జగన్ సీఎం గా ఉన్నపుడు పార్టీని పట్టించుకోలేదు... ఇపుడు మేము పోరాటాలు చేయాలా ?

నిజానికి పార్టీని బలోపేతం చేసేది అధికారంలో ఉన్నపుడు కానీ విపక్షంలో ఉన్నపుడు కాదు అన్నది తెలిసిందే.

Update: 2024-10-02 22:30 GMT

వైసీపీ అధినేత జగన్ కి ఇపుడు తన పార్టీ గుర్తుకు వచ్చింది అని సొంత పార్టీ వారే ఎకసెక్కమాడుతున్నారు. దేశంలోనే బలమైన పార్టీగా వైసీపీని చేయాలని ఆయన తన కోరికను బయట పెట్టారు. నిజానికి పార్టీని బలోపేతం చేసేది అధికారంలో ఉన్నపుడు కానీ విపక్షంలో ఉన్నపుడు కాదు అన్నది తెలిసిందే.

అన్ని రకాలుగా వనరులు ఉన్నపుడే పార్టీని పటిష్టం చేసుకోవాలి. క్యాడర్ విశ్వాసం అందుకుని పార్టీని పది కాలాల పాటు చెక్కు చెదరకుండా చేసుకోవాల్సి ఉంది. కానీ అపుడేమో చేతిలో వెలుగు ఉండగా పార్టీని చీకటి చేశారు అని అంటున్నారు. ఇపుడు చూస్తే మొత్తం కటిక చీకటి ఎటు పోవాలో దారి కనిపించని అయోమయం. ఈ గందరగోళం మధ్య పార్టీని బలోపేతం చేయాలని చాలా పెద్ద ఆశలే జగన్ పెట్టుకున్నారు అని అంటున్నారు.

పార్టీ అధికారంలో ఉన్నపుడు ఇలాంటి కోరికలు ఎందుకు కలగలేదు బాసూ అని కూడా వైసీపీ కేడర్ అంటోంది. ఇపుడు చూస్తే జగన్ బాగానే చెబుతున్నారు. పార్టీ బాగుంటేనే అంతా బాగుంటామని కూడా సెలవిస్తున్నారు

పార్టీ మనందరిదీ అని గుర్తుంచుకోవాలని కూడా ఆయన చెబుతున్నారు. ఇక తాను అధినేతను కాదు కేవలం ప్రతినిధిని అని కూడా జగన్ అంటున్నారు. అంటే నింగి నుంచి నేలకు దిగిపోయారు అన్న మాట. అందుకే ఇపుడు పార్టీ గుర్తుకు వచ్చింది అని అంటున్నారు.

ఇక జగన్ ఆశలు ఆకాంక్షలు ఏ స్థాయిలో ఉన్నాయంటే పార్టీ ఒక్క పిలుపు ఇస్తే చాలుట. పై నుంచి దిగువ స్థాయి వరకూ అంతా ఒక్కటి అయి కదలి రావాలి. ప్రజల తరఫున చేసే పోరాటాలలో ముందు ఉండాలంట. అధినేత కోరికలు బాగానే ఉన్నా జనం కోసం జెండా పుచ్చుకుని పోరాడే ఓపిక తీరిక కోరిక తమకు లేనే లేవని క్యాడర్ అయితే కుండ బద్ధలు కొడుతోంది.

దీనికి అంతటికీ కారణం జగనే అని అంటోంది. అధికారం వచ్చి చేతిలో పడగానే నాలుగు గోడల మధ్యన బంధీ అయిపోయిన అధినాయకత్వం పార్టీ బాగోగులు అయిదేళ్ల కాలంలో ఏనాడూ పట్టించుకోలేదు అన్నది వారు అంతా నిర్వేదంతో అంటున్న మాటగా ఉంది.

నిజానికి ఎలాంటి ఫలాపేక్ష లేకుండా పదేళ్ళ పాటు పార్టెని పట్టుకుని వేలాడి పార్టీ కోసం కాలాన్ని ఆస్తులను అన్నీ ఖర్చు చేసేసుకుని వైసీపీ కేడర్ అంతా ఉన్నారు. తీరా అధికారం దక్కగానే వారి అవసరమే లేదన్నట్లుగా హై కమాండ్ ప్రవర్తించింది. అంతే కాదు క్యాడర్ ప్లేస్ లోకి వాలంటీర్లను తెచ్చారు. వారితోనే అంతా అని అనుకున్నారు. వారు ఉంటే చాలు పార్టీతో పని ఏముందని కూడా భావించారు.

ఇలా క్యాడర్ ని దూరం పెట్టమని వాలంటీర్లను నెత్తికెక్కించుకోమని జగన్ కి రాంగ్ డైరెక్షన్ ఇచ్చిన వారు వైసీపీలోనే ఈ రోజుకీ ఉన్నారని అంటున్నారు. ఇపుడు పార్టీ పిలుపు ఇస్తే కేడర్ బయటకు వచ్చి పోరాటాలు చేయాలని అంటున్నారు. అధికార పక్షం వారి మీద లేని పోని కేసులు పెడితే దిక్కెవరు అని కూడా ప్రశ్నలు వస్తున్నాయి.

అసలు క్యాడర్ మీద కేసులు పడినా ఇబ్బందులు వచ్చినా ఎవరు చూసుకుంటారు అన్న దానికి బదులు ఉందా అని అంటున్నారు. ఇక అయిదేళ్ళ పాటు ఎంతో కష్టపడినా కేసులు పెట్టించుకుని పోరాడినా మరో సారి అధికారంలోకి వైసీపీ వస్తే మళ్లీ వారిని పట్టించుకుంటారు అన్న గ్యారంటీ ఏముంది అన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.

అందువల్ల క్యాడర్ లో ఒక రకమైన అప నమ్మకం, నిరాశ నిర్వేదం అన్నీ కలిసి ఉన్నాయి. వైసీపీ అంటే ఒకనాడు మోజు పడిన వారు కూడా ఇపుడు తత్వం అంతా బోధపడి మౌన ముద్ర దాలుస్తున్నారు. వారికి తెలుసు తమ అవసరం ఈ రోజున పార్టీకి ఉందని. అదే సమయంలో తమను ఉపయోగించుకుని రేపటి రోజున అందలాలు ఎక్కితే మళ్ళీ తమకు ఇదే గతి అని కూడా బాగా అర్ధం అవుతోందిట.

ఇక వైసీపీ క్యాడర్ ఏతా వాతా తేలుస్తోంది ఏంటి అంటే తమకు వైసీపీ మీద ఈ రోజుకీ అభిమానం ఉందని అయితే అది వీధి పోరాటాలు చేసి దెబ్బలు తిని కేసులు పెట్టించుకునేంత వెర్రి వ్యామోహం కాదని. తాము వైసీపీకే ఎన్నికల్లో ఓటు వేస్తాము కానీ పోరాటాలు మాత్రం చేయలేమని అంటున్నారు.

మొత్తం మీద వైసీపీకి నిఖార్సు అయిన జనాలు ఉన్నారు. కానీ వారి ప్రేమను అభిమానాన్ని జగన్ ని రాంగ్ ట్రాక్ లో పెట్టి పార్టీలోని కొందరు పెద్దలు తగ్గించేలా చేశారు. మళ్లీ వారిని ట్రాక్ లో పెట్టి దారి పట్టించడం అంటే కష్టమే అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.

Tags:    

Similar News