టీడీపీ ఫైర్ బ్రాండ్ మీద వైసీపీ క్యాండిడేట్ ఫిక్స్...!
అయ్యన్నను ఓడించాలంటే ఉమా శంకర్ కంటే గట్టి క్యాండిడేట్ ఎవరూ లేరని వైసీపీ నిర్ధారణకు వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో ఉమా శంకర్ కూడా సొంత పార్టీలో రిపేర్లు చేసుకున్నారని అంటున్నారు.
ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ నుంచి ఫైర్ బ్రాండ్ మినిస్టర్ అంటే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని చెప్పుకోవాలి. ఆయన పాతికేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. పెళ్ళి కాకుండానే మంత్రి అయిపోయారు. నాటి దూకుడు ఏడు పదులకు చేరువ అవుతున్నా ఎక్కడా తగ్గేది లేదు అంటున్నారు. అయ్యన్నపాత్రుడు 2019 ఎన్నికల్లో పాతిక వేల ఓట్ల పై చిలుకు తేడాతో ఓటమి పాలు అయ్యారు.
ఆయన్ని ఓడించింది ఒకనాటి ఆయన శిష్యుడే. ఆయనే నర్శీపట్నం సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్. ఆయన అయ్యన్న దగ్గర శిష్యరికం చేసి ఆయన గుట్లూ పట్లూ అన్నీ తెలుసుకుని గురువునే ఓడించేశారు. ఇక 2024 ఎన్నికల్లో ఎవరు అయ్యన్న మీద పోటీ చేస్తారు అన్న చర్చ అయితే వైసీపీలో వస్తోంది. ఎందుకంటే నర్శీపట్నంలో గతానికంటే టీడీపీ బలం పెరిగింది అని అంటున్నారు.
అయ్యన్న కూడా ఓడిన దగ్గర నుంచి ఎక్కడా వెనకడుగు వేయకుండా తన దైన శైలిలో పోరాడుతున్నారు. దాంతో పాటు ఆయన ఏకంగా సీఎం మీదనే విమర్శలు చేస్తూ వస్తున్నారు. జగన్ని ఆయన చాలా ఎక్కువగా విమర్శలు చేస్తూ టార్గెట్ అయ్యారు. ఈసారి అయ్యన్న అసెంబ్లీకి గెలవవద్దు అని వైసీపీ పెద్దలు తీర్మానించారు అని అంటున్నారు. ఇది వైసీపీ హై కమాండ్ పట్టుదల అని కూడా అంటున్నారు.
దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అయ్యన్న మీద పోటీకి ఈసారి సరిపోతారా లేక కొత్త క్యాండిడేట్ ని దించాలా అన్న చర్చ కూడా వైసీపీలో నడచింది. అదే సమయంలో వైసీపీ సీటు విషయంలో చాలా మంది ఆశలు పెట్టుకున్నారు. అందులో స్వయంగా అయ్యన్నపాత్రుడి తమ్ముడు అయిన చింతకాయల సన్యాసిపాత్రుడు కూడా ఉన్నారు. ఆయన 2019లో వైసీపీలోకి వచ్చారు. వైసీపీ విజయానికి ఆయన బాగా దోహదపడ్డారు.
అదే విధంగా నాడు వైసీపీలో ఉన్న వారిలో కొందరు టీడీపీ వైపు వెళ్లారు వారిని అలా పంపించడంలో ఉమాశంకర్ ఒంటెద్దు పోకడలు ఉన్నాయని అంటారు. దాంతో అన్నీ సరిచూసుకోమని లేకపోతే టికెట్ కష్టమని అధినాయకత్వం హెచ్చరించిందని కూడా చెప్పుకున్నారు.
దాంతో ఉమా శంకర్ గణేష్ కి ఈసారి టికెట్ దక్కదని కూడా అంతా భావించారు. అయితే తాజాగా నర్శీపట్నంలో జరిగిన వైసీపీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి మరోసారి ఉమా శంకర్ నే గెలిపించాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. దాంతో పెట్ల అభ్యర్ధిత్వం ఖారారు అయింది అని అంటున్నారు.
అయ్యన్నను ఓడించాలంటే ఉమా శంకర్ కంటే గట్టి క్యాండిడేట్ ఎవరూ లేరని వైసీపీ నిర్ధారణకు వచ్చిందని అంటున్నారు. అదే సమయంలో ఉమా శంకర్ కూడా సొంత పార్టీలో రిపేర్లు చేసుకున్నారని అంటున్నారు. ఆయన పార్టీలోని అందరినీ కలుపుకుని పోతూ వస్తున్నారు. దాంతో అయ్యన్న మీద మరోసారి ఉమాశంకర్ నే ప్రయోగించాలని వైసీపీ హై కమాండ్ డిసైడ్ అయింది అని అంటున్నారు.
అన్ని విధాలుగా అంటే అర్ధబలం అంగబలంతో ఉన్న పెట్ల అయితేనే అయ్యన్నని మళ్లీ మాజీని చేయగలరని వైసీపీ భావిస్తోందిట. అయితే పెట్లకే మళ్లీ టికెట్ ఇస్తే అయ్యన్న తమ్ముడు ఎలా రియాక్ట్ అవుతారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు. ఆయన కనుక నాన్ కోపరేషన్ చేసినా లేక అన్నయ్యతో పాటే అని టీడీపీలో చేరినా కొంత ఇబ్బందే అంటున్నారు. అయితే ఆయన్ని కూడా హై కమాండ్ బుజ్జగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తారని అంటున్నారు. మొత్తం మీద అయ్యన్న మీద పెట్ల ఉమా శంకరే వైసీపీ క్యాండిడేట్ అని అంటున్నారు.