జమిలి సరే.. నియోజకవర్గాల పునర్విభజన అడగరేం?!
కాబట్టి.. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీలు జమిలికి జై కొట్టినట్టే.
మరో ఏడాదిలో దేశంలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు కేం ద్రం ఇప్పటికే సమాచారం కూడా పంపించింది. దీనికి ఏపీకి కూడా రెడీ అవుతోంది. అధికార కూటమి పార్టీలైన టీడీపీ జమిలికి రెడీ అవుతున్నట్టు ప్రకటించింది. ఇక, జనసేన కూడా ఇదే బాటలో నడిచే అవకాశం ఉంది. కానీ, ఇప్పటి వరకు అధికారికంగా ప్రకటించలేదు. మరోవైపు.. ప్రతిపక్షం వైసీపీ కూడా జమిలికి జై కొట్టింది. కాబట్టి.. ఇప్పుడు ఏపీలో ఉన్న అన్ని పార్టీలు జమిలికి జై కొట్టినట్టే.
అయితే.. ఇక్కడే ప్రధాన విషయాన్ని పార్టీలు మరిచిపోతున్నాయా? లేక వదిలేశాయా? అన్నది చర్చగా మారింది. రాష్ట్రంలో విభజన తర్వాత.. నియోజకవర్గాల పునర్ విభజన చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని విభజన చట్టంలోనూ పేర్కొన్నారు. ఒక్క ఏపీనే కాకుండా.. తెలంగాణలోనూ పార్లమెంటు, అసెంబ్లీ నియో జకవర్గాలను కొత్తగా ఏర్పాటు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 175 స్థానాలు ఉన్న ఏపీలో నియోజకవర్గాల పునర్ విభజన తర్వాత.. 225 అవుతాయి. అంటే.. 50 నియోజకవర్గాలు పెరుగుతాయి.
దీనివల్ల పెరుగుతున్న యువ నాయకులకు టికెట్లు ఇచ్చేందుకు అవకాశం మెండుగా ఉంటుంది. అయి తే.. దీనిని కేంద్రమే చేయాల్సి ఉంది. పార్లమెంటులో ప్రత్యేక బిల్లు పెట్టి.. నియోజకవర్గాలను విభజించా లి. గతంలో చంద్రబాబు 2014-19 మధ్య తరచుగా కేంద్రాన్ని ఈ విషయంపై ఒత్తిడి చేశారు. కానీ, కేంద్రం ఒప్పుకోలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన వైసీపీ అసలు ఈ విషయాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు ఏకంగా జమిలి దిశగా కేంద్రం అడుగులు వేస్తోంది.
ఈ సమయంలోనే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పునర్విభజన దిశగా చర్యలు తీసుకునేలా ఒత్తిడి పెంచాలి. లేకపోతే.. కేంద్రం ఏపీలో నియోజకవర్గాలను విభజించే ఆలోచనను పక్కన పెట్టే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. పార్టీలలో పెరుగుతున్న నాయకులకు, ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాలు సరిపోని పరిస్థితినే రేపు జమిలి వచ్చినా ఎదుర్కొనాలి. కాబట్టి.. ఇప్పటికైనా ఈ విషయంపై మరోసారి కేంద్రానికి లేఖలు రాయడమో.. సమాచారం అందించడమో చేస్తే.. తప్ప ఫలితం లేదు.