వైసీపీ బస్సు యాత్రకు వేళైంది... షెడ్యూల్ ఇదే!
ఉత్తరాంధ్ర సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటికే “గడప గడపకు మన ప్రభుత్వం”, “జగనన్న సురక్ష”, “జగనన్న ఆరోగ్య సురక్ష” వంటి కార్యక్రమాలతో ప్రజలకు ఎంతో చేరువవుతున్న కార్యక్రమాలు చేస్తోన్న జగన్... ఇటీవల వైసీపీ బస్సు యాత్ర అంశాన్ని తెరపైకి తెచ్చిన సంగతి తెలిసిందే.
పార్టీ ప్రతినిధులతో నిర్వహించిన సభలో వైఎస్ జగన్... బస్సుయాత్ర గురించి వెల్లడించిన నేపథ్యంలో షెడ్యూల్ ను వెల్లడించారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఈ సందర్భంగా స్పందించిన ఆయన... రాజ్యాధికారం అన్ని వర్గాలకు అందించాలన్న ధ్యేయంతో వైసీపీ ప్రభుత్వం పని చేస్తోందని, ప్రధాన పదవులన్నీ వెనుకబడిన వర్గాలకు కేటాయించిన ఘనత జగన్ కే దక్కుతుందని అన్నారు.
ఈ సందర్భంగా... వైసీపీ సామాజిక బస్సుయాత్ర తేదీలను ప్రకటించారు బొత్స. ఇందులో భాగంగా... అక్టోబర్ 26 నుంచి 9 వరకు ఉత్తరాంధ్రలో బస్సు యాత్ర జరుగుతుందని.. ముందుగా, ఇచ్ఛాపురం నుంచి యాత్ర మొదలవుతుందని.. అనకాపల్లితో ముగుస్తుందని వివరించారు. అంటే 13 రోజుల పాటు ఈ యాత్రలు సాగనున్నాయని.. ఈ క్రమంలో ప్రతి నియోజకవర్గంలోనూ బహిరంగ సభ నిర్వహిస్తామని ఆయన చెప్పారు.
ఉత్తరాంధ్ర సామాజిక బస్సు యాత్ర షెడ్యూల్ ఈ విధంగా ఉంది.
ఈ నెల 26 న ఇచ్చాపురంలో మొదలవబోతోన్న ఈ సామాజిక బస్సు యాత్ర... 27న గజపతినగరం, 28న భీమిలి, 30న పాడేరు, 31న ఆముదాలవలస, నవంబర్ 1న పార్వతీపురం, నవంబర్ 2న మాడుగుల, నవంబర్ 3న నరసన్నపేట, నవంబర్ 4న శృంగవరపు కోట, నవంబర్ 6న గాజువాక, నవంబర్ 7న రాజాం, నవంబర్ 8న సాలూరు, నవంబర్ 9న అనకాపల్లితో ముగుస్తుంది.