బాలయ్య పొలిటికల్ లెజెండ్ అవుతారా...!?
బాలయ్య కూడా ఆ ధీమాతోనే తన నియోజకవర్గం దాటి ప్రచారానికి దిగిపోయారు. ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు.
నందమూరి బాలక్రిష్ణ ఎన్టీఆర్ సినీ వారసత్వాన్ని గత నాలుగు దశాబ్దాలుగా కొనసాగిస్తున్నారు. ఆయన రాజకీయాల్లో కూడా తండ్రి ఉన్నప్పటి నుంచే ఉన్నారు. అయితే 2014 ఎన్నికల ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి బాలయ్య వచ్చారు. హిందూపూర్ నుంచి ఆయన 2014, 2019లలో వరసగా రెండు సార్లు గెలిచారు. జగన్ వేవ్ లో సైతం గెలిచి నిలిచి తనకు తిరుగులేదనిపించుకున్నారు. ఇపుడు బాలయ్య హ్యాట్రిక్ విక్టరీ కొడతారు అని అంటున్నారు.
ప్రస్తుతం చూస్తే హిందూపూర్ లో బాలయ్య విజయానికి పరిస్థితి అనుకూలంగా ఉందని అంటున్నారు. బాలయ్య కూడా ఆ ధీమాతోనే తన నియోజకవర్గం దాటి ప్రచారానికి దిగిపోయారు. ఆయన రాయలసీమ నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలెట్టారు. తన నియోజకవర్గం విషయంలో భయం బెంగా లేకుండా ఉన్న అతి ముఖ్య నాయకుడిగా టీడీపీ కూటమిలో బాలయ్య కనిపిస్తున్నారు. ఆయన రాయలసీమ అంతటా ప్రచారం చేపడుతున్నారు.
బాలయ్య ప్రచారానికి మంచి స్పందన లభిస్తోంది. స్వర్ణాంధ్ర రధం పేరుతో బాలయ్య ప్రత్యేక వాహనాన్ని తయారు చేయించుకుని జనంలోకి వస్తున్నారు. బాలయ్య సభలలో జన సందోహం కనిపిస్తోంది. సహజంగానే బాలయ్యకు రాయలసీమలో ఆదరణ ఉంది. ఆయన సినిమాలు అక్కడే బాగా ఆడతాయి. అయితే బాలయ్య ప్రచారంలో కూడా గట్టిగానే మాట్లాడుతున్నారు. పంచులేస్తున్నారు. జగన్ కి ఒక్క చాన్స్ పూర్తి అయింది ఈసారి కుర్చీమడతెట్టి ఓడించి పంపుతారు అంటూ మంచి టైమింగ్ తో బాలయ్య పేలుస్తున్న డైలాగులకు జనాల నుంచి మంచి స్పందన లభిస్తోంది.
అదే సమయంలో కూటమిలోని జనసేన బీజేపీలను కూడా ఆయన ప్రస్తావిస్తూ మోడీని పవన్ కళ్యాణ్ ని కూడా పొగుడుతూ తన ప్రసంగాన్ని రక్తి కట్టిస్తున్నారు. కూటమి దాటి సోలోగా ప్రచారం చేస్తూ క్రౌడ్ పుల్లర్ గా ఉన్న నేతగా బాలయ్య కనిపిస్తున్నారు. ఒక విధంగా చెప్పాలి అంటే కూటమి విజయం కోసం ఆయన తన వంతుగా శ్రమిస్తున్నారు అని అంటున్నారు.
కూటమి గెలిస్తే చంద్రబాబు సీఎం అవుతారు అని చెబుతున్న బాలయ్యకు రాజకీయ ఆశలు ఇంకా ఏమైనా ఉన్నాయా అన్న చర్చ వస్తోంది. వాస్తవానికి బాలయ్య 2014లో గెలిచినపుడే ఆయన మంత్రి అవుతారు అని అంతా అనుకున్నారు. కానీ అది జరగలేదు. అసలు ఎన్నికల్లో పోటీ చేయని లోకేష్ ఏకంగా అయిదు శాఖలకు మంత్రి అయిపోయారు. ప్రత్యక్ష ఎన్నికల్లో గెలిచిన బాలయ్య మాత్రం జస్ట్ ఎమ్మెల్యేగా ఉండిపోయారు.
ఇక 2019లో బాలయ్య గెలిచినా టీడీపీ విపక్షానికి పరిమితం అయింది. దాంతో ఆయనకు కలసి రాలేదు. ఈసారి కూటమి గెలిస్తే కనుక బాలయ్య తప్పకుండా మంత్రి అవుతారు అని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. అయితే అది సాధ్యమేనా అన్నది కూడా చర్చకు వస్తోంది. ఎందుకంటే చంద్రబాబు సీఎం అవుతారు. లోకేష్ కి మంత్రి ఇవ్వాల్సి ఉంటుంది. పవన్ కి మంత్రి పదవి ఇస్తే ఇక బాలయ్యకు చాన్స్ ఉంటుందా లేదా అన్నదే చర్చగా ఉంది.
అయితే బాలయ్యకు ఇపుడు కాకపోయినా ఆ తరువాత అయిన రాజకీయ దశ తిరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆయన మంత్రి కాకపోవచ్చు కానీ టీడీపీలో చంద్రబాబు తరువాత సీఎం సీటుకు పోటీదారు మాత్రం అవుతారు అని అంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో చంద్రబాబు అరెస్ట్ అయి జైలుకు వెళ్లినపుడు బాలయ్య మంగళగిరి కేంద్ర కార్యాలయంలో చంద్రబాబు సీటులోనే కూర్చుని పార్టీ మీటింగ్స్ పెట్టారు. దాంతో పాటు అప్పట్లో ఆయన కొంత హడావుడి చేశారు. దానిని చూసిన వారు బాలయ్యలో రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయని అంటున్నారు.
ఆయన చంద్రబాబు సీఎం గా ఉండగా మాత్రం ఏమీ అనేది ఉండదని బాబు తరువాత మాత్రం తనకే చాన్స్ రావాలని ఆశించవచ్చు అన్న కధనాలు కూడా వచ్చాయి. బాలయ్యకు సొంతంగా సభలు పెడితే జనాలు వచ్చేంత స్థాయి ఉంది. సినిమాల్లో ఆయన హీరోగా కొనసాగుతున్నారు. టీడీపీలో చంద్రబాబు తరువాత బాలయ్యే కీలకం అవుతారు అని నందమూరి అభిమాన గణం భావిస్తోంది.
వీటన్నింటి నేపధ్యంలో సోలోగా బాలయ్య నిర్వహిస్తున్న ఎన్నికల సభలను చూస్తే తన సత్తాను చాటుకునే యత్నమే అంటున్నారు.మరి సినిమాల్లో లెజెండ్ గా ఉన్న బాలయ్య పొలిటికల్ లెజెండ్ అవుతారా అంటే కాలమే జవాబు చెప్పాలి. ఈ రోజుకు అయితే బాబే సీఎం అంటూ బాలయ్య ఊరూరు తిరుగుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.