చట్టం పెద్దల సభలకు వర్తించదా ?
అర్ధం ఏమిటంటే లోక్ సభ, అసెంబ్లీలనే నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటు అంటే రాజ్యసభ+లోక్ సభ అని అర్ధం
మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందటం ఖాయమైపోయింది. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తించబోయే బిల్లును పార్లమెంటులో ప్రభుత్వం బుధవారం ప్రవేశపెట్టబోతోంది. బిల్లు దాదాపు ఏకగ్రీవంగానే ఆమోదం పొందుతుందనటంలో సందేహం లేదు. బిల్లు చట్టం రూపంగా మారగానే అంటే 2029 ఎన్నికల నుండి చట్టం వర్తించబోతోంది. ఇంతవరకు బాగానే ఉంది కానీ చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అంటే అర్ధమేంటి ?
అర్ధం ఏమిటంటే లోక్ సభ, అసెంబ్లీలనే నిపుణులు చెబుతున్నారు. పార్లమెంటు అంటే రాజ్యసభ+లోక్ సభ అని అర్ధం. మరి నిపుణులు చెబుతున్నదాని ప్రకారం మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం లోక్ సభ నియోజకవర్గాలకు మాత్రమే వర్తిస్తుందట. అలాగే రాష్ట్రాల్లో అసెంబ్లీలకు మాత్రమే చట్టం వర్తిస్తుందని అంటున్నారు. అంటే పార్లమెంటులో రాజ్యసభకు, రాష్ట్రాల్లో శాసనమండలికి మహిళా రిజర్వేషన్ బిల్లు వర్తించదని చెబుతున్నారు. ఇదే నిజమైతే మహిళా రిజర్వేషన్ బిల్లు కేవలం సగంమాత్రమే అమల్లోకి వచ్చినట్లుగా అనుకోవాలి.
545 నియోజకవర్గాలున్న లోక్ సభకు మాత్రమే మహిళల రిజర్వేషన్ చట్టం వర్తిస్తుందంటే మరి 275 స్ధానాలున్న రాజ్యసభకు ఎందుకు వర్తింపచేయకూడదు ? మళ్ళీ ఇందులో వివక్ష ఏమిటో అర్ధంకావటంలేదు. శాసనమండలి అన్నీ రాష్ట్రాల్లోను లేదు. పైగా శాసనమండలి ఉన్న రాష్ట్రాల్లో కూడా ప్రతి రాష్ట్రానికి సంఖ్య మారిపోతుంది. నిజానికి మండలిలో కూడా మహిళా రిజర్వేషన్ను వర్తింపచేయించచ్చు. ఎలాగంటే ఎన్ని రాష్ట్రాల్లో శాసనమండలి ఉంటే అన్నీ రాష్ట్రాల్లోను, ఎన్ని సీట్లుంటే అన్నీ సీట్లలోనే 33 శాతం రిజర్వేషన్ వర్తింపచేయచ్చు.
కానీ అలా చేయకుండా కేవలం లోక్ సభ, అసెంబ్లీల్లో మాత్రమే మహిళల రిజర్వేషన్ వర్తింపచేయబోతున్నారంటే అర్ధమేంటి ? మహిళల విషయంలో పురుషుల్లో చాలామందికి ఇంకా వివక్ష తొలగలేదని, చిన్నచూపు పోలేదని అర్ధమవుతోంది. ఈ విషయాన్ని చట్టసభల్లోని మహిళా ప్రతినిధులు ఎందుకు ఆలోచించటంలేదు ? రాజ్యసభ, శాసనమండలిలో కూడా మహిళలకు రిజర్వేషన్ వర్తింపచేస్తే వచ్చే నష్టం ఏమిటో అర్ధంకావటంలేదు. మరి దీనిపై మహిళా సంఘాలు, మహిళా వృత్తి నిపుణులు ఆలోచించాల్సిందే.