అసలైన త్యాగరాజుని బాబు కరుణించడం లేదా ?
మరి ఇటీవల 20 దాకా నామినేటెడ్ పదవులను టీడీపీ కూటమి ప్రభుత్వం పందేరం చేసింది.
ఏపీలో అతి పెద్ద త్యాగరాజు ఎవరు అంటే పిఠాపురం వర్మనే చెప్పాలి. ఎందుకంటే ఆయన తన అసెంబ్లీ సీటుని పొత్తులో భాగంగా మిత్రపక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి త్యాగం చేశారు. అది కూడా తానే ఇక పోటీకి అని అయిదేళ్ల పాటు అంతా తిరిగి అన్నీ సమకూర్చుకుని చివరి నిముషంలో పక్కకు తప్పుకోవడం అంటే మామూలు త్యాగం అయితే కానే కాదని అంటారు.
మరి ఇటీవల 20 దాకా నామినేటెడ్ పదవులను టీడీపీ కూటమి ప్రభుత్వం పందేరం చేసింది. అందులో టీడీపీ వాటా కింద పదహారు కార్పోరేషన్లు దక్కాయి. కానీ ఆ లిస్ట్ లో చూస్తే ఎక్కడా పిఠాపురం వర్మ కనిపించడం లేదు. దాంతో ఆయన అనుచరులు అభిమానులు ఇదేమిటి అని విస్మయంతొ పాటు కాసింత విచారం కూడా వ్యక్తం చేస్తున్నారు.
ఇక టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక రెండు ఎమ్మెల్సీ సీట్లు భర్తీ చేశారు. ఆ రెండింటిలో ఒకటి టీడీపీకి మరొకటి జనసేనకు దక్కాయి. అపుడు పిఠాపురం వర్మ పేరు వినిపించినా అవకాశం అయితే రాలేదు అని అంటున్నారు.
ఇపుడు మరో చాన్స్ వచ్చింది. అదే పట్టభద్రుల కోటాలో ఎమ్మెల్సీ అయ్యే చాన్స్. గుంటూరు కృష్ణా జిల్లాలు అలాగే గోదావరి జిల్లాలలో పట్టభద్రుల ఎమ్మెల్సీలకు ఎన్నికలు వస్తున్నాయి. అయితే గుంటూరు క్రిష్ణా జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజాను ఎంపిక చేసినట్లుగా తెలుస్తోంది.
ఆయన తెనాలి సీటుని జనసేన నేత నాదెండ్ల మనోహర్ కోసం త్యాగం చేశారు ఇక పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేసిన పిఠాపురం వర్మకు గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ సీటుని ఇస్తారని అనుకుంటే దాని కోసం అయితే కాపు లేదా ఎస్సీ అభ్యర్థి పేరుని ఖరారు చేసే సూచనలు ఉన్నాయని అంటున్నారు.
ఈ రెండు సీట్లూ కచ్చితంగా టీడీపీ ఖాతాలోకే పడతాయి.గత ఏడాది మొదట్లో జరిగిన ఉత్తరాంధ్ర రాయలసీమ పట్టభద్రుల సీట్లు మూడు కూడా వైసీపీ అధికారంలో ఉన్నపుడే టీడీపీ గెలుచుకుంది. ఆ విధంగా ఏపీలో పొలిటికల్ గా గేర్ మార్చిన టీడీపీ విజయానికి తొలి మెట్టుగా పట్టభద్రులే నిలిచారు.
ఇక ఇపుడు చూస్తే ఈ రెండు సీట్లు కూడా ఖాయంగా టీడీపీ కూటమికే అన్నది చెప్పడానికి ఏ సర్వే అవసరం లేదు. పైగా అధికారంలో ఉన్న పార్టీ. వైసీపీ అయితే పోటీకి నిలబడుతుందో లేదో కూడా తెలియదు. పోటీ పడినా నామమాత్రమే అవుతుంది ఇపుడున్న పరిస్థితుల్లో అని అంటున్నారు.
దీంతో జస్ట్ నామినేషన్ వేస్తే చాలు గెలుపు ఖామని అనుకున్న ఈ సీటుని పిఠాపురం వర్మకు ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు ఆయన అనుచరులు. వర్మకు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తొలి చాన్స్ ఇస్తామని ఎన్నికల వేళ పదే పదే హామీలు ఇచ్చిన కూటమి పెద్దలు తీరా ఇపుడు అనేక అవకాశాలు వస్తున్నా కూడ వర్మ గురించి తలవడం లేదు ఎందుకు అన్న చర్చ సాగుతోంది.
మొత్తానికి వర్మకు పదవి ఏదైనా దక్కే సీన్ ఉందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారుట. వర్మ వర్సెస్ జనసేన అని ఇప్పటికే పిఠాపురంలో ఒక రకమైన రాజకీయ రగడ సైలెంట్ గా సాగుతోంది. దాంతో అయనకు పదవి కూడా వస్తే దూసుకుని పోతారు అన్న ఆలోచనలతోనే ఇలా చేస్తున్నారా అన్నది కూడా ఆయన అనుచరులలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. మొత్తానికి అతి పెద్ద త్యాగరాజు విషయంలో బాబు దయ కలిగేది ఎపుడు అన్న చర్చ వస్తోంది.