ఓ వైపు వరదలు.. మరోవైపు వైసీపీ, టీడీపీ వార్‌ ఏంటిది?

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడలో గత వందేళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది.

Update: 2024-09-02 11:30 GMT

ఆంధ్రప్రదేశ్‌ లోని విజయవాడలో గత వందేళ్లలో లేనంతగా వర్షం పడి ఊరంతా నీట మునిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలకు స్థానికంగా ఉన్న వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది భీకరంగా ప్రవహిస్తోంది. రాజధాని అమరావతి ప్రాంతాన్ని, విజయవాడ నగరాన్ని వరద చుట్టుముట్టింది. సీఎం చంద్రబాబు నివాసంతోపాటు పలువురు మంత్రుల నివాసాలు, ప్రభుత్వ అధికారుల భవనాలు కూడా నీటమునిగాయి.

ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. స్వయంగా సీఎం చంద్రబాబు విజయవాడలోని కలెక్టర్‌ కార్యాలయంలోనే బస చేసి సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. స్వయంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

పరిస్థితి «ఘోరంగా ఉండి ప్రజలు వరదలతో అల్లాడుతుంటే.. వైసీపీ, టీడీపీ సోషల్‌ మీడియాలో వార్‌ కొనసాగిస్తుండటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడలో కృష్ణా నది అంచున కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలు ఉన్నాయి. గతంలో వరద వస్తే ఈ ప్రాంతాలను వరద చుట్టుముట్టేది. ప్రజలు వరదలో చిక్కుకునేవారు. ఈ నేపథ్యంలో 2014లో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిటైనింగ్‌ వాల్‌ నిర్మించింది. కృష్ణా నదిలో 3.1 కిలోమీటర్ల మేర పొడవునా ఈ రిటైనింగ్‌ వాల్‌ ఉంది. ఈ రిటైనింగ్‌ వాల్‌ ఉండటంతో ఇప్పుడు ప్రకాశం బ్యారేజీలో 11 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చినా కృష్ణలంక, రామలింగేశ్వర నగర్, యనమలకుదురు ప్రాంతాలకు వరదనీరు చేరలేదు.

దీన్ని వైసీపీ తమ ఘనతే అని చెప్పుకుంటుంది. విజయవాడలో కృష్ణా నదిలో తామే రిటైనింగ్‌ వాల్‌ నిర్మించామని.. దానివల్లే వరద నీరు విజయవాడలో లోతట్టు ప్రాంతాలయిన రామలింగేశ్వర్‌ నగర్, యనమలకుదురు, కృష్ణలంక ప్రాంతాలను చుట్టుముట్టలేదని చెప్పుకుంటోంది. ఇదంతా గత ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ దార్శనికతతోనే సాధ్యమైందని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది.

12 లక్షల క్యూసెక్కులు వరద వచ్చినా చుక్కనీరు ఇళ్లలోకి రాకుండా రూ.474.51 కోట్లతో కృష్ణానది వెంబడి పద్మావతి ఘాట్‌ నుంచి యనమలకుదురు వరకు మూడు దశల్లో 5.66 కిలో మీటర్లు పటిష్టంగా రక్షణ గోడ నిర్మించారని వైసీపీ ప్రచారం చేసుకుంటోంది. దాని వల్లే ఈ స్థాయిలో వరద వచ్చినా ఆ ప్రాంతాలను వరద నీరు తాకలేదంటోంది.

వైసీపీ ప్రచారానికి టీడీపీ గట్టి కౌంటర్‌ ఇచ్చింది. ‘‘చేతకాని వాడి సరదాలు, సంబరాలు.. చంద్రబాబు గారు చేసిన పనిని, తన పనిగా చెప్పుకుంటూ స్వయంతృప్తి పొందుతున్న సైకో బ్యాచ్‌.. రియాలిటీ చూస్తే.. గూగుల్‌ ఎర్త్‌ లో, 2019 ఏప్రిల్‌ నాటికే చూపిస్తున్న కృష్ణలంక రీటైనింగ్‌ వాల్‌.. చేయని పనులు చేసినట్టుగా చెప్పుకు తిరుగుతూ, సైకోకి పిచ్చి ముదరటంతో, రేపటి నుంచి నెల రోజుల పాటు లండన్‌ కి ట్రీట్మెంట్‌ కోసం తీసుకుని వెళ్తున్న కుటుంబ సభ్యులు’’ అంటూ టీడీపీ సోషల్‌ మీడియాలో వైసీపీకి కౌంటర్‌ ఇచ్చింది.

మరోవైపు వైసీపీ, టీడీపీ సోషల్‌ మీడియా వార్‌ పై నెటిజన్లు మండిపడుతున్నారు. ప్రజలు ఓవైపు వరదలో చిక్కుకుంటే వారికి సాయం చేసే పనుల్లో ఉండకుండా క్రెడిట్‌ కోసం ఈ కొట్లాట ఏమిటంటూ ధ్వజమెత్తుతున్నారు.

Tags:    

Similar News