జమిలి దెబ్బ తగిలే ప్రాంతీయ పార్టీలు ఏవి ?
గడువు సరిపోదూ అనుకుంటే జేపీసీకి మరింత సమయం ఇస్తారు.
దేశంలో జమిలి జ్వరం అయితే ఆవరించింది. జమిలి ఎన్నికలు ఎపుడు జరుగుతాయి అన్నది ఇదమిద్దంగా అయితే ఎవరికీ తెలియదు. ప్రస్తుతం జమిలి ఎన్నికల బిల్లు జేపీసీ ముందుకు వెళ్ళింది. జేపీసీ దీనిని సమగ్రంగా చర్చింది ఒక నివేదిక ఇస్తుంది. గడువు సరిపోదూ అనుకుంటే జేపీసీకి మరింత సమయం ఇస్తారు.
అలా 2025లో జేపీసీ పని ప్రారంభించిన నివేదిక వచ్చేసరికి 2026 రావచ్చు. ఇక దానిని చట్టం చేయాలంటే బీజేపీకి అది నాయకత్వం వహిస్తున్న ఎన్డీయే కూటమికి పార్లమెంట్ లో బలం సరిపోదు. అందువల్ల జమిలి ఎన్నికల మీద అలా చర్చలు జరుగుతూ ఉండగానే పుణ్యకాలం వచ్చి 2029 ఎన్నికలు వస్తాయని అంటున్నారు.
ఏతా వాతా తేలేది ఏంటి అంటే అన్నీ సర్దుకుని జమిలి ఎన్నికల చట్టం రాష్ట్రపతి ద్వారా నోటిఫికేషన్ జారీ అయ్యేది 2029 ఎన్నికల తరువాతనే అంటున్నారు. అంటే 2034లో జమిలి ఎన్నికలు జరగవచ్చు అన్నది ప్రస్తుతానికి అందుతున్న భోగట్టా. అది కూడా ఒక అంచనాగా ముందుకు వస్తోంది.
ఇలా ఎందుకు అనుకోవాల్సి వస్తుంది అంటే 2029 లో ఏ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వస్తుందో తెలియదు. మళ్లీ బీజేపీ వస్తేనే జమిలి బండి జల్దీ గా కదులుతుంది. లేక ఇండియా కూటమి వస్తే జమిలి ఎన్నికలకు మంగళం పలుకుతారు అని అంటున్నారు.
ఇవన్నీ పక్కన పెడితే జమిలి ఎన్నికలు అంటూ జరిగితే దెబ్బ పడేది ప్రాంతీయ పార్టీలకే అని అంటున్నారు. ఆ ప్రాంతీయ పార్టీలు బలంగా దశాబ్దాల తరబడి వేళ్ళూనుకుని క్యాడర్ బేస్డ్ గా లీడర్ ఇమేజ్ తో నడిచేవి అయితే జమిలి ఎన్నికల ప్రభావం వాటి మీద ఇసుమంత అయినా ఉండకపోవచ్చు.
అలా చూసుకుంటే తమిళనాట డీఎంకే, తెలుగునాట టీడీపీ వంటివి వెరీ స్ట్రాంగ్ బేస్ ఉన్న పార్టీలుగా ముద్ర పడ్డాయి. మరో ఏడేళ్లలో టీడీపీ అర్ధ శతాబ్దం పార్టీ కూడా అవుతుంది. డీఎంకే చూస్తే ఇప్పటికే ఏడున్నర పదుల వయసు దాటిన పార్టీగా ఉంది.
ఈ పార్టీలు కాకుండా మిగిలిన పార్టీలకు కొంత ఇబ్బందులు అయితే దక్షిణాన కలిగే చాన్స్ ఉంది అని అంటున్నారు. ఆయా పార్టీలు వ్యక్తుల చుట్టూ తిరగడమో లేక తమ ఇమేజ్ నే చూపించి పార్టీని గెలిపించుకోవడమో చేస్తూ వస్తే మాత్రం జమిలి ఎన్నికల పేరుతో జాతీయ పార్టీలు వాటిని మింగేయడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
అదే విధంగా దశాబ్దాల చరిత్ర ఉన్న పార్టీలు అయినా సరైన వారసత్వం లేక సమర్ధ నాయకులు లేకపోతే మాత్రం అవి కూడా జాతీయ పార్టీల బారిన పడి అదృశ్యం కావడం జరుగుతుంది అని అంటున్నారు. ఆ విధంగా చూస్తే ఉత్తాదిన కొన్ని పార్టీలు ఇప్పటికే అస్తిత్వ సమస్యతో సతమతమవుతున్నాయి. వాటి విషయంలో జమిలి దెబ్బ ఖాయమనే అంటున్నారు.
ఇక జమిలి ఎన్నికలు అన్నవి కనుక జరిగితే దేశంలో జాతీయ పార్టీల నాయకత్వంలో రెండే కూటములు ఉంటాయని అంటున్నారు. వాటితో విలీనం కావడమో లేక బలమైన పార్టీలు అయితే పొత్తు పెట్టుకోవడమో జరుగుతుంది అని అంటున్నారు. మొత్తం మీద చూస్తే జమిలి ఎన్నికల విషయంలో ప్రాంతీయ పార్టీలు భయపడుతున్నది అంతా జరుగుతుంది అనే అంటున్నారు.
ఇప్పటికైతే జమిలిని వ్యతిరేకించే కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలు కూడా రేపటి రోజున ప్రాంతీయ పార్టీల తాకిడిని తట్టుకోలేక బీజేపీ బాటలో పయినించినా జరగవచ్చు అంటున్నారు. మొత్తానికి జాతీయ పార్టీలు ఎపుడూ తమ హవా చాటాలని కోరుకుంటాయి. అది బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా ఒక్కటే. మధ్యన పడి నలిగేది మాత్రం ప్రాంతీయ పార్టీల అని అంటున్నారు. మరి జమిలికి బలి అయ్యే ప్రాంతీయ పార్టీలు ఏవి అన్నది ముందు ముందు తెలుస్తుంది అని అంటున్నారు. అసలు జమిలి ఎన్నికల ప్రక్రియ సాగుతుండగానే చాలా ప్రాంతీయ పార్టీలు విలీనం అయినా అదృశ్యమైనా ఆశ్చర్యపోనవసరం లేదు అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.