మాధవీలతకు హగ్.. ఏఎస్ ఐకి షాకిచ్చిన సీపీ!
ఎన్నిక లప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మాధవీ లత సైదాబాద్ పరిధిలో రోడ్ షో నిర్వహించారు
బీజేపీ అభ్యర్థి, హైదరాబాద్ పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేస్తున్న ప్రముఖ వైద్య వ్యాపారి మాధవీలతపై ప్రేమను కురిపిస్తూ.. ఓ మహిళా అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ హగ్ ఇచ్చారు. అయితే.. పార్లమెంట్ ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో ఉన్నతాధికారులు ఆమెపై సీరియస్ అయి.. వెంటనే సస్పెండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న విషయం తెలిసిందే. దీనిని అధికారులు పక్కాగా పాటించాలి. లేకపోతే.. కొంపమీదకు తెచ్చుకున్నట్టే అవుతుంది. మరి ఈ విషయం తెలుసో.. తెలియదో కానీ.. ఆ మహిళా ఏఎస్ ఐ రెచ్చిపోయారు.
ఎన్నిక లప్రచారంలో భాగంగా బీజేపీ అభ్యర్థి మాధవీ లత సైదాబాద్ పరిధిలో రోడ్ షో నిర్వహించారు. ఈ సమయంలో ట్రాఫిక్‌ను కంట్రోల్ చేస్తున్న ఏఎస్ఐ ఉమా దేవి... యాత్ర సమయంలో మాధవీలతను చూసి.. ప్రేమ కురిపించారు. వాహనంపై ఉన్న ఆమె వద్దకు నేరుగా వెళ్లి చేతిలో చేయి వేసి.. అభినందించారు. అనంతరం.. ఆమే మాధవీలత భుజంపై చేయి వేసి.. మరీహగ్ చేసుకున్నారు. ఇక, అధికారులే హగ్ చేసుకుంటే.. నాయకులు వదులుతారా? మాధవీలత మరింత దగ్గర తీసుకున్నారు. అనంతరం.. మీదే విజయం అన్నట్టుగా బొటనవేలు పైకి పెట్టి మరీ ఏఎస్ ఐ అభినందించారు.
కట్ చేస్తే.. ఈవీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దీనిపై విమర్శలు జోరందుకున్నాయి. మరోవైపు ఎంఐఎం నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో ఈ విషయం తన దృష్టికి రావడంతో హైదరాబాద్ సీపీ శ్రీనివాస్ రెడ్డి ఫైరయ్యారు. సదరు మహిళా ఏఎస్ ఐని సస్పెండ్ చేస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు. అంతేకాదు.. విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారికి కూడా వివరించారు. ఓ నివేదికను కూడా సమర్పించారు. అక్కడితో ఆగకుండా.. పోలీసులు ఎవరూ నాయకులకు.. పార్టీలకు చేరువ కావొద్దని.. దూరంగా ఉండాలని సూచించారు. ఇదీ.. సంగతి!! ఆకు వచ్చి ముల్లుమీద పడ్డా.. అనే సామెతను గుర్తు చేసింది ఈ ఘటన.