిదేళ్ళే టీడీపీతో చెలిమి ఆ మీదట మళ్ళీ మన వైపే చూడాలని ఇంతకాలం వైసీపీ ఓపిక పట్టి వేసుకున్న అంచనాలు పెట్టుకున్న నమ్మకాలూ ఒక్కోటీ భ్రమలుగా మారుతున్నాయి. ఏపీలో బీజేపీ తన రాజకీయ పునాదుల కోసం జనసేనను కూడా అట్టే బెట్టుకుంది. దాంతో ఇక ఎపుడూ వైసీపీతో చేతులు కలిపేందుకు వీలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లలోనే ఉంది అని అంటున్నారు.

ఈ క్రమంలో జగన్ ఆలస్యంగా అయినా కాంగ్రెస్ కి అనుకూలంగా సంకేతాలు ఇస్తున్నారు. హర్యానా ఓటమితో కృంగిపోయిన కాంగ్రెస్ కి ఇండియా కూటమి మిత్రుల కంటే జగన్ వేసిన ఒక్క ట్వీటే ఎంతో మనోధైర్యాన్ని కలిగించింది అనుకోవాలి. జగన్ ఆ విధంగా బాహాటంగా బీజేపీని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ వాదనను సమర్ధించారు.

దాంతో జగన్ ఇండియా కూటమిలో చేరుతారా అన్న వేడి వేడి చర్చ జాతీయ స్థాయిలో మొదలైంది. ఆ మధ్య దాకా ఇదే మాట అనుకున్నా మళ్ళీ ఆ ప్రచారం కాస్తా నెమ్మదించింది. ఇపుడు ఎలాంటి ఊగిసలాటలకు తావు లేకుండా జగన్ కాంగ్రెస్ కి మరింత గట్టిగానే మద్దతు ప్రకటించారు. అయితే కాంగ్రెస్ ఈ మద్దతుని ఎలా చూస్తుంది అన్నదే చర్చ.

మరో వైపు చూస్తే ఏపీ రాజకీయాల్లో వైసీపీని కలుపుకుని వెళ్ళాలా లేదా అన్నది కూడా ఖద్దరు పార్టీ జాతీయ నేతలకు ఇప్పటికి అయితే ఒక అవగాహన లేదనే అంటున్నారు. రానున్న రోజులలో మారే రాజకీయ బట్టి ఇది ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. ఏది ఏమైనా జగన్ ఇపుడు ఇండియా కూటమి వైపు చూస్తున్నారు అని అంటున్నారు. మరి అందులో చోటు ఉంటుందా అన్నది తెలియాలంటే వెయిట్ అండ్ సీ.

Tags:    

Similar News